??????

11 జన, 2019

నల్లమల వనవిహారం

కొండలు..వాగులు..మానులు.వాటిని అల్లుకొనే అల్లిబిల్లి సుమలతల అందాలు
ఇవన్నీ ఎందుకో నాకు అంతులేని ఆసక్తి,చిన్నప్పటి చందమామ కధల్లో బొమ్మల జ్ఞాపకాలు.


అందుకే అడవుల్లోకి వనవిహారం అనగానే ఎక్కడలేని హుషారు.
ఇంతకీ ఎక్కడికి వెళ్ళాను ఏమిటో చెప్పనేలేదు కదూ.
డిశంబరు,జనవరి సాధారణంగా విహారాలకు అనుకూలమైన కాలం. పాప పుట్టాక ఈ తిరుగుళ్ళు అన్నీ కట్టిపెట్టేశాం. కానీ, మళ్ళీ మూడు సంవత్సరాల తర్వత ఇప్పుడు పాపని తీసుకొని వెళ్ళవచ్చు అని అనిపించింది.
అందుకే వారంతంలో ఎక్కడికైనా వెళ్దామని తెగ ఆలోచిస్తుంటే ,అప్పుడెప్పుడో ఈనాడు పత్రికలో నల్లమల అడవుల విహరం గురించి చదివిన జ్ఞాపకం.
ఆ కధనం గురించి తెగ వెతికేస్తుంటే ఎక్కడా కనిపించలేదు.చివరికి నా వెతుకులాట చూసి స్నేహితురాలు కూడా ఒక చెయ్యి వేస్తే దొరికింది ఆ కధనం ఇక్కడ.

ఇక వెంటనే ఆలశ్యం చేయకుండా మాకు, చెల్లి వాళ్ళకి ఆన్లైన్లో పచ్చర్లలో పాలపిట్ట అనబడే కాటేజి బుక్ చేశేసాం.ఇక్కడ కాటేజీలు,టెంట్లు ఉన్నాయి కానీ,చలి మరీ ఎక్కువ ఉంటుందేమో అని మేము కాటేజి బుక్ చేసాం.
అనుకున్న శనివారం రానే వచ్చింది.
అందరం ఎంతో ఉత్సహంగా ఉదయం ఆరు గంటలకే హైదరాబాద్ నించి బయల్దేరాము.
గూగులమ్మ చక్కగా దారి చూపిస్తుంటే,సూర్యోదయాన్ని చూస్తూ రింగు రోడ్డు మీదుగా కారు కన్నా వేగంగా మనసు పరుగు పెడుతుంది.
ఒక గంట తర్వాత మాకు జంగిల్ కాంప్ నించి ఫోన్ వచ్చింది ,బయలుదేరారా సార్ ?దారి చెప్పమంటారా అని, ఆ మత్రం వారు చుపించే ఆసక్తి మా ఉత్సహాన్నీ ఇంకా పెంచింది. ఒక గంట తర్వత, ఫలహారం చేద్దామని ఒకచోట  ఆగాం.ఫలహారం అంతంత మాత్రమే అయినా ధరలు మరీ ఎక్కువ.ఇంక ఏదో అయ్యింది అనిపించి మళ్ళీ బయలుదేరాము.

కర్నూలు మీదుగా రోడ్డూ,చుట్టూ కొండలు దారంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది.
గూగులమ్మ ఇంకో అరగంటలో చేరుకుంటాం అని చెప్తుంది కానీ,ఎక్కడా అడవి కాదు కదా పెద్ద చెట్లు కూడా కనిపించడంలేదు.మేమంతా ఇదేమిటి ఇంకా అడవి రావటంలేదు అని నిరుత్సాహపడిపోతుంటే, ఇంకో పది నిమిషాలు ఉందనగా ఒక్కసారిగా చుట్టూ పరిసరాలు మారిపోయాయి,వంపుల ఘాట్ రోడ్డు,చుట్టూ చెట్లూ ,కార్ల చుట్టూ తిరిగుతున్న వానర సేన.
అందంగా ఉన్నానా లేదా? :)
ఇవన్నీ కళ్ళప్పగించి చూస్తుండగానే గమ్యస్థలం వచ్చేసాం.ఫోనులో సిగ్నల్స్ కూడ పూర్తిగా పోయాయి.

