??????

12 ఫిబ్ర, 2013

బ్రోచేవారెవరురా...

ఒకానొక ఆదివారం సాయంత్రం..
తెల్లారితే సోమవారం..ఆఫీసు..మేనేజరు..ఇష్యూషు..
గుర్తొచ్చి ఎంతసేపటికీ వదలని బెంగ.ఆ బెంగలో ఒక నిర్ణయం..పోనిలే రేపు త్వరగా వచ్చేద్దాం అనుకొని అలాగే దిగాలుగా పడుకొని
పొద్దున్న లేచి ఆఫీసుకి వెళ్ళీ,టీ బ్రేక్కి కూడా వెళ్ళకుండా పనంతా ముగుంచుకొని, అయిదున్నరకల్లా తట్ట బుట్ట సర్దేసి కేబ్ ఎక్కేసి ,ఆరు గంటలకల్లా
'ఎం ఎం టి యెస్'
స్టేషన్ కి వచ్చేసి..అక్కడ 'జే ఎన్ టి యు' వెళ్ళే  ఒక సర్వీసు ఆటో ఎక్కి కూర్చున్నాకా,
అప్పటిదాకా ఆఘమేఘాల మీద సాగిన మన ప్రయాణం కాస్త కుంటు పడుతుంది.

సర్వీసు ఆటో అంటే తెలియని వాళ్ళకి
(అసలు ఆటో అనగా అందులోను సర్వీసు ఆటో అనగా ఏమనగా
అనగనగా ఒక బుజ్జి ఆటో . ముచ్చటగా మూడే చక్రాలతో శోభిల్లే  త్రిచక్ర రధము . స్కూటర్కి ఎక్స్తెన్షన్ లాగాన్నమాట.రధసారధికి(డ్రైవర్) కాక వెనకాల ఇంకా ముగ్గురు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది.


ఇంకా ఈ ఆటోలలో సర్వీసు ఆటోలు కలవు.ఇవి కూడా పసుపు రంగులో మూడే చక్రాలతో మామూలు ఆటోలకన్నా కొంచెం చిన్నవిగా ఉండును.ఇక్కడ ఆటోలో ముగ్గిరికే చోటు ఉన్నా రధసారధి  గారి మనసు చాలా విశాలమవటంచేత  ఎనిమిది మందికి (వెనకాల నలుగురు ఆడవాళ్ళు..ముందు ముగ్గురు మగవాళ్ళు)తక్కువ కాకుండా ఆటో కదలలేదు.మీరు సర్వీసు ఆటో ఎక్కినచో ఒక్కొసారి మీకు మూడు చేతులున్నట్లు ఇంకోసారి మీకు అసలు చేతులే లేనట్లు అనిపించి ఒక వింత అనుభవానికి గురి అయ్యెదరు.ఇక కాళ్ళు, అక్కడే ఎక్కడో ఉండును..ఎవరో ఒకరు తొక్కగానే ఎక్కడ ఉన్నయో ఖచ్చితముగా తెలియును.అంతవరకూ నిర్భీతిగా కూర్చున్నామనిపించుకొని మనదగ్గర ఉన్న పర్సు వగైరాలు మాత్రం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండవలెను   )
అంచేత ఎనమండుగురూ ఆటో ఎక్కేవరకూ ఈగలు ..దోమలు బాగా  తోలుతూ మునిసిపాలిటీ వారికి సహకరించాలన్నమాట.
ఒక పది ఆటోలు వరసగా ఉంటాయి.ఒక ఆటో పూర్తి అయ్యిన తర్వాత ఇంకో ఆటో అన్నమాట.అన్ని ఆటోల్లోనూ అమ్మాయిలుంటారు వెనకాల సీట్లో కూర్చొని ముందు సీట్లొ వచ్చి కూర్చోని ఆటోని కదిల్చి జీవితానికి మోక్షాన్ని ప్రసాదించే "మగధీరుల " కోసం ఎదురు చూస్తూ ..
అలా వెనకనున్న అమ్మయిలలో నేనూ ఒకతెను .ముందు ఇంకా ముగ్గురు అబ్బయిలు రానిదే ఆటో కదలదు.ఒక లోకల్ ట్రైన్ వచ్చేసరికి బిల బిల మంటూ జనం బయటకు వస్తుంటే మమ్ము బ్రోచే నాధులెవరా అని ఎదురు చూడగా చూడగా ఒక ఇద్దరు వచ్చి ఆటో ఎక్కేయగానే హమ్మయ్య ఇంకా ఒక్కరే అని ఊపిరి తీసుకున్నానా?
ఆ ఒక్క మగాడు ఎంత సేపటికీ రాడే ..
దోమలు కూడా అయిపోయాయు ఆటోలో అందరూ కొట్టేసే సరికి.
ఆరున్నర ..ఆరునలభై ఊహూ .. ధీర ధురంధరుడు ఇంకా రాడే
నీరసం..కోపం...
ఇంతలో చీకటిలోనించి ఒక రూపం నేను కూర్చున్న ఆటో దిశగా వస్తుంది..
"అమ్మాయా?అబ్బయా?" నేను
ఆ రూపం దగ్గరవుతుంది..
"హమ్మయ్య అబ్బాయే..ఎక్కుతాడో లేడో..ఈ మగడు కూడా ఏ బైకో ఎక్కి వెళ్ళిపోతాడో? " నేను
వచ్చేస్తున్నాడు..ఇటువైపే ..


