??????

27 నవం, 2012

అమ్మో ఇంజక్షనా..!


అవును ఇంజెక్షన్ అంటే మాదీ అదే రియాక్షన్ అంటారా..? 
అది ఇంజెక్షన్ చేయించుకొనే ముందు మీ రియాక్షన్ అయ్యిండొచ్చు గాక.. 
కానీ నా విషయంలో సీన్ రివెర్స్.
ఇది నాకు ఇంజక్షన్ చేసే ముందు మా డాక్టారు గారి రియాక్షను.
అదెలా అంటే నెను ఫ్లాష్బాక్లోకి వెళ్ళాలి మరీ..
టపా తెరిచాక వెళ్ళక ఛస్తామా అని మీరు అంటారని నాకు తెలుసు..మరి నాతో పాటూ వచ్చేయండి.   
అవి నేను మూడో తరగతి చదువుతున్న రోజులు.
అప్పుడు నాకు మూడు రోజులపాటూ తీవ్రమైన జ్వరం వచ్చింది.(నాలిగోతరగతి అయితే నాలుగు రోజులు వచ్చేదా అంటే నేను చెప్పలేను.).

ఇక లాభం లేదు అని మా ఊరికి ఉన్న ఏకైక డాక్టరు కం మా ఫామిలీ డాక్టరుని (ఊరందరికి ఒకే డాక్టరు అయితే ..మీ ఫామిలీ డాక్టరేమిటో అనకండి.అదేదో ఆయనతో ఉన్న చనువుకొద్దీ మా ఫీలింగ్ ).పిలిపించారు.పాపం ఆయన బక్కపలచ మనిషి అయితేనేం రావడంతోనే చెయ్యి చూసి ఇంతలావు ఇంజక్షన్ బుడ్డీని పగలగొట్టి అంతకంటే లావున్న సిరంజ్లోకి ఎక్కిస్తున్నాడు.
అంత పెద్ద సూది నా ఒంట్లో దిగబోతుందనే ఆలోచనతోనే నాకు చెమటలు పట్టేసాయి. 


ఇక నేను పీటీఉష రేంజ్లో    పరుగు లంకించుకున్నా..ఇంటి  చుట్టు తిరిగుతున్నా.ఆ సూది పట్టుకొని మా బక్కపలచ డాక్టరు కూడ తిరుగుతున్నారు.అయనకి ఎంతసేపటికి దొరకకపోవడంతో అమ్మ,నాన్న కూడా దిగారు రంగంలోకి.నేను ఇల్లు దాటి తోటలోకి పారిపోయి దాక్కున్నా..డాక్టారు వెళ్ళిపోవడం చూసిన తర్వత కానీ..నేను బయటకు రాలేదు.
ఆ రోజుకి అలా తప్పించుకున్నా..కానీ అలా పరుగు పెట్టడం వలనేమో నా జ్వరం ఇంకా ఎక్కువైంది.
మరుసటి రోజు నేను పొద్దున్నే వెచ్చగా ఉన్న దుప్పట్లోంచి బద్దకంగా లెగుద్దామంటే  ఎవరో నా చేతులు బలవంతంగా పట్టుకున్న ఫీలింగ్..ఎమిటా అని కళ్ళు తెరిస్తే..ఎదురుగా పట్టువదలని విక్రమార్కుడు కత్తి పట్టుకున్నట్లు సిరంజ్ పట్టుకొన్న మా బక్కపలచ డాక్టారు..:(. 


సరే ఏదోలా తప్పించుకుందాం అని లేవబోతుంతే అమ్మ నాన్న నా చేతులు ఇంకా గట్టిగా పట్టేసుకున్నారు..  
పక్కన చూస్తే చెల్లితో పాటూ అన్నయ్య,అక్క( పెదనాన్నగారి పిల్లలు)ఇంకా మావయ్య.:(.. 
విధి ఎంత బలీయమైనది .మందీమార్బలంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేసారు.ఈ పద్మవ్యూహంలోంచి  ఎలా తప్పించుకోవాలబ్బా అని నేను ఆలోచిస్తుండగానే   
అన్నయ్య,అక్క రెండు కాళ్ళూ పట్టేసుకున్నరు..మా బుడ్డిది(చెల్లి) దానికేం అర్దమైందో కానీ వాళ్ళకి తెగ సాయం చెసేస్తుంది...బహుశా నా మీద పగతీర్చుకోవడంలో ఇది ఒక భాగమైయుండొచ్చు దానికి..:( మవయ్య నా తల  పట్టుకున్నాడు.అంతే
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.....ఇల్లు ఎగిరిపోయేలా పెద్ద కేక..  
ఇంజక్షన్ అయిపోయింది .మా డాక్టారు గారు పెద్ద  ఆపరేషన్ చేసేసిన రేంజ్లో విజయ దరహాసాలను చిందించుచున్నారు. 
నేను బేర్ బేర్ మని ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను.   


ఆ రోజూనించీ మా డాక్టారు గారిమీద పగతో రగిలిపోయేదాని.. 
ఇప్పుడు మనం అయిదో  తరగతికి వచ్చేసాం అన్నమట..మాయదారి జ్వరం మళ్ళీ వచ్చింది.మళ్ళీ వచ్చారు డాక్టారుగారు..
ఎక్కించేస్తున్నాడు ఇంజక్షన్ సిరంజ్లోకి..
హన్నా ఆ రోజు నన్ను నిస్సహాయురాలిని చేసి మా వాళ్ళందరినీ ఉసిగొల్పి ఆ సూదిని నా ఒంట్లో దింపుతావా..
ఈ రోజు వాళ్ళెవరూ లేరు (నాన్న ఊరెళ్లారు..అమ్మ చెల్లి మాత్రమే ఉన్నారు)..
చెప్తా నీ సంగతి..

ఇలా నేను ఆలోచిస్తుంటే ఆయన సిరంజ్ తీసుకొని వస్తున్నడు నా దగ్గరికి ..
వచ్చేసున్నాడు..పారిపోదామంటే అమ్మ పట్టేసుకుంది.
ఏం చెయ్యాలీ..ఏం చెయ్యాలీ.. 
నాలో ఉన్న బలన్నంతా ఉపయోగించి డాక్టారుగారి చెంప మీద ఒక్కటిచ్చా.
పాపం అసలే బక్కపలచ మనిషి ఊహించని ఈ దెబ్బకి ఆయనకి దిమ్మ తిరిగి ఎగిరెళ్ళి మంచం మీద పడ్డాడు. 

అయ్యో అని అమ్మ నా చెయ్యి వదిలేసి అయన దగ్గరికి వెళ్ళింది ఇంకే మనం ఎంచక్కా జంపు.. 

తర్వాత నాన్నగారు వచ్చి జరిగింది తెలుసుకొని ఆయన ఇంటికి నన్ను తీసుకెళ్ళి సారీ చెప్పించారనుకోండి.కానీ మా డాక్టారు గారు పాపం బాగా బెదిరిపోయారు చాలా రోజులు  మా ఇంటికి వస్తే ఒట్టు. 
అప్పటినించీ నాకు ఇంజక్షన్ చెయ్యాలంటే  
"అమ్మో మీ పెద్దమ్మాయికి ఇంజక్షనా మీరు దగ్గరుండండి ప్లీజ్" అని అడుగుతారు నాన్నగారిని. 
ఇప్పటికీ టాబ్లెట్స్ ఎన్నైనా వేసుకుంటా కానీ..ఇంజక్షన్ అంటే చేసేవారిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి,హారర్ కం సస్పెన్స్ కం థ్రిల్లర్ సినిమా చూపించి  కానీ చేయించుకోను. 
గద్గది ఇస్టోరీ..
23 నవం, 2012

కధామంత్రం

కధామంత్రం.
దేనికంటారా వ్యాపారానికి..:)
అవునండీ..
ఈ మధ్య వ్యాపార ప్రకటనలన్నీ ఈ మంత్రన్నే జపిస్తున్నాయి. సెకన్ల నిడివిలోనే ఎన్నో బుల్లి బుల్లి కధలు చక్కగా మనకి చెప్పేస్తున్నారు.ఆ కధలలో నవ్వించేవి..మురిపించేవి..ఆలోచింపచేసెవి..ఎన్నో..
"మా బాం కొనండి .నొప్పులన్నీ మటుమాయం" అని చెప్తే ఇప్పుడెవరన్నా కొంటారా చెప్పండి.
ఒక అందమైన కధ అల్లాలి.అది ఎంత బాగుండాలీ అంటే,ఆ ప్రకటన వస్తే ఛానల్ మారకూడదు.అప్పుడు ఆ వస్తువు పేరు మన నాలుక మీద నాట్యమాడుతుంది.ఇదే వ్యాపార 'కధా'మంత్రం,అస్త్రం.శస్త్రం అన్నీనూ .
నాకు నచ్చే ప్రకటనలలో వోడాఫోన్ 'జూజూ' ప్రకటనలు ముందుంటాయ్. ఎంతిష్టం అంటే నాకు 'జూజూ' భాష కూడా వచ్చు తెలుసా..;)
ఇంకా చెప్పలంటే బోలెడు లిస్టు అవుతుంది.అందుకే ఈ మధ్య కాలంలో నన్ను బాగా ఆకట్టుకున్నవి ఇక్కడ ఉంచుతున్నాను.

