??????

30 డిసెం, 2012

వద్దు నీకు ఆత్మశాంతి..



వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆత్మఘోషే బడభాగ్ని జ్వాలై 
నరరూప రాక్షసులను దహించేసేదాకా  
వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆక్రోశమే ఆకాశ ఉరుమై..
నెత్తురు తాగే నక్కలను కాల్చేసేదాకా 
వద్దు నీకు ఆత్మశాంతి 
నీ కడగండ్లే మృగాల
మరణసెయ్యకి రంపపుముళ్ళై కొసేసేదాకా  
నీ కన్నిటిలో భారతావని 
నెత్తుటి మరకలు కడగబడ్డాక.. 
నీ ఆవేదనతో భారత ప్రజల 
వేదనాశృవలన్నీ ఆవిరయ్యాక.
అప్పుడు..అప్పుడే.. 
'నిర్భయం'గా నిదురపో..
మానవత్వం పరిమళించే
మనిషి గుండెలో    
అంతవరకూ లేదు రాదు 
వద్దు నీకు ఆత్మశాంతి .
రగలాలి..రగలాలి..
ఈ కార్చిచ్చు ..

28 డిసెం, 2012

దొరికాడు కన్నయ్య...

నేను ఎన్నళ్ళనించో ఎదురు చూసి,కావాలనుకున్న,నా కిట్టయ్య ప్రతిమ తెచ్చేసుకున్నానోచ్ .
ఆనందం మీతో పంచుకుందామని ఇలా వచ్చా..
నాకు దేవుడి మందిరాలు,విగ్రహాలు ఇలాంటివన్నీ చలువరాతివి ఇష్టం
ప్రశాంతంగా ఉంటూనే ,ధవళ వర్ణంలో మెరిసిపోతూ ఉండే దేవుళ్ళను ఎంత సేపు చూసినా తనివి తీరదు.
తులసీ ()ళం చదివిన వారికి తెలుసు కదా ? చలువరాతి వస్తువుల మీద నా మమకారం.
తులసి కోట కోసం పడినంత కష్టం పడకుండానే ,చలువరాతి మందిరం దొరికింది శిల్పారామంలో..ఇంటికి తెచ్చుకొని చక్కగా నా దేవుళ్ళను దేవతలను మందిరంలో కొలువు తీర్చాను.



కానీ నా కన్నయ్య ప్రతిమ మందిరంలో చూడ చక్కగా కొంచెం పెద్దది లేకుండా,మందిరం బోసిపోయిందే అని బాధ .
చలువరాతి కన్నయ కోసం చాలా చోట్ల వెతికాను.శ్రీవారి రాజస్థాన్ స్నేహితుడు కూడా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది.
అన్ని చోట్ల పెద్దవాడిగా,రాధను పక్కన ఉంచుకొని   చెట్టు కిందో మురళి వాయిస్తూ ఉంటాడే కానీ ఒంటరిగా చిక్కడే మాయలోడు??
మొన్న ,ధనుర్మాస ప్రారంభం రోజు  నా కోరిక మేరకు బిర్లామందిర్ తీసుకెళ్లారు పతిదేవులు
(ఎందుకన్నానంటే,మరి రోజు ధనుర్మాస ప్రారంభం ,అందులోను శనివారం ..అందుకే నేను అడిగిన వెంటనే,
"దేవీ .. దినము మేము రాజాలము.మాకు కాలునొప్పి మరి" అని తప్పించుకోబోయిన వారిని,చెలిగి కుదరక అలిగి మొత్తమ్మీద ఒప్పించాను.ఇంత సాహసం చేయబూనారు కాబట్టి రోజుకి అలా 'పతిదేవు'లైనారు.)  
కానీ మా అదృష్టం కొలది,కాదు కాదు నాకే ఎంత క్యూ ఉన్నా చక్కగా అన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి ,శ్రీవారి అదృష్ట బలానదర్శనం సుళువుగానే అయిపోయింది.
భిర్లా మందిర్ దగ్గర ఒక షాపు ఉంటుంది కదా..అక్కడ బోలెడన్నిచలువరాతి,పంచలోహ,అష్టధాతు దేవుళ్ల విగ్రహాలే కాక,ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు,మరెన్నో పాటల సిడీలు  ఉంటాయి కదా!
అక్కడ నేను అనుకొనేంత పరిమాణంలో రాముడి విత్ ఫ్యామిలీ విగ్రహం ఉంది కానీ కన్నయ్యది లేదు.నేను పదే పదే షాపువాళ్ళను అడిగి విసిగించేసరికి, శ్రీనగర్లో చాలా మార్బల్ ఎంపోరియం లు ఉంటాయి మేడం అక్కడ ప్రయత్నించండన్నారు షాపు యజమాని.
ఇక అక్కడి నించి ఒకసారి లేపాక్షి కి వెళ్ళి,అక్కడ కూడా లేవని తీర్మానించుకున్నాక
శ్రీనగర్  వెళ్ళాం.
అక్కడ వరుసగా చాలా ఎంపోరియంలు ఉన్నాయి. ఒక పెద్ద ఎంపోరియం కూడా ఉంది .అక్కడ కూడా లేడు కన్నయ్య..:(
సరే చివరిగా ఒక చిన్న ఎంపోరియంలో అడిగితే అక్కడ దొరికాడు నా కన్నయ్య.
 పూజించే ప్రతిమ ఎక్కువ ఎత్తు,బరువు  ఉండకూడదని మా అత్తగారు చెప్పారు .నా కన్నయ్య ఇంచక్కా బరువు కూడా లేకుండా,చిన్నగా,పక్కన రాధను కూడా ఉంచుకోకుండా నా కోసమే చూస్తున్నాడు .
ఇంకేముంది గంతులేసుకుంటూ నాతో పాటూ బండి ఎక్కించుకొని తీసుకొచ్చేసా కన్నయ్యని ,