ఈ  గేటు దాటి లోపలకు వెళ్లగానే,చుట్టూ పరిసరాలు చూసి కారు పార్క్ చేసేవరకూ కూడా మనసు ఆగలేకపోయింది.అందరం కారు దిగి సరాసరి ఇదిగో ఈ టైర్ల ఉయ్యల దగ్గరకు వచ్చేసాం.
PC:Google


 అన్నీ మర్చిపోయి అందరం పాపతో పాటూ చిన్నపిల్లలైపోయాము .కేరింతలు నవ్వులు ఒక పది నిమిషాల తర్వత మాకు గుర్తొచ్చింది. మా టిక్కట్లు గట్రా ఆఫీసు రూములో చూపించి ముందు రూము లో లగేజీ అంతా పెట్టాలి కదా అని,ఇవన్నీ అయ్యాక ఒక అబ్బాయి(ఈ అబ్బాయి పేరు రాసీద్)కాటేజి దాక వచ్చి తాళాలు అవి ఇచ్చి వెళ్ళాడు.
ఆ కాటేజి,ఎదురుగా ఉన్న వాగు,పక్కనే ఆ చెట్లు అవన్నీ చుస్తునే నాకు ఎమీ చెయ్యలో అర్దమే కాలేదు,
ఆ వాగు దగ్గర ఆగి రంగుల పువ్వులని,వాటి చుట్టూ తిరుగుతున్నసీతాకోకచిలుకలనే చుడనా?  లేకపొతే ఆ వాగు దాటి వెళ్ళీ చుట్టూ ఉన్న చెట్లు,వాటి మీద రకరకాల పక్షుల కువకువలనే విననా?
లేకపోతే కాటేజి ముందర ఏకంతంగా ఉన్న కుర్చిలో కూర్చోని మంచి పుస్తకాన్నే చదవనా? ఇన్ని అందాలను కళ్ళతోనే చూడనా,కెమేరాలోనే బంధించనా?

Add captionమేము దిగిన కాటేజి 

మా చిన్ని ఏకలవ్యుడు(రాలు?)😝ఏమి చెయ్యాలో ,తెలియక అటూ,ఇటూ తెగ తిరిగేస్తుంటే ,శ్రీవారు నా పరిస్ఠితి గమనించి "ఇంకా ఇక్కడే ఇరవైనాలుగ్గంటలు ఉంటాం " అని గుర్తు చేసారు.
 అప్పటికి అందరికీ ఆకలి గుర్తొచ్చింది ,అదే అక్కడున్న రసీద్ ని అడిగితే ,భోజనం తయారు అయ్యాక కబురు తెస్తానన్నాడు.ఈ లోపు నలుగురం (కాదు ఐదుగురం పాపతో కలిపి)ఎవరి దారి వారుగా చుట్టూ పరికించడం మొదలు పెట్టాం.కెమేరాలు పట్టుకొని ఎవరికి వారే ఆ ప్రకృతి  అందాలు బందించడంలో నిమగ్నమైపొయాం .పాప ఎమో అక్కడికి వచ్చిన కుక్కపిల్లతోనూ,పనిచేసే పెద్దవారితో   వచ్చిన పిల్లలతోనూ ఆడుకుంటుంది.
ఈ లోపు భోజనం  తయ్యారు అయ్యిందన్న కబురు వచ్చింది.
బాగా అకలిగా ఉన్నామేమో,వెంటనే అందరం కేంటీన్ వైపు దారి తీశాం.
కాటేజి నించి కేంటీన్ కి వెళ్లలంటే ఇదిగో ఈ వేళ్ళాడే వంతెన మీదుగ వెళ్ళాలన్నమాట.ఇది భలే సరదాగా ఉంది.
ఆవురావురుమంటూ కేంటేన్ కి వెళ్ళగానే ,అక్కడ ఉండే ఒకావిడ సెల్ఫ్ సర్వీసు అని చెప్పింది సరే అని అందరం పళ్ళాలు పట్టుకొని ,అక్కడ ఉంచిన భొజనం వైపుకు వెళ్ళాం,
అక్కడ పులిహోర,అన్నం,పప్పు ,బంగళాదుంపు వేపుడు,పెరుగు మాత్రమే ఉన్నాయి.విందుభోజనాన్నీ,కనిసం ఒక పదిరకాల పదార్ధాలని ఆశిస్తూ,ఆకలితో వచ్చిన మాకు, ఆ పదార్ధాలని చూసి సగం నీరసం వచ్చింది.అయినా ఆకలి కేకలు పెడుతుంటే వడ్డించుకున్నాం.
కానీ అది పులిహోర అయినా ,వేపుడు అయినా,పప్పు అయినా,ఆఖరికి పెరుగు అయినా ఇంట్లో చేసినట్లుగా ఎంతో రుచిగా ,శుచిగా ఉన్నాయి.అందరం కడుపు నిండా సంతృప్తిగా  భోజనం చేసాము.
మళ్ళీ ఆ వేళ్ళాడే వంతెన మీదుగా వచ్చాక అక్కడ కొన్ని సాహస క్రీడలు ఉన్నాయి.


