26 డిసెం, 2012

గజరాజు


వరుసగా నాలుగు రోజులు సెలవలు వచ్చేసరికి ఎంచేయాలా అని ఆలోచించీ,సరే సినిమాకైతే ముందు వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం నేను శ్రీవారు.
"గజరాజు" సినిమా ట్రైలర్ చూసి ఫోటోగ్రఫి అదిరింది అనుకుంటూ ఆదివారం సెకండ్ షో కి టిక్కెట్లు తీసుకుందామని హాలుకి వెళ్ళాం.
9:45 షోకి ఎనిమిదిన్నరకి కానీ ఇవ్వరట టిక్కెట్లు.9:30 వచ్చినా ఫర్వాలేదు,ఖాళీగానే ఉంది అన్నారు అక్కడివాళ్ళు.
అసలే మరీ రియలిస్టిక్ గా,విషాదాంతాలు ఎక్కువగా ఉండే డబ్బింగ్ సినీమాలంటే నాకు భయం.
హాలు ఖాళీగానే ఉంటుందనేసరికి,ఒకప్పుడు ఇలాగే ట్రైలర్ చూసి ఫోటోగ్రఫి బాగుందని,మోసపోయి చూసిన డబ్బింగ్ సినిమా  "నిరంతరం నీ ఊహలే" సినిమా గుర్తొచ్చి కొంచెం జంకాం.సరే ఇదేదో బోరింగ్ సినిమాలాగుంది అని ఆ రోజుకి లైట్ తీసుకున్నాం.

మంగళవారంతో సెలవలు అయిపోయాయి.రేపు మళ్ళీ ఆఫీసుకి వెళ్ళలా అని నేను దిగులుపడిపోతుంటే, సరే అయితే మళ్ళీ సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని,ఏ సినిమాకి వెళ్ళలో తెలియక మళ్ళీ గజరాజు సినిమాకి తీసుకొచ్చారు మా సారు.
ఆదివారంతో పోలిస్తే ఫర్వాలేదు జనాలు బాగనే ఉన్నారు హాలులో.సరేలే ఎదో బాగుందని టాక్ వచ్చుంటుందని లోపలికి వెళ్ళాం.అయిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యేచ్ ఉన్నా, ఇంతమంది రావడంతో సినిమా మీద ఆశలు పెరిగాయి.
లోపకెళ్ళి కూర్చున్నాం.
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా
దర్శకుడు ప్రభు సోల్మన్ ఎన్నుకున్న నేపధ్యం,
కేమెరామేన్ పనితనం,
ఇమ్మన్ సంగీతం,
కధలో అంతర్లీనంగా ఇమిడిపోయిన హాస్యం .
టూకీగా కధేమిటంటే,
అడవి ఏనుగులు దాడి చేస్తే వాటిని మళ్ళీ అడవిలోనికి తరిమేసే శిక్షణ పొందిన ఏనుగులను "గుంకీ" ఏనుగు అంటారు.
అనుకోని పరిస్థితుల్లో 'మాణిఖ్యం' అనే  ఒక  ఉత్సవ ఏనుగును గుంకీ ఏనుగుగా  దేవగిరి మన్యం ప్రజలను 'కపాలి' అనే అడవి ఏనుగునించి కాపడడానికి  తీసుకొస్తాడు కధానాయకుడు.అక్కడ కధానాయికను చూసి ప్రేమలో పడి,ఉత్సవ ఏనుగును గుంకీ ఏనుగుగా అక్కడివారిని నమ్మిస్తాడు.


అక్కడి వారు రెండువందల ఏళ్ళ చరిత్ర కలిగి కట్టుబాట్లంటే ప్రాణం ఇస్తారు.అలాగే తమ కట్టుబాట్లను ఎదురిస్తే ప్రాణాలు తీస్తారు కూడా.
అతని ప్రేమ కధ ఎమవుతుంది.కట్టుబాట్లను ఎదిరించి ప్రేమను పొందగలిగాడా?
మాణిఖ్యం కపాలిని ఎదురించగలిగిందా అనేది కధ.
మాణిఖ్యం ,కధానాయకుడి మధ్య గల అనుబంధం ,మాణిఖ్యానికి కధనాయికుడి మీద గల అపారమైన ప్రేమ కంటతడి పెట్టిస్తుంది.


ప్రేమలో పడి కధనాయకుడు చేసిన తప్పులకి చెల్లించిన మూల్యం కదిలిస్తుంది.

ట్రైలర్లో చూపించినట్లుగానే అందమైన ప్రకృతి దృశ్యాలు కేమెరామేన్ పనితనంతో కనువిందు చేసాయి.ఎటువంటి మేకప్ లేకుండా సాధారణంగా చూపించబడినా నాయికను కేమెరాఆంగిల్స్ తో అద్భుతంగా చూపించారు.
పాటలలో అయితే సంగీతంతో పాటూ కేమెరా కదిలిన విధానం నవ్యంగా ఉంది.సంగీతం విషయానికొస్తే  కధలో ఒదిపోయింది.ఎమోషన్స్ పండించడంలోనే కాక మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి పాటలు.పాటల సాహిత్యం కూడా చాలా బాగుంది.
సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు పాటలు
1.చెప్పేసాలే నా ప్రేమని..2.అయ్యయ్యయ్యో ఆనందమే..చిన్న చిన్న విమర్శలు ఉన్నా,మొత్తం మీద సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసామనే భావన తప్పక కలుగుతుంది.అదే సమయంలో మనసు వేదనతో నిండిపోతుంది కూడా.ఏనుగు నటన అద్భుతం .

చూసిన తర్వాత వెంటాడే సినిమా ఇది.


2 వ్యాఖ్యలు:

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))