అత్తగారు ఫోను చేస్తే,
"ఇలాగ,కన్నయ్య దొరికాడు అని చెప్పాను".
"ధనుర్మాసం కదా మనింటికి కన్నయ్య వచ్చాడులే "అన్నారు మా అత్తగారు నా సంబరాన్ని రెట్టింపు చేస్తూ..


చక్కగా స్నానం చేయించి, బొట్టూ కాటుక దిద్ది  ,బట్టలు తొడిగి,పూసలతో అలంకరించి,తలపాగా చుట్టి,నెమలి పింఛం పెట్టి,
చేతికొక మురళి ఇచ్చి ఊదుకోమని
"అనుకోకుండా వచ్చావు పెట్టడానికి ఎమీ లేవు.
ఏమనుకోకే ముక్కోటేకాదశి రోజు పాయసం చేస్తాగా రోజుకి పటికబెల్లంతో సరిపుచ్చుకో"మని చెప్పిమందిరంలోకి పంపించా,బుద్ధిగా వెళ్ళి ఎలా మందిరంలో నించున్నడో చూడండి అల్లరివాడు.


చక్కగా సంధ్య దీపమెట్టి ."ముద్దుగారే యశోద" పాట పాడుతుంటే  

వేణువూదుతూ,నవ్వు వెలుగుతున్న నా కన్నయ్య ప్రశాంత వదనాన్ని చూస్తూ 
దణ్ణమెట్టుకున్నాను.

కన్నయ్యను నాకు దొరకబుచ్చిన శ్రీవారికి బ్లాగ్ముఖంగా బోలెడు థాంక్సులు .:)

నా కన్నయ్య మీకూ నచ్చాడా మరీ..?? 

26 డిసెం, 2012

గజరాజు


వరుసగా నాలుగు రోజులు సెలవలు వచ్చేసరికి ఎంచేయాలా అని ఆలోచించీ,సరే సినిమాకైతే ముందు వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం నేను శ్రీవారు.
"గజరాజు" సినిమా ట్రైలర్ చూసి ఫోటోగ్రఫి అదిరింది అనుకుంటూ ఆదివారం సెకండ్ షో కి టిక్కెట్లు తీసుకుందామని హాలుకి వెళ్ళాం.
9:45 షోకి ఎనిమిదిన్నరకి కానీ ఇవ్వరట టిక్కెట్లు.9:30 వచ్చినా ఫర్వాలేదు,ఖాళీగానే ఉంది అన్నారు అక్కడివాళ్ళు.
అసలే మరీ రియలిస్టిక్ గా,విషాదాంతాలు ఎక్కువగా ఉండే డబ్బింగ్ సినీమాలంటే నాకు భయం.
హాలు ఖాళీగానే ఉంటుందనేసరికి,ఒకప్పుడు ఇలాగే ట్రైలర్ చూసి ఫోటోగ్రఫి బాగుందని,మోసపోయి చూసిన డబ్బింగ్ సినిమా  "నిరంతరం నీ ఊహలే" సినిమా గుర్తొచ్చి కొంచెం జంకాం.సరే ఇదేదో బోరింగ్ సినిమాలాగుంది అని ఆ రోజుకి లైట్ తీసుకున్నాం.