ఇది ఐ సి ఐ సి ఐ వారి ప్రకటన

జోబులో చెయ్యి పెట్టుకొని..మిఠాయి వైపు నిరాశగా చూసే ఆ పాప ఎక్స్ప్రెషన్ గుండె పిండేసింది..:(
ఆ బుజ్జోడు కూడా ఎంత బాగుంటాడో కదా..:) 

ఇది తనిష్క్ వారిది .

ఇది కూడ ఎంత మురిపిస్తుందో .ఈ ప్రకటన వచ్చినప్పుడల్లా నేను మా శ్రీవారిని
"నువ్వెప్పుడు అలా చేస్తావ్ " అన్నట్లు చూస్తా..:P

ఇది సెంటర్ ఫ్రెష్ ప్రకటన 

ఇది ఎంత నవ్విస్తుందో ..:)

ఇది కార్తీకా షాంపూ వారిది.
                                                                        


పెద్ద జడలేని నాలాంటి జడ ప్రేమికురాలిని బాగా ఆకట్టుకుంది..:) చివరిలో.."నీ దృష్టే పడనీ.." అని ఆ అమ్మాయి అద్దంలో చూసుకొనేది భలే నచ్చేసింది..:)

వివిధ సంప్రదాయాల పెళ్ళికూతురలను అందంగా చూపించే మలబార్ గోల్డ్ ప్రకటనలు కూడా భలే ఉంటాయి.ఇలా ఇంకెన్నెన్నోనండి.పెట్టుకుంటూపోతే టపా ఇంక అవ్వదు..:)
ఇంకా ఈ వ్యాపార ప్రకటనలలో సంగీతానికి..దానికొచ్చే ప్రాముఖ్యతకి కొదవేం లేదు.ఎయిర్టెల్ వారి.."ప్రతి ఫ్రెండూ అవసరమేరా"..ప్రకటనే దీనికి నిదర్శనం.
కొన్ని బిస్కెట్లు వంటి తిండి పదార్ధాల ప్రకటనలు అయితే గ్రాఫిక్స్తో కట్టి పడేస్తాయి.బాదం పప్పులు, జీడి అప్పులు గాల్లో ఎగిరొచ్చి చాక్లెట్ క్రీంలో పడినట్లు చూపిస్తే లొట్టలేసి అప్పటికప్పుదు కొని తినేయాలి అనిపించదా ఎవరికన్నా..:)   
ప్రకటనలు ఎంతగా ప్రజలలోకి వెళ్ళిపోతున్నాయి అంటే,"అదిరిందయ్యా చంద్రం.కొత్త ఇల్లు..కొత్త కారు.." లాంటి డైలాగులు దైనందన జీవితంలో ఇప్పటికీ వింటునే ఉన్నాం.అసలు ఇంత బుల్లి కధలను ఎంతో సృజనాత్మకంగా ప్రేక్షకుల మనసు కట్టిపడేసేలా తెరకెక్కిస్తున్న దర్శకుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండగలమా..?
అసలు ఒక్కోసారి కేవలం ప్రకటనలకోసమే టీవీ చుడాలనిపిస్తుంది అని నేను చెప్తే అతిశయోక్తి అనుకోరని నా నమ్మకం.    

21 నవం, 2012

మన్నించు మిత్రమా..
ఉదయాన్నే బాల్కనిలోని ఉయ్యాల బల్ల మీద కూర్చొని పేపర్ తిరగేస్తున్నా.పేజీలు తిరగెస్తున్నా కానీ దృష్టి అంతా ఎదురింటి మీదే ఉంది.
"రోజూ నాకంటే ముందే నిద్ర లేచి,పేపెర్ తిరగెస్తూ నవ్వుతూ నన్ను చూసేవాడు.ఇంకా వాడూ బయటకు రాలేదెంటో.?" అనుకుంటుండగా,కాఫీ కప్పుతో శ్రీమతి  ప్రత్యక్షం అయ్యింది. 
"అలా దొంగ చూపులు చూస్తారెందుకండీ.వెళ్ళి ,తెల్లారి ఇంత సేపయ్యింది.ఇంకా కనపడలేదేమిట్రా అని అడగొచ్చు కదా" అంది.
"ఎవరు దొంగ చూపులు చూసేది.తెలియకుండా మట్లాడకు.వాడికి,నాకు ఏ సంబంధం  లేదు.నువ్వు లోపలికి వెళ్ళు" అన్నాను. 
అన్నానే కానీ నాక్కూడా వెళ్ళి అడగాలనే ఉంది.వాడిమీద ఎంత కోపం ఉన్నా వాడిని చూడకుండా నిద్ర పట్టదు నాకు.
ఈనాటి స్నేహమా మాది?ఊహ తెలిసినప్పటినించీ ఒకరికోసం ఒకరం అన్నట్లు ఉండేవాళ్ళం. మా తల్లితండ్రులు ఎదురెదులు ఇళ్ళల్లో ఉండేవాళ్ళు.వాడికీ  అన్నదమ్ములు,అక్కచెళ్ళెళ్ళు లేకపోవడం వలన ,నాకు ఉన్నది ఒకతే అక్క అవడంవలనా ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం.ఒకే స్కూ ్లో ,ఒకే కాలేజీ లో చదివాం.స్కూలు తర్వాత ప్రైవేటు కాలేజీలో చదివించడానికి వాళ్ళ నాన్న స్థోమత లేక వద్దంటే ,నేను కూడా వాడితో పాటూ గవర్నమెంట్ కాలేజీలో చేరాను.ఈ విషయంలో మా నాన్నకి నా మీద చాలా కోపం ఉండేది. వాడు నాకంటే బాగా చదివేవాడు.ఇద్దరం కలిసి గ్రూప్స్ రాసేవాళ్ళం.ఆ పోటీ పరీక్షల్లో వాడి సహయ సహకారాలు లేకపోతే నేను ఈరోజు ఇలా స్థిరపడేవాడిని కాదు.అదేమాట వాడితో ఎప్పుడన్నా అంటే  
"నువ్వు పుస్తకాలు,బట్టలు ఇచ్చి నన్ను చదివించావురా మాధవా .జన్మలో నీ ఋణం తీర్చుకోగలనా?" అనేవాడు నవ్వుతూ.
అవును ఇద్దరం ఒకరికొకరు ఋణపడ్డవాళ్ళమే. 
ఇద్దరం చాలా ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం.పెళ్ళైన రెండేళ్ళకి మాకు ప్రవీణ్ పుట్టాడు.వాడికి సంతానం  కలగలేదు.ప్రవీణ్ని ఒకరకంగా వాడే పెంచి పెద్ద చేసాడు. 
ఉద్యోగాలరీత్యా వేరు వేరు ఊర్లలో ఉన్నా మా స్నేహం కొనసాగుతూనే ఉండేది.వాడు ఎక్కువగా హైదరాబాదులోనే సర్వీస్ చేసాడు.ప్రవీణ్ కూడ ఇంజినీరింగ్ వాడి దగ్గరే చదువుకున్నాడు.
రెటైర్మెంట్ వచ్చేసరికి ముందుగా అనుకున్నట్లుగానే ఇద్దరం హైద్రాబాదులో ఎదురెదురుగా ఇళ్ళు కట్టుకున్నాం.అప్పటినించి మళ్ళీ కబుర్లు,సినిమాలు,కలిసి వాకింగ్లు,కాఫీలు మా పాత రోజుల్లోలాగ.మా ఇద్దరి భార్యలు ఈ విషయంలో చాలాసార్లు మాపై అలుక వహించారు.   
నా భార్య లక్ష్మి కలుగాలిన పిల్లిలా లోపలికి బయటకు తిరుగుతోంది. 
"అన్నయ్య ఇంకా రాలేదేంటండి.." అంటుంది..
నేను ఆవిడకి సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చేసాను.  
వాడి గురించి నేను మాట్లాడను.కారణాలు ఉన్నాయి.   
ప్రవీణ్ ఉద్యోగంలో చేరాక, వాడికి నా మేనకోడలినిచ్చి పెళ్ళి చేసి మా అక్కకిచ్చిన మాట నిలబెట్టుకుందాం అని ఒకరోజు ప్రవీణ్ని, వాడిని కూర్చోబెట్టి విషయం చెప్పాను.
"నాన్నా.మీకు ఈ ఆలోచన  ఉందని నాకెప్పుడూ చెప్పలేదే?" అన్నాడు ప్రవీణ్   
"ఎప్పుడో అక్కకి మాట ఇచ్చానురా.చదువుకొనేటప్పుడు ఇవన్నీ ఎందుకని నీకూ చెప్పలేదు.అయినా జానకికి ఏం తక్కువరా లక్షణంగా ఉంటుంది.చదువుకుంది.బయట అమ్మయినైన ఇవేగా చూసేవి ? అన్నాను. 
"క్షమించండి నాన్న.నేను భానుని ఇష్టపడుతున్నాను.నాతో పాటే చదువుకుంది.ఇప్పుడు నాతో పాటే జాబ్ చేస్తుంది.ఈ విషయం మవయ్యకి కూడా తెలుసు.భాను ఒకసారి ఇంటికి వచ్చింది కూడా.
నా నోట మాట రాలేదు.
"అంటే మీ నిర్ణయాలు తీసేసుకున్నారన్నమాట.ఏరా రామూ నువ్వు నాకు ఒక్కమాట చెప్పలేదన్నమాట."   
"అది కాదురా మాధవా..సమయం చూసి నీకు చెప్దామనుకున్నాను.నువ్వు అక్కకి మాట ఇచ్చిన సంగతి నాకు తెలీదురా.."  
"ఏదేమైనా ఇది మా అక్కకిచ్చిన మాటరా.నా కొడుకుగా నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత నీకుంది" అన్నాను ప్రవీణ్తో 
"క్షమించండి నాన్న.భానుని తప్ప వేరే ఎవ్వరినీ పెళ్ళి చేసుకోలేను."
"అయితే ఈ రోజు నించి నీకు నాకు ఏసంబంధం లేదు.ఆ పిల్లనే పెళ్ళి చేసుకోవాలనుకుంటే నన్ను మర్చిపో "అన్నాను .
మౌనంగా వెళ్ళిపోయాడు ప్రవీణ్.
"ఒరేయ్ .నువ్వు మాట ఇచ్చావు సరేరా.కానీ అదంతా వాడికి తెలీదు కదా.వాడు దేనికీ తొందరపడడురా.ఒకసారి ఆలోచించు" అని చెప్పి వాడు కూడా వెళ్ళిపోయాడు.
రెండు నెలల తర్వాత ప్రవీణ్ నా దగ్గరికి వచ్చాడు.  
"నాన్న.భానుకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట.దయచేసి ఒప్పుకోండి నాన్నా."
"ప్రవీణ్ నీకు నా నిర్ణయన్ని ఎప్పుడో చెప్పాను.నువ్వు ఆ అమ్మయినే పెళ్ళి చేసుకోదలిస్తె మళ్ళీ నా కంటికి కనిపించకు.
ప్రవీణ్ వెళ్ళిపోయాడు.నా భార్య, రామూ  నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు.
మూడు నెలల తర్వాత ప్రవీణ్ ఉత్తరం రసాడు.
"నాన్న.తప్పనిసరి పరిస్థితులలో భానుని పెళ్ళి చేసుకోవలసి వస్తుంది.ఈ గురువారం పెళ్ళి. దయచేసి మీరు,అమ్మ,మవయ్య,అత్తయ్య రండి నాన్న.నన్ను ఆశీర్వదించండి.నేనే వచ్చేవాడిని కానీ మీరు రావద్దు అన్నారు.ఫోనులో నా గొంతు వినగానే కట్ చేస్తున్నారు.అందుకే ఈ ఉత్తరం.నన్ను క్షమించండి నాన్న."   