దీని మీద వెల్లకిలా పడుకొని పైనున్న చెట్లనీ,పక్షులనీ చుస్తూ ఉంటే ఎంత అందమైన అనుభూతి కలిగిందో 

PC:Google

అక్కడ అందరం ఆడుకుంటుంటే,అక్కడికి వచ్చిన రసీద్ నాలుగ్గంటలకి తయరుగా ఉంటే జంగిల్ సఫారికి తీసుకువెళ్తానన్నాడు.
 అప్పటికి సమయం మూడు కావచ్చింది, ఇంక ఆ గంట అక్కడే కాలక్షేపం  చేసి నాలుగ్గంటలకల్లా సఫారీకి తయారయ్యి బయలుదేరాము.


అందరం సఫారీ బండి ఎక్కాము,కొంతదూరం ఘాట్ రోడ్డుమీదగా పోయిన తర్వాత బండి అభయారణ్యం లోనికి ప్రవేశించింది.పాప ఆనిమల్స్ కోసం ఎంతో ఉత్సాహంగా చూడసాగింది.
ఇది ఆకు రాలే కాలమేమో చెట్లన్నీ నారింజ ,గులబి,పసుపు పచ్చ ఆకులతో ,అవే రంగులలో కింద రాలిపడిన ఆకులతో అడవంతా ఒక వర్ణచిత్రంలా ఉంది.
కొంత దూరం లోపలికి పోయాక డ్రైవరు 'దొంగల బావి.' అనబడే దిగుడు బావి(ఒకరకం అది ఊబి) దగ్గర ఆపారు.

పూర్వ కాలంలో దొంగలు దొంగిలించిన వాటిని ఆ బావి దగ్గర దాచడం వలన దానికి ఆ పేరు వచ్చిందని ఆయన దాని గురించి వివరించారు,అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే అందరం దాని ఊడల సాయంతో ఊగే ప్రయత్నం చేసాం కానీ ,చూడ్డానికి అలవోకగా కనిపించే ఈ పని మనలంటివారికి చాల కష్టమని అర్దమయ్యింది. అక్కడ కొన్నీ ఫోటోలు తేసుకొని మళ్ళీ బండి ఎక్కాము.

కొంత దూరం లోపలికి వెళ్ళాక ఒక అందమైన నెమలి కనిపించింది.నేను నెమలి బయట చాలా సార్లు చుశాను కానీ  ఆ అడవిలో ,అది అంత నిర్భయంగా ,రాజసంగా తిరుగుతుంటే ఎంతో అందంగా కనిపించింది.
ఇంకొంచెం దూరం లోపలికి పోగానే కొండకోళ్ళు ,అడవి ఉడుతలు కనిపించాయి.