ఎక్కేస్తున్నాడు..ఎక్కేశాడు.
మగడు కాస్తా మగఢీరుడై ఆటొని కదిపాడు..
నాకు ఆనందంతో కల్లళ్ళో నీళ్ళు వచ్చాయి..


ఆ పురుషోత్తముని చూసి నా మది పరవశించి


"మగధీర నువ్వె ఆటో ఎక్కరా..
నువ్వు లేక ఆటో కదలలేదురా.."
(మగధీర నన్నే చేకొనరా పాట)

"పురుషోత్తమా ..
ఎదురుచూసితిమయ్యా మేము పురుషోత్తమా..
నువ్వు ఆటో ఎక్కవయ్యా కోనేటిరాయడా"

"ధీర ధీర
ఆటో కదలలేదురా
చేరరార శూర
సీటందుకో దొర
(సారీ అక్కడ సీటు ఉండదు పాపం) "


"కుంభి నికర కుంభస్థ గురు కుంభి వలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి  శమదృతి ఛత్రపతి
(అంటే ఏంటని అడక్కండి నాక్కూడా తెలీదు..)  "


అని
గతుకుల్లో ఎగిసిపడే ఆటో నా పాటలకు తాళం వేయగా, నాకు తోచిన పాటల పుష్పాలు..ఆటో దిగేవరకు మనసులోనే పాడేసుకుంటూ ఆ ధీరుని పదపద్మములకు అర్పించాను..
6 ఫిబ్ర, 2013

కలువలు పూయించండి


కలువ పూవులు,తామర పూవులు సాక్షాత్ లక్ష్మీ స్వరూపాలు,వీటిని దేవతా పుష్పాలు అంటారు కూడా.
వినయక చవితికి చిన్నప్పుడు మన ఊర్లో చెరువుల్లోంచి బోలెడన్ని పువ్వులు తీసుకొచ్చి పూజలు చేసేవారు కదా.
అలంటి కలువపూలు మన ఇంట్లో పూస్తే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదా..
దీనికి పెద్ద పెద్ద ఇళ్ళు,స్థలాలు అక్కర్లేదండోయ్.మనం ఉన్న చోటే ఒక పెద్ద ప్లాస్టిక్ తొట్టి పట్టే చోటు చాలు.కాకపోతే అక్కడ బాగా ఎండ మాత్రం పడేలా ఉండాలి.
ఒక పెద్ద ప్లాస్టిక్ తొట్టె తీసుకొండి.కింద చూపించిన పరిమాణంలో లేదా అంతకన్న పెద్దది మీ స్థలాన్ని బట్టి అన్నమాట.