నా కొడుకు నా మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఇలా పెళ్ళి చేసుకోవడన్ని ఎలా సహించను.ఉత్తరం చేతిలో ఉండగానే రాము వాళ్ళు వచ్చారు. 
"ఒరేయ్ మాధవా.మనిద్దరికీ వాడు ఒక్కడే కొడుకురా.వాడి పెళ్ళి ఇలా జరుగుతుందనుకోలేదు.మనం కనీసం చుడ్డనికైనా వెళ్దామ్రా. వాడిని అనాథను చెయ్యొద్దురా." అన్నాడు రాము.
"అవునండి .అన్నయ్య చెప్పేది నిజం.కనీసం పెళ్ళికైనా వెళ్దామండి" అంది లక్ష్మి . 
"అన్నయ్య మీ మాట కాదనడం ప్రవీణ్ తప్పే .కానీ పెళ్ళి వేళలో వాడు సంతోషంగా ఉండాలి కదా"అంది నా చెల్లెలు(వాడి భార్య). 
"నన్ను కాదని వాడి పెళ్ళికి వెళ్ళలనుకొనేవాళ్ళు ఎవరైనా నాతో ఏసంబంధం ఉండబోదని గుర్తుంచుకోండి." అని వెళ్ళిపోయాను.
గురువారం వచ్చింది.వాడూ,నా చెల్లలు పెళ్ళికి వెళ్ళారు.నా భార్య ఏడుస్తూ ఇంట్లోనే ఉంది.  
పెళ్ళికి వెళ్ళొచ్చి శుక్రవరం పొద్దున్నే రోజూలానే నాదగ్గరికి వచ్చాడు .నన్ను కాదని దగ్గరుండీ మరీ వీడు పెళ్ళి జరిపించడం నాకు చాలా కోపం తెప్పించింది.
"ఎంట్రా.ఏం చేస్తున్నవ్?
నేనేమీ మాట్లాడలేదు.
"ఒరేయ్.నీకోపం నాకు తెలుసురా.కానీ మీరు రాలేదని వాడు ఎంత బాధపడ్డడో తెలుసా.పెళ్ళి అవుతున్న సంతోషం లేదురా వాడి మొహంలో.మేము కూడ వెళ్ళకపోతే ఎమైపొయేవాడో.ఆలోచించు
"లక్ష్మీ.ఏం చేస్తున్నవ్?" పిలిచాను నా భార్యని. 
"ఒరేయ్.ఎందుకురా అంత పంతం.నాతో మాట్లాడవా.ఏం వాడు నీకు ఒక్కడికే కొడుకా?నాకు కాదా.?నాకు వాడి పెళ్ళికి వెళ్ళె హక్కు లేదా?"అన్నాడు వాడు.
"లక్ష్మీ, నేను బయటకు వెళ్ళలి.స్నానానికి నీళ్ళు పెట్టు " అని చెప్పి లోపలకి వచ్చేసా. 
అప్పటినించి నేను వాడితో మాట్లాడలేదు.ఆరు నెలలు అయ్యింది.వాడు మాత్రం రోజూ ఉదయన్నే ఇంటికి వస్తాడు.నా భార్యచేతి కాఫీ తాగుతాడు.నాతో ఎవేవో కబుర్లు చెప్పి వెళ్ళిపోతాడు."చిన్న పిల్లాడు.ఒక్కసారి ప్రవీణ్కి ఫోన్ చెయ్యరా" అని చెప్తాడు.
నేను నవ్వకపోయినా నన్ను చూసి నవ్వుతాడు.నా కోపాన్ని పట్ట్టించుకోకుండా వాడు చేసే ఈ పనులు చూస్తే  ఇంకా కోపం వస్తుంది నాకు.కానీ వాడిని చూడకుండా ..వాడి మాటలు వినకుండా నాకు నిద్ర పట్టదని నాకు మాత్రమే తెలిసిన నిజం. 

వాడు వచ్చే టైం అవుతుంది.త్వరగా స్నానం చెయ్యాలి అనుకుంటుండగా  
"ఏవండీ."అంటూ వచ్చింది లక్ష్మి. 
"ఏమిటోయ్.అంత కంగారుగా ఉన్నావే.మీ అన్నయ్య వచ్చే టైం అయ్యిందిగా .ఎదురుచూస్తున్నావా?" అనడిగాను వెటకారంగా.
"ఏవండీ..మరీ రామన్నయ్య..." అని ఆగిపోయింది  
"ఏమైంది."
"రామన్నయ్య మనకి ఇంక లేరండి."అంది ఏడుస్తూ. 
నేను విన్నది ఏమిటో నాకు అర్దం కాలేదు
"ఏమిటి లక్ష్మీ నువ్వనేది.." 
"అవునండి.రాత్రి నిద్రలోనే పోయారట.." వెక్కి వెక్కి ఏడుస్తుంది.
నాకాళ్ళ కింద భూమి కంపించింది.అలానే మ్రాంపడిపోయాను. 
"ఏవండీ వెళ్దాం రండి.." అని నా చెయ్యి పట్టుకుంది లక్ష్మి.
నాకు ఎమీ వినిపించడంలేదు.
"ఏవండీ పంతాలకు ఇది సమయం కాదండి రండి.."
ఆశ్చర్యం  నా కళ్ళోల్లో నీళ్ళు కూడా రావట్లేదు.
మౌనంగా కూర్చుండిపోయాను. 
"మీరు ఇక మారరు.అన్నయ్య చనిపోయినా ఇంకా మీకు కోపం పోలేదు అంటే మిమ్మనేమనాలో నాకు అర్ధం కావట్లేదు.మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తున్నాను.."
అని వెళ్ళిపోయింది. 
"పిచ్చిదానా.వాడిమీద నాకు కోపమా..ఏం తెలుసు నీకు..వాడు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాడు.?
ఒరెయ్ రామూ చెప్పరా ఎలా వెళ్ళిపోతావు నన్ను వదిలి.."

ఇన్నళ్ళూగా..ఇన్నేళ్ళుగా.. 
ప్రాణంలో ప్రాణంగా   
మనసులో మనసులా 
కష్టాలు ..ఇష్టాలు పంచుకున్నావు..
భాసలు చేసావు..ఊసులు చెప్పావు..
జీవిత గమనంలో ప్రతి అడుగులో తోడుగా ఉన్నావు.. 
జీవితచరమాంకంలో నన్ను ఒంటరిని చేసావా?
స్వాతిముత్యంలాంటి నీ మనసు  
మంచుపూవులాంటి నీ నవ్వు
సజీవమైన నీ స్నేహ హస్తం..
ఇక లేవా?
మాట మన స్నేహాన్ని దూరం చెయ్యలేదు అనుకున్నాను 
మనల్ని విడదీయగా మరణమొకటి ఉందని  మరిచాను..
"నాతో మట్లాడరా మాధవా..." అని నన్ను అడుగుతూనే
మాట కూడా చెప్పకుండా 
నీవు లేని 
ఈ నిశీధి వీధులలో
కన్నీటి సాగరంలో 
నన్ను వదిలి వెళ్ళిపోయావా..
నేను మట్లాడడంలేదని శాశ్వతంగా నామీద అలిగావా. 
నువ్వు ఉండే చోటుకి నేను త్వరలోనే వస్తాను.
నా నేస్తాన్ని "మన్నించమని" అడగాలి మరి.
  • గమనిక.ఇది నాకంతో ఇష్టమైన బాపూ రమణల స్నేహం స్ఫూర్తితో  అల్లిన కధ.విషాదాంతమే...:(  కానీ  ఆ అందమైన స్నేహం చిరస్మరణీయం.