బండి లోపలికి పోతూ ఉంటే చుట్టూ ఉన్న పరిసరాలు చిత్రంగా మారిపోతున్నాయి.
దట్టమైన గొధుమరంగు గడ్డి పొదల గుండా కాసేపు,
వెదురు పొదల గుండా కాసేపు
ఒకప్పుడు ఈ దారిలో ఒక రైల్వే  లైను ఉండేదంట,ఇప్పుడు ఆ  దారిలోనే  సఫారి బండి పోతున్నది(బాలకృష్ణ ,విజయశాంతి మధ్య చిత్రీకరించిన రౌడీఇన్స్పెక్టర్ చిత్రంలోని టక్కుటమరం బండి పాట ఇక్కడే చిత్రీకరించారంట)
ఈ దారిల గుండా తీసుకుపోయి బండి ఒక వ్యూ పాయింట్ దగ్గర  ఆపారు.
ఆ వ్యూ పాయింట్ ఒక మంచెలాగ ఉంది.దాని మీద నించి చూస్తే చుట్టూ కొండలు ,మధ్యలో చిన్న సరస్సు ఎంతో ఆహ్లాదంగా ఉంది.అక్కడికి జంతువులు నీళ్ళు తాగడానికి వస్తాయంట,మేము కొంతసేపు  ఎదురు చుశాము కానీ మాకు ఎమీ కనిపించలేదు.


తర్వాత బండి దట్టమైన అరణ్యం లోనికి ప్రవేశించింది .చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు,నిశబ్దాన్ని చీల్చుకుంటు వెళ్తున్న సఫారీ బండి చప్పుడు,ఒక్కసారికి కిందకి పైకి పోతున్న దారీ,అప్పుడే ముసురుకుంటున్న చీకట్లు .ఎంతలేదన్నా అందరికీ ఏమో కానీ,నాకు మాత్రం ఇప్పుడు బండి  ఆగిపొతే ఎలారా దేవుడా అని మనసులో ఏములో దాక్కున్న భయం ,అలా అందరం ఒక్కసారిగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళం ఉండిపోయాం.
అలా ఒక అరగంట ప్రయాణం తర్వాత మళ్ళీ అడవి  పలచబడింది ,బండి మళ్ళీ ఘాట్ రోడ్ మీదుగా కాటేజి దగ్గరకు వచ్చి ఆగింది.

హమ్మయ్య !
ఇప్పటికి ఈ టపా ముగించాలి మరి !
చాలా కాలం తర్వాత రాయటం వలనో ఏమో,పదాల కోసం కొంచెం తడుముకోవల్సి వస్తుంది.
ఇంకా బోలెడన్ని విశేషాలు ఉన్నాయండోయ్! అవన్నీ వచ్చే టపాలో రాస్తానేం ..PC:
* 3lok అంటే మా మరిదిగారన్నమాట. శ్రీవారిలాగనే ఈయన కూడా మంచి ఫోటోగ్రాఫర్.ఈయన చిత్రకారుడు కూడానూ.
ఈయనగారి పైంటింగ్స్ ఫోటోల్లాగా,ఫోటోలేమో పైంటింగ్స్ లాగా ఉంటాయి మరి అది ఎమీ చిత్రమో.. 😃
ఫోటోలు ఇక్కడ వాడుకోవటానికి ఈయన ఒక షరతు పెట్టారు.ఈ టపా చదివిన వారందరూ ఆయన ఇన్స్టాగ్రాం ని కూడా ఒకసారి దర్శించాలంట .ఇదిగోండి ఇక్కడ😆


*రెండు ఫోటోలు నా దగ్గర లేకపోవటంవలన ,గూగులమ్మ సహాయం కవల్సి వచ్చింది.17 కామెంట్‌లు:

  1. mi blog chaala baagundandi,nizam ga nenu akkada vunna feeling tepincharu, mi next blog kosam wait chesthu vuntamu :)

    రిప్లయితొలగించండి
  2. really nice article..enjoyed it thoroughly,janata garraige movie lo ntr vallu andaru alane nature trip ki veltaru ah feel vachindhi mee article chadhuvuthunte

    రిప్లయితొలగించండి
  3. Good to see your hidden talent here ... keep going .. wish to see you as well known writer soon.. wish you good luck Indira

    రిప్లయితొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))