ఇది నేను పెంచుతున్న కలువ పూల తొట్టిఇప్పుడు తొట్టిని సగం కంటే కొంచెం ఎక్కువ భాగన్ని నల్లమట్టితో నింపండి(ఎర్రమట్టి పనికి రాదు).తర్వత కలువ పూల మొక్కలను తొట్టి అంచుల దగ్గర పాతండి.అంటే మొక్క మొదలు తొట్టి అంచు దగ్గర ఉండాలి.ఆకులు లోపలికి తేలియాడేలా ఉండాలి.పైన చూపించిన తొట్టి పరిమాణానికి రెండు మొక్కలు పడతాయి.మొక్కలను పాతిన తర్వాత మట్టి పైన జాగ్రత్తగా గులకరాళ్ళను వెయ్యాలి.
ఇలా కలువ పూల తొట్టి సిద్ధమైపోయిందన్నమాట.
ఆహా అప్పుడే అయిపోలేదు.
ఇంటి  ముందు ఇలా నీరు నిలువ ఉంటే దోమల బెడద కదా..అందుకని ఇలా తొట్టి సిద్ధమైన ఒకటి రెండు రోజులకి నీళ్ళు బాగా తేరుకుంటాయి.అప్పుడు 'గప్పీస్'  అనే చిన్న చిన్న (అక్వేరియం షాపులలో దొరుకుతాయి) చేపలను తొట్టిలో వెయ్యండి.ఈ చేపలకు మేత ఎమీ అవసరం లేదు కానీ అప్పుడప్పుడు బిస్కట్ పొడిని వెయ్యండి. ఒక మూడు జతలు తెచ్చి వేస్తే చాలు బోలెడన్ని పిల్లల్ని పెట్టెస్తాయి.రంగుల రంగుల తోకలతో భలే ఉంటాయి.ఇవి ఒకటి నించి రెండు సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతాయి.కలువ పూల తొట్టెలోనికి ఇవే అనువైనవి.జాగ్రత్తలు
1.తొట్టెకి నిరంతరం ఎండ బాగా తగిలేలా చూసుకోవాలి.కానీసం రోజులో ఆరు గంటలు ఎండ తగిలితే పూలు బాగా పూస్తాయి.
2.పాడైపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి.
3.నీటీలో పెరిగే నాచు వంటి మొక్కలను కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి.
4.చలికాలం వీటిని జాగ్రత్తగ్గా కాపాడుకోవాలి ఈ కాలంలో పువ్వులు పూయవు.ఆకులు కూడా చిన్నగా అయిపోతాయి


కలువ పువ్వుల మొక్కలు ఇప్పుడు రకరకాల రంగుల్లో నర్సరీలలో దొరుకుతున్నాయి.ఇప్పుడు చలికాలం వెల్ళిపోతుంది కదా..
ఇంకెందుకాలశ్యం? కలువ పూల తొట్టిని పెట్టేసి ..లోగిలిలో పూచిన కలువలను చూస్తూ పుస్తకాలే చదువుకుంటారో.."కెరటాల వెలుగు చెంగలువా" అని పాడుకుంటూ...కాఫిలే తాగుతారో..కెమేరా పట్టుకొని వాటి చుట్టూ తిరుగుతారో..వాటి అందానికి వాటినే చుస్తూ ఇవన్నీ మర్చిపోతారో మీ ఇష్టం ..:))

4 ఫిబ్ర, 2013

నా గృహ హరిత సీమ


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన హార్టి ఎక్స్పో అయిపోయిది.
ఎప్పుడో అయిపోయింది ఈ పిల్ల ఇప్పుడే నిద్రలెచినట్టుంది అని తిట్టుకోకండి మరీ
బుసీ అన్ననుగా..;)
ఎమిటో ఎక్స్పో ఎప్పుడు జరుగుంతుందా అని అంతర్జాలంలో ఎంత వెదికినా సమాచారం దొరకలేదు.ఇక ఈ ప్రదర్శన ఫోటోలు ప్రతి ఏడూ పెట్టి ఆనందింపజేసే తృష్ణ గారి ద్వారా ఆ వివరాలు కనుక్కున్నాను.
జనవరి 26 నించి మొదలయ్యింది.మేము 27 న వెళ్ళాము. ఆదివారం కావడంతో బాగా రద్దిగా ఉంది.అయినా అన్ని మొక్కలు చూశాను కానీ ఊహించినంత ఆకట్టుకోలేదు నన్ను.మాములుగా నర్సరీలలో దొరికే మొక్కలే కానీ ధరలు మాత్రం చుక్కలనంటుతున్నాయి.ప్రత్యేకమైన మొక్కలు అంటే బొన్సాయ్  మొక్కలు,ఆర్కిడ్లు చెప్పుకోవచ్చు.
అందుకే ఈ ప్రదర్శనలలో తప్ప మమూలుగా నర్సరీలలో దొరకని ,నాకెంతో ఇష్టమైన ఆర్కిడ్ మొక్క తీసుకున్నాను.
వంగపండు తెలుపు రంగుల మేళవింపులో భలే ఉంది కదా.దీనిని పెంచడం కూడా చాలా సులభం.ముఖ్యంగా ఇది ఇండోర్ మొక్క కాస్తంత నీరెండ ఒక అరగంట అయినా చాలు హాయిగా బ్రతికేస్తూ పువ్వులు పూస్తుంది.ఒక చోట మాత్రం మరువం మొక్కలు చాలా ఎక్కువగా ,ఆరోగ్యంగా ఉన్నాయి.ఇక కొనకుండా ఉండగలమా??