20 నవం, 2012

తులసీ ద(వ)ళం

టైటిల్ చూసి ఇదేదో ఆధ్యాత్మిక విషమనుకొనేరు.కాదండి బాబోయ్..:)
ఇది నా తులసి కోట కథ


ఇదే నా బుజ్జి తులసి కోట.
పెళ్ళై కొత్త ఇల్లు పెట్టుకొన్న ఏడు నెలలకు పెట్టుకోగలిగాను.
అన్ని నెలలు ఎందుకంటా?అంటారా..చెప్తున్నా చెప్తున్నా.
నాకు కృష్ణ తులసిని ధవళ వర్ణ కోటలో పెట్టుకోవాలని కోరిక.అందులోనూ చలువరాతిది మరీ ఇష్టం
దాని కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసా. కానీ  భాగ్యనగరంలో ఎక్కడా దొరకలేదు.శిల్పారామంలో కూడా పెద్దవి ఉన్నాయి కానీ నా చిన్ని ఇంట్లో గట్టు మీద ఇమిడిపోయె పరిమాణంలో మాత్రం లేవు.ఇలా వెతుకుతూ ఉండగానే కార్తీకమాసం వచ్చేసింది.
ఇక ఎదో ఒకటి పెట్టెయ్యాలి అని,మొన్న దీపావళికి దీపాలు కొనడానికి శిల్పారామం వెళ్ళినప్పుడు మొత్తం షాపులన్నీ తిరిగేసా.ఎక్కడా దొరకట్లేదు పింగాణివి, మట్టివి ఉన్నాయి ,బాగున్నాయి .కానీ అవి తెల్లగా లెవే..:( 
ఇక ఏంచేస్తం అని ఒక బుజ్జి మట్టి తులసి కోట తీసెసుకున్నా.ఇలా తీసుకొని అలా శ్రీవారికి డబ్బులు ఇమ్మని చెప్పి,వెనక్కి తిరిగానో లేదో కనపడింది ఎదురు షాపులో తెల్లగా బుజ్జిగా ఉన్న ఈ తులసి కోట.అది కూడా ఒకే ఒక్కటి ఉంది.వదులుతానా??
ఇంక మొదలు పెట్టా  "నాకు ఇది వద్దు .అదే కావాలి.మీరు ఏంచేస్తారో నాకు తెలేదు.అందుకే షాపులన్ని తిరిగి కానీ కొనొద్దు అన్నాను.మీరే కంగారు పెట్టారు" అని..
పాపం మా సారు ,ముందు కొన్నవాడి కాళ్ళా వేళ్ళా పట్టుకొని అ మట్టి తులసి కోట వెనక్కి ఇచ్చేసి ఇది తీసేసుకున్నారు.
తెచ్చేసా కృష్ణ తులసి వెసేసా(కృష్ణ తులసి కూడా ఒకేఒక్కటి మొలిచింది అమ్మ వేసిన విత్తనాల్లో.:)..).
చలువరాతిది కాకపోయినా ,తెల్లగా బాగుంది కదా.:)
 అంతేం లేదు.దీనికింత కథ అవసరమా అంటారా..?:(


19 నవం, 2012

పూల అవ్వ   
ఈ అవ్వని చూసారా??
ఈవిడే నా పూల అవ్వ.
ఎక్కడినించి తీసుకొస్తుందో కానీ అదిగో ఆ బుట్టలో ఉన్న కాసిని పూలే తీసుకొచ్చి అమ్ముతుంది.
"ఎంత అవ్వ?" అన్నామనుకోండి,
"పావుకిలో ఇరవై రూపాయిలమ్మ" అంటుంది.
ఒక పొలిథేన్ కవర్ నిండా పువ్వులేసి ఇరవైరూపాలివ్వమ్మ అంటుంది.
అవి అరకిలో పైనే ఉంటాయి కానీ పాపం అవ్వదగ్గర తూకం వెసే సామగ్రి ఎమీ ఉండదు.
కొంత మంది పొదుపర్లు అవి అరకిలో ఉంటాయని తెలిసినా బేరమాడి మరీ తీసుకుంటారు.
అవ్వకి చిల్లర ఇవ్వడానికి కూడా కళ్ళు సరిగా కనపడవు.చాలామంది చిల్లు నోట్లు ఆవిడకి అంటగట్టి పోతారు.
పాపం అవ్వకి ఎవరూ లేరంట ఒక రోజు నాతో చెప్పింది..
ఆ అవ్వ దగ్గర నేను దాదాపు రోజూ పూలు కొంటాను..ఆ పూలు ఇంట్లో వాడిపోయినా సరే.కనీసం ఆ అవ్వని చుడ్డనికైనా కొనాలనిపిస్తుంది నాకు.  .ఒక పది రూపాయిలు ఎక్కువిద్దామని పయత్నించామనుకోండీ ఇంకాసిని  పువ్వులు వెసేస్తుంది అవ్వ.ఊరికే తీసుకోవడం ఇష్టముండదేమో అవ్వకు అందుకే ప్రసాదం అని అబద్దం చెప్పి అప్పుడప్పుడు అరటి పళ్ళు ఇచ్చెస్తా అవ్వకు..(అది మంచి పనో కాదో నాకు తెలేదు.).
దూరం నించి అవ్వని ఫొటో తీయడానికి ప్రయత్నించా..
కానీ కుదర్లేదు..దగ్గరకెళ్ళి అవ్వని అడిగి తీసేసరికి చాలా ఆనందపడిపోయింది.. 
కాళ్ళు..చేతులు సక్రమంగా ఉండి,వయసులో ఉండి కూడా చాలా మంది  యాచక వృత్తిని ఆశ్రయిస్తున్నారు. 
ఎంతో కష్టపడుతూ తన అత్మాభిమానాన్ని కాపాడుకుంటున్న ఈ అవ్వ నాకు చాలా చాలా ఇష్టం.  
ఇరవై రూపాయలకు నాకు ఎన్ని పూలు ఇచ్చిందో చూశారా ..

15 నవం, 2012

సావిరహే తవదీనా ....

చల్లటి గాలి..