మంగళవారంతో సెలవలు అయిపోయాయి.రేపు మళ్ళీ ఆఫీసుకి వెళ్ళలా అని నేను దిగులుపడిపోతుంటే, సరే అయితే మళ్ళీ సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని,ఏ సినిమాకి వెళ్ళలో తెలియక మళ్ళీ గజరాజు సినిమాకి తీసుకొచ్చారు మా సారు.
ఆదివారంతో పోలిస్తే ఫర్వాలేదు జనాలు బాగనే ఉన్నారు హాలులో.సరేలే ఎదో బాగుందని టాక్ వచ్చుంటుందని లోపలికి వెళ్ళాం.అయిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యేచ్ ఉన్నా, ఇంతమంది రావడంతో సినిమా మీద ఆశలు పెరిగాయి.
లోపకెళ్ళి కూర్చున్నాం.
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా
దర్శకుడు ప్రభు సోల్మన్ ఎన్నుకున్న నేపధ్యం,
కేమెరామేన్ పనితనం,
ఇమ్మన్ సంగీతం,
కధలో అంతర్లీనంగా ఇమిడిపోయిన హాస్యం .
టూకీగా కధేమిటంటే,
అడవి ఏనుగులు దాడి చేస్తే వాటిని మళ్ళీ అడవిలోనికి తరిమేసే శిక్షణ పొందిన ఏనుగులను "గుంకీ" ఏనుగు అంటారు.
అనుకోని పరిస్థితుల్లో 'మాణిఖ్యం' అనే  ఒక  ఉత్సవ ఏనుగును గుంకీ ఏనుగుగా  దేవగిరి మన్యం ప్రజలను 'కపాలి' అనే అడవి ఏనుగునించి కాపడడానికి  తీసుకొస్తాడు కధానాయకుడు.అక్కడ కధానాయికను చూసి ప్రేమలో పడి,ఉత్సవ ఏనుగును గుంకీ ఏనుగుగా అక్కడివారిని నమ్మిస్తాడు.


అక్కడి వారు రెండువందల ఏళ్ళ చరిత్ర కలిగి కట్టుబాట్లంటే ప్రాణం ఇస్తారు.అలాగే తమ కట్టుబాట్లను ఎదురిస్తే ప్రాణాలు తీస్తారు కూడా.
అతని ప్రేమ కధ ఎమవుతుంది.కట్టుబాట్లను ఎదిరించి ప్రేమను పొందగలిగాడా?
మాణిఖ్యం కపాలిని ఎదురించగలిగిందా అనేది కధ.
మాణిఖ్యం ,కధానాయకుడి మధ్య గల అనుబంధం ,మాణిఖ్యానికి కధనాయికుడి మీద గల అపారమైన ప్రేమ కంటతడి పెట్టిస్తుంది.


ప్రేమలో పడి కధనాయకుడు చేసిన తప్పులకి చెల్లించిన మూల్యం కదిలిస్తుంది.

ట్రైలర్లో చూపించినట్లుగానే అందమైన ప్రకృతి దృశ్యాలు కేమెరామేన్ పనితనంతో కనువిందు చేసాయి.ఎటువంటి మేకప్ లేకుండా సాధారణంగా చూపించబడినా నాయికను కేమెరాఆంగిల్స్ తో అద్భుతంగా చూపించారు.
పాటలలో అయితే సంగీతంతో పాటూ కేమెరా కదిలిన విధానం నవ్యంగా ఉంది.



సంగీతం విషయానికొస్తే  కధలో ఒదిపోయింది.ఎమోషన్స్ పండించడంలోనే కాక మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి పాటలు.పాటల సాహిత్యం కూడా చాలా బాగుంది.
సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు పాటలు
1.చెప్పేసాలే నా ప్రేమని..



2.అయ్యయ్యయ్యో ఆనందమే..



చిన్న చిన్న విమర్శలు ఉన్నా,మొత్తం మీద సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసామనే భావన తప్పక కలుగుతుంది.అదే సమయంలో మనసు వేదనతో నిండిపోతుంది కూడా.ఏనుగు నటన అద్భుతం .

చూసిన తర్వాత వెంటాడే సినిమా ఇది.


24 డిసెం, 2012

అలా జరిగిందన్నమాట.