అలా రెండు మొక్కలు మాత్రమే కొని వచ్చేసాం.కానీ మొక్కలు కొంటూ ఆనందపడుతున్న అంతమందిని చూస్తే మాత్రం భలే అనిపించింది.
నాకైతే ఇంకా చాలా మొక్కలు కొనలనే కానీ "అమ్మా మీ హరితవిప్లవాన్ని వనసీమలకు పోయి కొనసాగించండి.. అర్భక జీవిని నేనెంతా?నా ఇల్లెంతా? మీ మొక్కలకు నీళ్ళు నేను ఇచ్చుకోలేను తల్లీ "
అని ఇప్పటికే వగచి విలపించే  మా ఇంటి ఓనరుగారుగారి దీన వదనం ఒకసారి గుర్తొచ్చేసరికి ఆగిపోయాను.:P
అయినా ఎదో నా పరిధిలో విప్లవానీ కొనసాగిస్తున్నానే  అనుకోండి.;)
ఎలగో ఇంత దూరం వచ్చారు కదా .మా ఇంటి మొక్కలను పలరించేసి వెల్లండి మరీపైన్నించి అల్లిబిల్లిగా అల్లుకుపోతున్న ఈ లతను చూశారా?ఇది చిలకడ దుంప మొక్క తెలుసా? ఎంతో అందంగా ఉండే ఈ ఇండోర్ మొక్కను మీరు పెంచాలనుకుంటున్నారా అయితే తృష్ణ గారి బ్లాగుకి  వెళ్ళాల్సిందే ..:)
కిందనించి పైకి అల్లుకొస్తున్న ఈ మనీ ప్లాంట్ చూసారా?? దీనికి చాలా అంటే చాలా పెద్ద కధ ఉందన్నమాట.అది ఇంకో టపాలో చెప్తానేం 


ఫెంగ్షుయ్ మీద నమ్మకంతో కాదు కానీ ఈ మొక్క అంటే నాకు భలే ఇష్టం.రెండు రోజులకొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే చాలు హాయిగా పెరిగేస్తుంది ..ఏ మంచం పక్కనో పెట్టుకుంటే నిద్రలేవగానే పచ్చగా కళకళలాడుతూ మిమ్మల్ని పలుకరిస్తుంది.ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా భలేగా ఉంటుంది.


ఇవి బాల్కనీలోని మొక్కలు..మందారం,బ్రహ్మ కమలం(ఇంకా పువ్వులు పూయలేదు),నందివర్ధనం వగైరాలు.
ఆ చిన్న చిన్న మొక్కల్లేని కుండీలున్నయే వాటిల్లో మొన్న ప్రదర్శనలో రజనీగంధ మొక్క దుంపలు అమ్ముతుంటే తెచ్చి వేశాను మరి ఎప్పుడు మొలకలు వస్తాయో చూడాలి.ఈ కలువపూల తొట్టి ఉందే దీనికోసం మా ఆయన ప్రాణాలు తొడేసాను..:)
చలికాలం కదా ఇప్పుడు పువ్వులు రావట్లేదు.ఇదిగో మొన్న నవంబరులో పూచిన పువ్వు


ఇవండీ నా హరిత నేస్తాలు.మీరు గమనించారో లేదో ఎక్కువగా ఇండోర్ మొక్కలు ఉన్నాయి.అవును మరీ అవి అయితే మా ఓనరుగారికి కనిపించవు కదా.:) 
ఇంతకీ నేను వెతుకుతున్న కాసియా జవానికా మొక్క దొరకలేదు ప్రదర్శనలో ..:((
ఇంక ప్రదర్శన కి సంభందించిన ఫోటోలు తృష్ణ గారి బ్లాగులో  చూసేసీ ఆనందించేయండి .