సుతారంగా నన్ను తాకుతుంది.ఎందుకో నా మనసును ఆ గాలి తాకలేకపోతుంది.నా ఆలోచనల విహంగం నేల మీద ఈ రైలు కంటే వేగంగా పరుగెడుతుంది.ఇప్పుడు హఠత్తుగ్గా ఇంటికి వెళ్తే అమ్మెమంటుందో అసలు రానిస్తుందో లేదో? అయినా అమ్మకేంతెలుసు నా సమస్య.అసలు వాళ్ళకి నేనేమని చెప్పాలి?చెప్పినా అర్ధం చేసుకుంటారా?
ఎదో స్టేషన్లో రైలు ఆగింది.ట్రైన్ ఇంకా సిటీ దాటలేదు.ఎక్కేవాళ్ళు,మంచినీళ్ళ కోసం దిగేవాళ్ళు,నీళ్ళసీసాలు,చిప్సు,బిస్కెట్లు అమ్మేవాళ్ళు అంతా గందరగోళంగా ఉంది నా ఆలోచనల్లాగానే.నోరంతా ఎందుకో ఎండిపోతుంది.ఎందుకిలా?అరె నాకు దాహమేస్తుంది.నీళ్ళ బాటిల్ కొనుక్కుందామని లేవబోయను.రైలు కదిలిపోతుంది.  
ఒక్కసారిగా ఏడుపొచ్చింది.రాధా గుర్తొస్తున్నాడు.
"వద్దు అతనికి నాకు ఏ సంబంధం లేదు గుర్తొచ్చినా, ఇవన్నీ తర్వాత అలవాటయిపోతాయి.జీవితంలో ఏమీ లేకుండా మట్టిముద్దలాగ బ్రతకడం నా వల్ల కాదు."  
మనసు మాట వినడం లేదు.జ్ఞాపకాల పొరలను కదుపుతోంది.
నన్ను ప్రశ్నిస్తుంది.
"నిజం చెప్పు కృష్ణా.రాధా నువ్వు దాహం అంటే ఎడారిలో ఉన్నా నీళ్ళు తెచ్చిస్తాడు అవునా?"  
"ఎమో.అయినా నువ్వేమిటి మధ్యలో.అసలే చిరాగ్గా ఉంది. అతనిని గుర్తుచెయ్యొద్దు అన్నానా?"  
"తప్పించుకోకు.నాకు సమాధానం చెప్పు"
"అవునేమో."
కానీ అంగీకరించలేకపోతున్నాను.
రాధాది,నాది పెద్దలు చేసిన పెళ్ళి.ఎంసీయే రెండవ సంవత్సరంలో ఉండగా మా పిన్ని తీసుకొచ్చింది సంబంధం."కుర్రాడు కష్టపడి పైకి వచ్చాడు.పెద్ద కుటుంబం.బాధ్యత తెలిసిన వాడు.ఈ కాలంలో ఇలాంటి వాడు దొరకడు.పేర్లు కూడా బాగా కలిసాయి.రాధాకృష్ణా,కృష్ణప్రియా ఎంత బాగుందో.మా అత్తగారికి బాగా దగ్గరి వాళ్ళు." అని ఖాయం చేసేసింది.
ఇంకేంటి మా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.రాధా నాకంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు.చదువయ్యకే నన్ను పెళ్ళి  చేసుకుంటానన్నాడు.నాన్నాగారు చాలా సంతోషపడిపొయారు "నా కుతురి పట్ల నాలాగే ఆలోచించే అల్లుడు దొరికాడు" అని. ఆడపిల్లల ఊహల్లో ఉండే అబ్బాయిలాగ పెళ్ళికి తొందరపడలేదు రాధా .
"కాస్త జరగవమ్మా..పిల్లాడు కుర్చోవద్దూ?"
అని నా పక్కనావిడ ఒకరు పట్టే ఆ చొటులో ఆవిడ,ఆవిడ పదేళ్ళ పిల్లవాడితో కూర్చుంది.
కాసేపటికి
"ఏమయ్యో!నిన్నే ఇలా రా.ఈడ జాగా ఉంది." 
ఎక్కడో దూరంగా చుట్ట కాలుస్తున్న ఒక నలబైయ్యేళ్ళ వ్యక్తిని పిలుస్తుంది..
ఎక్కడ ఉందో నాకు అర్దమయ్యేలోపే,ఆ పిల్లాడు ,తల్లీ  అటు ఇటు జరిగారు ఆయన వచ్చి మధ్యలో కూర్చున్నాడు.ఒక పక్క కిటికీకి నొక్కుకుపోతుంటే ఆయన చుట్ట వాసన భరించలేకపోయాను.చేసేదేమీ లేక లేచి నించున్నా.
"ఛ రిజర్వేషన్ చేయించుకున్నా పోయేది.టైం కూడా లేదు.హడావిడి ప్రయాణం."మళ్ళి రాధా..నా మనసు అడుగుతుంది.
"రాధా అయితే రిజర్వేషన్ దొరకకపోతే ప్రయాణం కాన్సిల్ చేసేవాడు. తప్పనిసరిగా వెళ్ళాల్సిసొస్తే ఏ చుట్టాల దగ్గరో నిన్ను వదిలి తనే వెళ్ళేవాడు కానీ రిజర్వేషన్ లేకుండా ఎప్పుడూ రానివ్వలేదు కదా నిన్ను ?"
నిజమే.ఎప్పుడూ రానివ్వలేదు.ఒక్కమాటలో చెప్పాలంటే కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు నన్ను రాధా.అందరికీ అది అదృష్టంలా అనిపిస్తుంది.నాకు మాత్రం బంగారు పంజరంలా అనిపిస్తుంది. 
ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఎక్కువగా ఫోనులు చేసేవాడు కాదు రాధా.అడిగితే నీ చదువు పాడవుతుంది జాగ్రత్తగా చదువుకో అనేవాడు. పాతికేళ్ళ వాడిలా కాక అరవయ్యేళ్ళ వాడిలా మాట్లాడేవాడు.కవితలు లేవు.పాటలు లేవు.కుర్చున్నా నించున్నా ఫొనులు లేవు.నా ఊహాపతి అయితే ఈ పాటికి నామీద కవితల పుస్తకం రాసేసేవాడు.నా స్నేహితులు వాళ్ళ ప్రేమికులు పంపే గ్రీటింగ్ కార్డులు,చేసే ఫొనులు చుస్తే చాలా బాధగా అనిపించేది.కానీ నా బాధ ఎవరికి అర్దం అవుతుంది. 
చాలా సేపటినించీ నిల్చోవడం వలన కాళ్ళు లాగేస్తున్నాయి.టైం రాత్రి 10 కావస్తుంది.బాగా అకలి వేస్తుంది. 
మళ్ళీ మనసు..
"పెళ్ళైన తర్వాత ఈ సంవత్సరకాలంలో నీకు ప్రయణాలలో కానీ,ఇంట్లో కానీ,సినిమాకి వెళ్ళినప్పుడు కానీ ఆకలి అంటే ఎమిటో తెలిసిందా?రాధా నీకు తెలియనిచ్చాడా?"  
"తెలియనివ్వలేదు.." నా సమాధానం.
చుస్తూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది.పెళ్ళి అందరి ఆశీర్వాదాలతో జరిగిపోయింది.పెళ్ళైన తర్వాత ఇద్దరికీ హైదరాబాద్లో  ఉద్యోగాలు..
ఎన్నో ఆశలతో, ఊసులతో రాధా ఇంట్లో అడుగు పెట్టాను.కానీ రాధా ఎక్కువగా మాట్లాడడు.మాట్లాడినా చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు.దేవుడిని నమ్మడు.చిన్నప్పటినించీ రాధా చాలా కష్టపడ్డాడు.వాళ్ళ కుటుంబం బాగా బతికిన కుటుంబం.చదువుకుంటూ ఉద్యోగం చే చేసుకుంటూ చాలా కష్టపడి పైకి వచ్చాడట.తను పడ్డ కష్టాలు,తీసుకున్న నిర్ణయాలూ ఎప్పుడన్నా ఇద్దరమే ఉంటే చెప్పేవాడు.నాకేమో కవితలు,బొమ్మలు,మొక్కలు, సంధ్యా సమయాలు,వెన్నెల్లో కబుర్లూ ఇవన్నీ తనతో పంచుకోవాలని ఉండేది.ఎప్పుడన్నా చెప్దామని ప్రయత్నించినా మౌనంగా వినేవాడు అంతే.నేను నా కవితలు ఎవేమీ అర్ధం కావు..పొనీ చెప్తే..
"సారీ రా..నాకు ఇవేమీ తెలీదు" ఒకటే మాట.  
బాగా నిద్రొస్తుంది .ఆకలేస్తుంది..
పోనీ వచ్చే స్టేషన్లో దిగి ఎమన్నా కొనుక్కుందామా అనుకొని టైం చూసుకున్నా.10:30 అయ్యింది.
"తర్వాత స్టేషన్  ఎప్పుడు వస్తుందండీ?"
నా పక్కన నిల్చున్న ఆయనని అడిగాను.
"ఇంకో అరగంటలో వస్తుందమ్మా.అదే సిటీలో లాస్ట్ స్టేషను."
ఒంటరిదాన్ని అయిపోయాను.నా భావలను పంచుకొనే తోడు కోసం ఎన్ని కలలు కన్నాను.ఈయనకి ఎమీ అర్ధం కావే."భావుకతా? అంటే ఏమిటి ?"అడిగాడొకసారి.ఎడిస్తే ఓదార్పు ఉండదు.నా కన్నీటిని తుడవడు.అలిగితే బ్రతిమలాడడు.ఇంటిని నా సృజనాత్మకతతో అందంగా పెట్టినా గుర్తించడు. అన్నింటికీ మౌనం.ఎమన్నా అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా కుదరదు నాకు వాటి మీద నమ్మకం లేదు అంటాడు.నాకు నువ్వు కావాలి అని ఎప్పుడూ గట్టిగా చెప్పలేదు.విసిగిపోయాను..పెద్దగా అరిచాను.గొడవ చేసాను.అదే మౌనం.
"అసలు నా మీద నీకు ప్రేమ ఉందా"అడిగాను.
"నువ్వు ఇదే మౌనంతో ఉంటే నేను ఉండను.వెళ్ళిపోతాను "
ఇదే మాట చాలసార్లు అన్నాను ఇంతకుముందు.
మళ్ళీ అదే మౌనం..
నా అహం దెబ్బ తింది.ఆ మౌనం నా సహనన్ని పరిక్షిస్తుంది..ఆవేశం కట్టలు తెంచుకుంది.
ఆఫీసుకి వెళ్ళలేదు నేను.తను వెళ్ళాడు.నేను ఇంట్లో ఉండదలచుకోలెదు.
స్టేషన్ వచ్చింది.ఎమన్నా కొనుక్కుందామని దిగాను.స్టేషన్ చాలా చిన్నది.టైం 11:30 అవుతుంది.
ఎక్కడో దూరంగా ఉంది ఒక టీ స్టాల్.బిస్కెట్లయినా తీసుకుందామని వెళ్ళాను. ఒక గుడ్డే పేకెట్ తీసుకున్నాను..
ఇందాక సికింద్రాబాద్  స్టేషన్లో డ్రా చేసిన 500 నోటు  ఇచ్చాను
"చిల్లర కావాలమ్మ" అన్నాడు..
"లేదు.చూడండి ఉంటుంది"..అన్నాను..
"లేదమ్మా."అన్నాడు.
ఏంచెయ్యలేక పేకెట్ అతనికి ఇచ్చేసి వెనక్కి తిరిగి చూసేసరికీ రైలు  వెళ్ళిపోతుంది..
ఏంచెయ్యలో అర్ధం కాలేదు.పరుగు పెట్టాను.రైలు అందలేదు.ఇంకానయం చిన్న బాగ్ కాబట్టి బాగ్తో సహా దిగిపోయా.
దాహం..ఆకలి..తల తిరిగిపోతుంది.
"ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంటికి ఎల వెళ్ళాలి?పొనీ వెనక్కి రాధా దగ్గరికి వెళ్ళిపోదామా?"
టీ స్టాల్ అతనిని అడిగితే లోకల్ ట్రైన్కూడా ఎమీ లేవన్నాడు.3 గంటలకు ఒక రైలు ఉందంట.విజయవాడ వెళ్తుందంట.
"ఇప్పుడు వెనక్కి వెళ్ళిపొవాలా?లేకపోతే విజయవాడ వెళ్ళలా?"
ఆ టీ స్టాల్ పక్కనే,పున్నాగ పూల చెట్టు కింద ఉన్న బెంచీలో కూలబడిపోయాను.
ఇప్పుడు ఈ పున్నాగ పూల పరిమళం,చల్లటి గాలి ఇవేమి నేను ఆశ్వాదించలేకపోతున్నను.పరిస్థితుల ప్రభావం అని రాధా ఎప్పుడూ అనేది ఇదేనేమో.  రాధా అన్నట్లు.జీవితం అంత సులువు కాదేమో.ఒక కష్టానికే నేను ఇలా ఆలోచిస్తుంటే,ఇంక రాధా అలా ఆలోచించడంలో తప్పు లేదేమో.స్టేషన్ అంతా నిర్మానుష్యంగా ఉంది.బహుశా ఇంకే లోకల్ ట్రైన్ లేకపోవడం వలనేమో.
టీ స్టాల్ అతని కళ్ళు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి.
"రాధా తొందరపడ్డానా?నాకు కష్టం తెలియకుండా చిన్న చిన్న పనులలో చూపించే నీ ప్రేమను అర్ధం చేసుకోలేకపొయానా?ఎక్కడ ఉన్నావు?కనీసం ఫోను కూడా చెయ్యలేదు ."
ఫొను తీసి చూసాను
50 మిస్డ్ కాల్స్
15 మెసేజస్
మధ్యాహ్నం రాధా ఫొను చేస్తే సైలెంట్లో పెట్టాను.మళ్ళీ  తియ్యలేదు.మెసేజ్లు ఓపెన్ చేసాను

"కృష్ణా ఎక్కడికి వెళ్ళావు?"

5:30 సా

"కృష్ణ నీ కోసం ఒక సర్ప్రైజ్ .తొందరగా ఇంటికి రా .నేను నీ కోసం తొందరగా వచ్చెసాను.ఇంట్లో ఉన్నాను."

@5:48 సా

"నా మీద కో ంతో  నాకు లంచ్ బాక్స్ కూడా ఇవ్వలేదు నువ్వు.నీ చేత్తోనే తిందామని ఏం తినలేదు నేను..తొందరగా రా..ఆకలేస్తుంది..:("

@6:00సా

"సారీ కృష్ణా.నాకు చిన్నప్పటినించి  ప్రాక్టికల్గా ఆలోచించడం అలవాటు అయిపోయింది..నేను ఎందుకు మట్లాడనో తెలుసా..నాకు రాదు కృష్ణా..సారీ చెప్తున్నాను కదా.."

@6:15 సా

"కృష్ణా..నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా.పువ్వు పూసిన అనందపడిపోయే నీ చిన్నపిల్లల మనస్తత్వం..నీ బొమ్మలు,మొక్కలు,అర్ధం కాకపోయినా నీ కవితలు ఇవన్నీ నాకు చాల ఇష్టం కృష్ణ.నిన్ను బాధపెడుతున్నానని తెలుసు .కాని ఏం చేయను?నాకు చెప్పడం రాదు కృష్ణా.కానీ చిన్న చిన్న ఆనందాలు ఎలా ఉంటాయో నిన్ను చూసే నెర్చుకుంటున్నా."

@6:35 సా

"కృష్ణా రిప్లై అన్నా ఇవ్వు నాకు కంగారుగా ఉంది.నీ ఫ్రెండ్  లక్ష్మికి కూడా ఫోన్ చేసాను. రాలేదని చెప్పింది.నాకు భయమేస్తుంది.రిప్లై  ఇవ్వు కృష్ణ.."

@7:14రా

"కృష్ణ..నేను మారతాను..తొందరపడి ఏ పిచ్చి పనీ చెయ్యకు.:(("

@7:27రా

"కృష్ణ.ఎక్కడని వెతకను నీకోసం.ఎంజిబియస్ లో ఉన్నాను.ఇక్కడ నువ్వు ఉంటే.ఫోను చెయ్యి.ప్లీజ్.

@8:28రా

"సికింద్రబాద్ స్టేషన్లో ఏటియంలొ డబ్బులు డ్రా చేసావా.అక్కడ ఏం చేస్తున్నావు కృష్ణ."

@8:34రా

"కృష్ణ దయచేసి ఫొన్ చెయ్యి ఇంత పెద్ద శిక్ష వెయ్యకు..నేను స్టేషన్ కి బయల్దేరుతున్నాను..అక్కడే ఉండు ఎక్కడికీ వెళ్ళొద్దు.."

@8:42రా

"కృష్ణ ఫోన్ ఎత్తు..ఎక్కడ నువ్వు స్టేషనంతా వెతుకుతున్నాను.."

@9:15సా

"నాకు కోపం వస్తుంది.."

@9:27రా

"కృష్ణ నువ్వు xxx ట్రైన్ కి బయల్దేరావా..ఈ టైంకి మీ ఊరికి అదేగా ఉంది. సిటీ దాటకముందే  ఎక్కడన్నా దిగిపో కృష్ణ నేను వస్తాను..ఇంక నిన్ను చుకుండా క్షణం కూడా ఉండలేను..ఫోన్ చెయ్యి కృష్ణ .."

@9:45రా

"కృష్ణ .ప్రియమైన వారి మౌనం ఇంత బాధగా ఉంటుందని నాకు తెలీదు.నన్ను క్షమించు."

@11:02రా

కళ్ళల్లో నీళ్ళు..నా మనసుని..తనువుని కడిగేస్తున్నాయి..

తనకి ఫొన్ చేసా..
"పలుకుల నీ పేరె పలుకుతున్నా..
పెదవుల అంచుల్లో నిలుపుకున్నా..
మౌనముతో నీ మదిని బంధించా..
మన్నించు ప్రియా..."
తన రింగ్ టోన్ ఆ నిశ్శబ్ద వాతావరణంలో  మలయమారుతంలా నా చెవిని తాకుతుంది..
ఎదురుగా తాను..
గుండెల్లో గువ్వలాగ నేను..
కన్నీటితో ఇద్దరి గుండెలు తడిచిపోతుంటే..
"సారీ రాధా.."అన్నాను.
"ఈ బాధ మంచిది అవసరం.."అన్నాడు నవ్వుతూ.
నేను తనకి చాలాసార్లు చూపించిన బాపూ'రమణీ'య  'పెళ్ళిపుస్తకం' లోలాగా.
          

12 నవం, 2012

మిత్రులకు దీపావళి శుభాకంక్షలు..:)

మా ఆఫీసులో.. దీపాల రంగవల్లి..
వెలుగులు..జిలుగులు..
దివ్వెలు..మువ్వలు..
నవ్వులు..పువ్వులతో..
ఈ దీపావళి..మీ మనసులలో..
ఉత్సాహాన్నీ..సంతోషాలనూ..
నింపపాలని కోరుకుంటూ..
ధాత్రి..

11 నవం, 2012

నీటి అద్దం
ఎవరో అన్నారు..

మనసు అద్దమట..
అంతరాత్మ ప్రతిబింబమట..
పగిలితే అతకదట..
నిజమే..
కానీ..ఇది ఒట్టి నీటి అద్దం..
అద్దమైతే..ముక్కలుగా పగిలినా..
ప్రతీ ముక్క సవ్యంగానో...అపసవ్యంగానో..
ప్రతిబింబిస్తుంది..
మరి ఇది నీటి అద్దం కదా..
చిన్న రాయి చాలు..
ఆలోచనల అలజడులనూ..
కల్లోల తరంగాలనూ..సృష్టిస్తుంది.
ఆ అలజడులూ..తరంగాలూ.. శాశ్వతమైతే..
అద్దమే కనుమరుగవుతుంది..
ఆ కనుమరుగయిన అద్దాల ఆవేదనంతా..
ఒకే మాటలో..
"నా మనసు చచ్చిపోయింది.."
అంటే మరణమే కదా..
జాగ్రత్త నేస్తం..
ఇది..మనసు..
ఒట్టి నీటి అద్దం..

7 నవం, 2012

చివరి మజిలీ....
ఇది చదివాక మనసులో వేల వేల భావలు..అలజడులు...మహోన్నతమైన  Dr.సుబ్రహ్మణ్యం  గారి ఆలోచనలనీ..,ఆచరణ పెట్టిన విధానాన్నీ..,వారికి సహయ సహకారాలు అందిస్తున్న మహానుభావులనీ ..,ఎంత పొగిడినా  తక్కువేమో!..ఇంత గొప్ప పని చేయడానికి ఎంత దృఢ సంకల్పం కావాలో అనిపించింది..   వ్యక్తపరచలేని ఎన్నో ఆలోచనలతో మనసు  ఊగిసలాడుతుంది ..అందులోని ఒక ఆలోచనే మీతో  ఈ article పంచుకోవాలనిపించింది..ఈనాడు ఆదివారం లో 'ఈ వారం ప్రత్యేకం.."

ఈ article ఇక్కడ చదవండి..
http://www.eenadu.net/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1x

లేదా ఇక్కడ కూడా చదవచ్చు..
https://docs.google.com/open?id=0B19jiOSXOfvGSURKYl9pWlNNdDA


6 నవం, 2012

లక్ష్మి ..సాగరిక….

ఓసారి  ఏమైందంటే..

ఆ రోజు నాగుల చవితి అన్నమాట..పొద్దున్నే అమ్మ,నాన్న,నేను,చెల్లి స్నానాలు చెసేసి, మా వీధి  చివర ఉండే నాగుల పుట్టకి వెళ్ళిపోయి,పూజ చెసేసి,పుట్టలొ పాలు పోసేసి, ఆనక మా పొట్టలో కూడా పొసేసుకొని ఇంటికి వచ్చి టీవీలో నోము సినిమా చుస్తుంటే(ప్రతీ నాగుల చవితికీ ఈటీవీలో వస్తుంది...:) )..పక్కింటి ఆంటీ గుడికి వెళ్తూ ,అమ్మని ఎదో అడగడానికి వచ్చారు.  

ఆవిడ చక్కగా ఒక బుట్టలో తేగలు,చిమ్మిలి,తాటి బుర్రలు అన్నీ సర్దుకొని ,అరుగు మీద పెట్టారు. ."పొరిగింటి పుల్లకూర రుచి"  అని అమ్మ ఎన్ని చేసిన మేము తినకుండా ఆ ఆంటి అమ్మతో మాట్లాడి బయటకు వచ్చే లోపల మేము బుట్ట మీద పడి మొత్తం ఖాళీ  చేసేసాం .:/ ..ఆవిడ బయటకి వచ్చి ఖాళీ బుట్ట చూసుకొని..అమ్మని చూసి..ఏడవలేక నవ్వుతూ వెళ్ళిపోయింది పాపం.:D..అంతే అమ్మ మమ్మల్ని ఒక చూపు చూసింది..మాకు గుండెల్లో బస్సులు, రైళ్ళు అన్నీ పరిగెత్తాయి..భయంతో నేనూ చెల్లీ ఒక మూల కి వెళ్ళి కుర్చొని సాయంత్రం దాక కదలలేదు..అమ్మ కూడా ఏం మాట్లడలేదు..  :(


ఇంక సాయంత్రం అమ్మ ఇద్దరికీ స్నానాలు చేయించి...అన్నం పెట్టింది..అప్పుడు పాపం  అమ్మకి మా మీద జాలి వేసిందెమో..కూర్చోబెట్టుకొని కధ చెప్పటం మొదలు పెట్టింది.. 


"ఒక ఊరిలో లక్ష్మి,సాగరిక అనే మంచి పిల్లలు ఉండేవాళ్ళు అంట..వాళ్ళ ఇంటి పక్కనే రమ్య ,సౌమ్య అనే పిల్లలు కూడా ఉండేవాళ్ళు అంట..ఒక సారి లక్ష్మి,సాగరిక వాళ్ళ ఇంటికి ఒక ఆంటి గుడికి వెళ్తూ ప్రసాదం బుట్ట పట్టుకొచ్చింది  అంట..అప్పుడు లక్ష్మి, సాగరిక వాళ్ళు ఆ ప్రసాదం జాగ్రత్తగా ఈగ కూడా వాలకుండా చూసి,వాళ్ళ ఇంట్లో ఉన్న పువ్వులు కూడా కోసి ,ఆ  ప్రసాదం బుట్టలో పెట్టి  ఆంటి వెళ్ళేటప్పుడు ఆవిడకి  ఇచ్చేసారంట ..ఆ ఆంటి చాల సంతోషపడి వెళ్ళిందంట. ఆ ఆంటి పక్కనే ఉన్న రమ్య సౌమ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిందంట..వాళ్ళు ప్రసాదం మొత్తం ఖాళీ చెసేసారంట.(సీన్ అర్ధమైందా??;);))అప్పుడు ఆ ఆంటి ఏమి అనలేదు కానీ, ఊర్లో అందరికీ లక్ష్మి ,సాగరిక మంచివాళ్ళు..రమ్య ,సౌమ్య మంచివాళ్ళు కాదు అని చెప్పిందంట.."నా ప్రసాదం మీరు తినేస్తారా.. x-( అని దేవుడికి కూడా రమ్య సౌమ్య మీద కొపం వచ్చిందంట..దెవుడు వాళ్ళని శపించాడంట ..అప్పుడు వాళ్ళు క్లాస్లో లాస్ట్ వచ్చారంట...లక్ష్మి సాగరిక మాత్రం క్లాస్లో ఫస్ట్ వచ్చారంట.  .."


ఇది విన్న వెంటనే మాకు అర్దమైపోయింది ఆ రమ్య, సౌమ్య మేమేనని అంతే వెంటనే  అమ్మని పట్టుకొని ఏడవడం  మొదలు పెట్టాము " అమ్మ నిజంగానే దేవుడికి కోపం వచ్చిందా??నిజంగానే మేము ఫెయిల్ అయిపోతామా??..:(" అని అప్పుడు అమ్మ చెప్పింది ఆ ఆంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్తే దేవుడికి కోపం పోతుంది అని..వెంటనే మేము పరిగెత్తుకి వెళ్ళి ఆ ఆంటికి సారీ చెప్పి వచ్చాము.. 

ఇది మొదలు మేము ఏ చెడ్డ పని చేసినా లక్ష్మి,సాగరిక ,రమ్య,సౌమ్య..తెర మీదకి వచ్చేవాళ్ళు :D ..వెంటనే తప్పు ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవటం..లక్ష్మి ,సాగరికల్లాగ అవ్వాలని రాత్రి పగలు కలలు కనేవాళ్ళం..నేను చెల్లి ఒకరికి ఒకరు..ఏం తప్పు చేసినా .."లక్ష్మి..సాగరిక ఇలా చెయ్యరు..రమ్య..సౌమ్య లాగ చేస్తున్నావ్".. అనుకొనేవాళ్ళం..క్రమంగా అమ్మ కధల్లో కూడా రమ్య సౌమ్యలు మాలాగ మoచిపనులు చేస్తు లక్ష్మి సాగరికల్లాగా  మారిపొసాగారు..మేము 7th  క్లాస్ కి వచ్చేసరికి లక్ష్మి,సాగరిక ,రమ్య,సౌమ్య అందరూ మంచి పిల్లలైపోయరు.. :D


కానీ అమ్మ చెప్పిన ఆ కధలన్నీ కాశీ మజిలి కధల్లాగా ఒక బుక్  వెయ్యొచ్చు..ఇప్పటికి ఏమన్నా చెడ్డ పని  చేస్తే ఎదో ఒక కధ గుర్తొస్తుంది..అమ్మ ఆ పాత్రలకి పెట్తిన పేర్లు..వాటి ప్రవర్తన అంతా ఎంత బాగుండేదో..సాగరిక (సాగరం నించి పుట్టినది అంటే లక్ష్మి దేవి అన్నమాట)  పేరు అంటే నాకు మరీ ఇష్టం..:)

ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశం మీద మనకు ఇంటర్నెట్,  టీవీ ,పేపర్లలో బోలెడంత సమాచారం గైడెన్స్   దొరుకుతుంది..కానీ ఇవేమీ లేని ఆ రోజుల్లోనే అమ్మ ఎంచుకున్న విధానం ఇప్పటికీ మమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది..ఎవరితోనూ మమ్మల్ని పోల్చలేదు..ఎక్కువగా ఎప్పుడూ తిట్టలేదు..తన క్రియేటివిటితో,సహనంతో  రమ్య ,సౌమ్య ల్లాంటి తన పిల్లల్ని లక్ష్మి సాగరిక ల్లాగ మార్చుకుంది....:)

తల్లితంద్రులు పిల్లలికి ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు   ..జీవితవు విలువలు నేర్పాలి..అసలు విలువలే తెలీకుండా  కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతోమంది బ్రతుకుతున్నారు..కానీ నిజమైన తృప్తి ఎంతమందికి ఉంటుంది..  


నేను ఎంతవరకూ నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ  అలాంటి విలువలు నేర్పిన అమ్మ నాన్నలకి  కృతజ్ఞతలతో....5 నవం, 2012

మదీయ ద్విచక్ర వాహనంబు.."దెబ్బలు తగలకుండా  ఎవరూ  సైకిల్  నేర్చుకోలేరు"

 ఇది అందరూ సాధరణంగా చెప్పే మాట .కానీ నేను నాతో పాటూ  మా అన్నయ్యలందరికీ దెబ్బలు తగిలించి మరీ సైకిల్ నేర్చుకున్నాను...:D .ఎలా అంటే..

నేను  చిన్న స్కూల్ నించి పెద్ద స్కూల్ కి వెళ్ళేటప్పుడు నాన్నగారు నాకో మాట ఇచ్చారు. ఏమిటంటే  నేను కనక 5th క్లాస్ పరీక్షలు పాస్ అయ్యి 6th క్లాస్ కోసం హై స్కూల్ లో సీట్  సంపాదిస్తే, నాకు సైకిల్  కొనిపెడతానన్నారు."దాని మీద రోజు చెల్లి నువ్వు స్కూల్ కి వెళ్ళొచ్చు"  అన్నారు (నేను, చెల్లి ఒకటే  క్లాస్ చిన్నప్పటినించీ. బాబోయ్ నేనేమి ఫెయిల్ అవ్వలేదు అండీ ..నాకు 5 సంవత్సరలప్పుడు  దానికి 4 సంవత్సరాలు. అప్పుడు ఇద్దరినీ ఒకేసారి స్కూల్లో  వేసేసారు..అదన్నమాట సంగతి...:)).సరే నేను పాస్ అవుతానని నామీద నాకు చాల  నమ్మకం ఉండబట్టి..వేసవి సెలవల్లో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నలుగురు అన్నయ్యలనీ  చాలా బ్రతిమలాడా నాకు సైకిల్ నేర్పమని..


సరే ఎలగైతేనేమి ఒక అన్నయ్య ఒప్పుకున్నాడు.వాడు ఒక పేద్ద సైకిల్  తీసుకొచ్చి,  ఒక రెండు రోజులు నన్ను రోడ్   మీద తిప్పాడు.రోడ్  మీద ఎలా నడపాలి ,ఎటు వైపు నడపాలి ఇలాంటి థియరి అంతా చెప్పిన మీదట,ఇప్పుడు ప్రాక్టికల్స్  టైం అన్నాడు.ముందుగా  నన్ను ముందు కుర్చోబెట్టుకొని,హాండిల్   పట్టుకోమనేవాడు.వాడు కూడా పట్టుకొనేవాడు..అలా.. అలా.. ఒకసారి  తను తొక్కుతూ నాకు తెలీకుండా హాండిల్  వదిలేసాడు.నేనూ బాగానే పట్టూకున్నా.స్ట్రైట్  రోడ్  అవ్వటం వలన హాండిల్  తిప్పాల్సిన పని లేకుండా ఒక 5 నిమిషాలు బాగానే పట్టుకున్నా.కానీ, ఎందుకో అన్నయ్య వైపు చూసా అన్నయ్య చేతులు ఖాళిగా ఉన్నాయి.అంతే హాండిల్    ొదిలేసా.ఇంకేముంది ఇద్దరం రోడ్ పక్కన ఉన్న బురదలో జర్రుమని పడ్డాం.నాకేమీ దెబ్బలు తగలలేదు కానీ,పాపం అన్నయ్యకి దెబ్బలు తగిలాయి.అయినా మొదటి సారి కదా నన్ను క్షమించేసాడు అన్నయ్య.మళ్ళీ మరుసటి రోజు సైకిల్ మీద తీసుకెళ్ళాడు.ఇలా ఒక వారం రోజులకి హాండిల్ పట్టుకోవడం నేర్చుకున్నా.కానీ, కాళ్ళు అందేవి కాదు సో, తొక్కడం అన్నయ్య చూసుకొనేవాడు..ఇలా రోజులు గడుస్తుండగా...


ఒకరోజు యధావిధిగా  నేను హాండిల్ పట్టుకుంటే అన్నయ్య వెనకాల పాటలు   పాడుకుంటూతొక్కుతున్నాడు.కాసేపటికి ఎదో స్మెల్ వచ్చింది.చూసా.అన్నయ్య సిగరెట్  కాలుస్తున్నాడు..నేను అలానే కాం గా ఉండి  ఇంటికి వెళ్ళి డిటెక్టివ్ రేంజ్లో  పెద్దమ్మ తో మెల్లగా చెప్పేసా..అంతే వాడికి ఫుల్ కోటింగ్ పడిపోయింది..ఇంక వాడు

"రాక్షసి .. దొంగ మొహమా..నమ్మక ద్రోహి..విశ్వాస ఘాతుకురాలా.."అని నానారకాలుగా తిట్టి, "నీకు సైకిల్ చచ్చినా రాదు" అని  శాపనార్దాలు పెట్టి , తర్వాత నేను ఎంత బ్రతిమలాడినా నాకు సైకిల్ నేర్పలేదు.


సరే సెలవలు అయిపొయాయి.మా ఊరికి మతో పాటూ ఇంకో అన్నయ్య కూడా వచ్చాడు .వచ్చేసరికి నాన్నగారు కొత్త సైకిల్ కొని ఉంచారు.ఆ అనందం తో ఒక రోజు గడిచిపోయింది.రెండో రోజు ఎలాగోలా మెల్లగా మా ఇంకో అన్నయ్యని బ్రతిమలాడా.కొత్త సైకిల్  కదా సరదాగా ఉంటుందని వాడూ  ఒప్పుకున్నాడు.. వాడి దయవల్లా...సైకిల్ చిన్నది అవ్వటం వల్లా.. ఎక్కడం, తొక్కడం కూడా  నేర్చేసుకున్నా...


ఒక రోజు మా అన్నయ్య నేను తొక్కడం చూసి తన శిష్యురాలి ప్రగతిని చూసి మురిసిపోయి ,నన్ను సైకిల్ ఎక్కించి "తొక్కుకుంటూ ఇంటికి వెళ్ళిపో..నేను వెనకాలే వస్తా"  అన్నాడు..సరే అని మొదటి సారి ఎవరి సహాయ సహకారాలు లేకుండా సైకిల్ తొక్కుతున్నాననే ఆనందంలో ఉండగానే ఇల్లు వచ్చెసింది..అమ్మ బయట బావి దగ్గర ఉంది..నా ప్రజ్ఞ్నాపాటవాలు  చూసి మెచ్చుకోలుగ నవ్వుతుంది..అప్పుడు నాకు గుర్తొచ్చింది..ఎమిటంటే..నాకు సైకిల్ బ్రేక్ వేసి దిగడం రాదని.. :O


అంతే..ఇల్లు వచ్చేసింది..నేను దాటెసాను..తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాను..అమ్మ దిగు దిగు అని అరుస్తుంది..నేను అలానే అమ్మని చూస్తూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న్నా..వెళ్ళిపొయా..

తర్వాత అన్నయ్య వచ్చాడు."పిన్నీ అది ఇంకా ఇంటికి రాలేదా" అని అడిగాడు.అమ్మ లబోదిబోమంటూ జరిగింది అంతా చెప్పింది. అంతే అన్నయ్య బండి వేసుకొని బయల్దేరాడు.అప్పుడు నేను మా ఊరు పేరుపాలెం దాటేసి పక్క ఊరు ముత్యాలపల్లి కూడా వెళ్ళిపోయాను.అప్పుడు అన్నయ్య నన్ను ఛేజ్ చేసి పట్టుకొని  ఆపాడు.ఇద్దరం మళ్ళీ కింద  పడ్డాం...:((


ఆ దెబ్బలు మానిపోతుండగా నేను ఎక్కడం, తొక్కడం, దిగడం అన్నీ నేర్చేసుకున్నా ..

ఇప్పుడు ఎవరూ లేకుండ కొంచెం దూరం(మా వీధి చివర కొట్టు వరకూ)సైకిల్ వేసుకొని వెళ్ళి అమ్మ చెప్పిన సరుకులు  తెస్తూ ఉండేదాన్ని.  .
ఇలా ఉండగా ఒకరోజు రోడ్ మీద ఎవరో ఇద్దరు మిత్రులు పాపం ఆప్యాయంగా వారి ద్విచక్ర వాహనాలపై(సైకిల్)  కూర్చొని..ఒకరి భుజం మీద ఒకరు చెతులేసుకొని మాట్లాడుకుంటుండగా..నేను దూరం నించి వారిని తిలకించాను..అప్పుడు నా మనసులో ఒక ఆలొచన వచ్చింది..."కొంప తీసి నేను వాళ్ళ మధ్యనించి వెళ్ళను కదా అని..వెంటనే మళ్ళీ  అనుకున్నా ఛ అలా ఎందుకు చేస్తా..నేను ఇప్పుడు నా ద్విచక్ర రధ సారధ్యం లో  ఆరి తేరి ఉన్నా కదా"  అని...కాని విధి బలీయమైనది కదా ..

వెళ్తున్నా వెళ్తున్నా..వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయా..ఏమైందో తెలీదు..హాండిల్ వాళ్ళ వైపుకి తిరిగింది..అంతే నేను వాళ్ళ మధ్య నించి కొంప తీయకుండానే దూసుకుపోయాను.ఆ మిత్రులు వాళ్ళ వాహనాలతో సహా పడిపోయారు.ఏం జరిగిందో వాళ్ళకి అర్ధం  కాలేదు.నాకు అర్ధమైంది ..ఎందుకంటే అలవాటు అయిపొయాయి...:) .వాళ్ళకి అర్ధం అయ్యాక   మెల్లగా లేచారు..నన్ను  అదోలా చూసి నన్నూ  లేపారు..నేను సిగ్గుతో ఇంటికి పారిపోయాను..ఏం జరిగింది అని అమ్మ అడుగుతున్నా.ఏం చెప్పకుండా .లొపలికి పారిపోయా..తర్వాత పాపం వాళ్ళు నా వాహనాన్ని మా ఇంటికి తెచ్చి ఇచ్చారనుకోండి..పాపం ఏమి అనలేదు వాళ్ళు కూడా...:))


 ఇదండి నా సైకిల్ కధ..తర్వాత చెల్లిని వెనకాల ఎక్కించుకొని వీర తొక్కుడు తొక్కెసాననుకోండి..బ్రేక్స్ లేని సైకిల్ తో కూడా సేఫ్ గా ఇంటికి వచ్చేదాన్ని..కాలేజ్లో  ఉండగా స్కూటీ  కూడ నేర్చేసుకున్నా మా ఫ్రెండ్ని పడేసి మరీ..:P