అనగనగనగా..
అప్పుడు నాకు అయిదేళ్ళన్నమాట..
నాకు బడికెళ్ళే ఈడొచ్చిందని అక్షరాభ్యాసం చేయించి, స్కులులో ఎల్కేజి లో జాయిన్ చేసారు.
మొదటి రోజు కొత్త బ్యాగు..కొత్త పుస్తకాలు,కొత్త షూలు ఇవన్నిటితో పాటూ అందరికీ పంచడానికి చాక్లెట్లు ..బిస్కెట్లు పాకెట్లు ఇలా అమ్మ బొలేడు ఇచ్చేసరికి నాన్నారి సైకిలెక్కి గంతులేసుకుంటూ స్కూలుకెళ్ళాను.

 

  అందరికీ చాక్లెట్లు,బిస్క్లెట్లు పంచుతాం కదా.అలా పంచేయగా ఇంకా పాకెట్లో బొలేడు ఉన్నాయి.
 "అబ్బ ఇవన్నీ నాకే ఇంచక్కా తినొచ్చు ఎన్ని ఉన్నయో" అని నేను తెగ సంబరపడిపోతుంటే
 "ఏయ్ అవన్నీ నాకిచ్చేయ్."
  అని ఒక గొంతు వినబడింది.ఎవరా అని తల పక్కకి తిప్పి చుస్తే,
  పెద్ద పెద్ద కళ్ళు ..బాబ్ హైర్ కట్తో ఒక అమ్మాయి చంద్రముఖిలాగా ఆ కళ్ళు ఇంకా పెద్దవి చేసి నన్నే చూస్తూ  అడుగుతుంది.
  దెబ్బకి నాకు భయం వేసి కొన్ని తీసి ఇచ్చాను. ఆ అమ్మాయి పాకెట్ మొత్తం లాగెసుకుంది.నేను కిక్కురుమనలేదు.
  ఆ అమ్మాయి రెండవ తరగతి.అంటే నాకంటే మూడేళ్ళు పెద్దదన్నమాట.ఆ అలుసుతోనో..లేకపోతె నేను మరీ అంజలి పాపలా కనిపించానో ఎమో??
 ఇక మొదలయ్యింది నామీద ఆవిడగారి గూండాగిరి.
 రోజు అమ్మ ఇచ్చే చాక్లెట్లు మొదలగు చిరుతిండి అంతా లాగేసుకొనేది.పొరపాటున ఇవ్వనన్నా,దాచుకున్నా ఒక    పొద చాటుకి తీసుకెళ్ళి బాగా కొట్టేది.రోజూ ఇదే తంతు.
 మనం అమ్మ దగ్గరో,టీచర్ దగ్గరో నోరు మెదపొచ్చు కదా..
 యబ్బే..
 చక్కగా రోజు ఆ అమ్మాయికి నా చిరుతిండంతా ఇచ్చేసి,ఇంచక్కగా పొదచాటుకెళ్ళి కొట్టించుకొని,ఆ పొద చాటునే బేర్ బేర్ మని ఎడ్చేసి, లోపల మొగుడు తన్నినా పదిమందిముందూ నవ్వుతూ కనిపించే మహాపతివ్రత రేంజులో పొద బయటకు నవ్వుతూ వచ్చేదాన్ని
.ఒక్క చిరుతిండే కాదు పెన్సిళ్ళు ..బలపాలు అన్నీ లాగేసుకొనేది.
నేను రోజూ స్కూలుకెళ్ళనని ఏడ్చేదాన్ని.



 ఇలా క్షణమొక గండంగా రోజులు గడుస్తుండగా..
  ఒక రోజు ఆ అమ్మయికి పిచ్చి బాగా ప్రకోపించింది .
నేను ఆరోజుకి నా చిరుతిండంతా ఇచ్చేసినా ,
 "నా దగ్గర ఇంకేమీ లేవే నా సాడిష్టు తల్లో.నన్నొగ్గేయవే నా చంద్రముఖో"
 అన్నా వినకుండా నన్ను పొద చాటుకు లాక్కేళ్ళింది.
 "ఏమే నీకు నేను ఆషామాషిగా కనబడుతున్ననా" అంది.
 "నేనేం చేసాను" అన్నాను భయంగా
 "నువ్వు కాదే ఆ టీచర్ది హోం వర్క్ చేయలేదని నన్ను తిడుతుందా"
అని నన్ను వంగోబెట్టి ఒక్క వీపు విమానం మోత మోగించింది.




 నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
 "ఎన్నాళ్ళు..ఇంకెనాళ్ళు నీ దురాగతాలు??ఈ అన్యాయాన్ని నేను సహింపజాల" అని..
 టీచర్ దగ్గరకెళ్ళి
 "ఈ అమ్మాయి నన్ను కొడుతుంది " అని చెప్పాను.
 "తప్పమ్మా ఇద్దరు కలిసుండాలి.ఇలా ఒకరిమీద ఒకరు చెప్పుకోకూడదు" అని చెప్పి,
ఒకరి చేత ఒకరికి కరచాలనాలు చేయించి,మా మద్య స్నేహాన్ని చిగురింపజేసి ఇద్దరినీ క్లాసులకి పంపించేసింది. నేను బిక్కు బిక్కుమంటూ క్లాసుకేసి నడుస్తున్నాను.
టీచర్కి చెప్పాను కదా మన చంద్రముఖి సాడిజం ఉగ్ర రూపం దాల్చింది.
 పొద చాటుకి తీసుకెళ్ళి బ్లేడుతో పర పర మని చేతి మీద కోసేసి,నా పీక పట్టుకుంది.



అంతే నేను అరిచిన అరుపు మొత్తం స్కూలు అంతా అక్కడ ప్రత్యక్షం అయ్యింది.
 సాడిస్టు చంద్రముఖి అలా ప్రత్యక్షంగా దొరికిపోయింది.
 తర్వత ఆ అమ్మాయిని స్కూలు వాళ్ళు పంపించేసారు.
 నెల రోజుల టార్చర్కి అల తెర పడింది.
 కాని నేను మాత్రం ఆ స్కూలుకి చచ్చినా వెళ్ళనని కూర్చున్నా.
ఇంకేంచేస్తారు అమ్మావాళ్ళు.ఈసారి ఒక్కదాన్నే ఎందుకని నాతో పాటూ చెల్లినీ కలిపి ఒకే స్కూలులో వేసేసారు.


 తర్వాత ఒక సంవత్సరకాలం
" నన్ను కొట్టొద్దు. గిల్లొద్దు. రక్కొద్దు" అని కలవరిస్తునే ఉన్నా.
ఇప్పటికీ ఆ చంద్రముఖి కళ్ళు నేను మర్చిపోలేను.
 ఇందువలనచేత..
 నేను చెప్పొచ్చేదేమిటంటే మీ పిల్లలు చదువుతున్న స్కూలులో ఇలాంటి పనులు చేసే పిల్లలు కూడా ఉండొచ్చు.మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండోయ్.పిల్లలు అన్నీ చెప్పలేరు.మనమే అన్నీ ప్రశ్నలు వేసి తెలుసుకోవాలి.
మీకు తెలిసిన విషయమే ఒకసారి గుర్తు చేస్తున్నా ..
 పిల్లలు జర బధ్రం.

15 డిసెం, 2012

బాపూ గారికి జన్మదిన శుభాకాంక్షలు..



సిత్రాల బాపూ..
సినీమాల బాపూ..
నవ్వుల బాపూ..
తెలుగును వెలిగించిన
'రమణీ'య బాపూ..

గారికి జన్మదిన శుభాకాంక్షలు..:))

14 డిసెం, 2012

వేణుగాన సమ్మోహితనై....



జారు పమిట చూసి వెన్నెల రేడు నవ్వుతున్నా.. 
విచ్చుకున్న సన్నజాజులెక్కడికని ఆరా తీసినా..
చిరుచెమట కరిగిన కస్తూరి గుభాళించి గుట్టు రట్టవుతున్నా ..
గుదిగుచ్చిన మాలికనుండి ఒక్కో ముత్యం జారిపడుతున్నా..    
పిల్లతిమ్మెరలు చిగురుటధరాలను వణికిస్తున్నా   ..
భువి సింగరించుకున్న పున్నాగలు లత్తుకపదములను అడ్డుకున్నా  ..
నీకై చేబూనిన కడువలోని నవనీతం నా మానసమల్లే పొంగుతున్నా..
నీ వేణు గాన పిలుపులు విని ,
పరుగు పరుగున వచ్చాను కన్నా.. 
నీ నవ్వుల వెన్నెల వానలో తడువనిస్తావనీ ..
నీ అధర తేనియల మధురిమలో తేలియాడనిస్తావనీ. .
నీ ముద్దు మోమును నా కంటిపాప అద్దమున వీక్షిస్తావనీ..
నీ ముకుంద  ముగ్ధ చరణాల అరుణిమ చెంతింత చోటిస్తావనీ..    
ఈ క్షణాన మాత్రమే కాదు సుమా  !
కడవరకూ ....
ఈ 'రాధా'కుసుమ పరిమళం పూర్తిగా ఆవిరయ్యేంతవరకూ.. 

చిత్రాలు:
ఇది నేను ఇంటర్ చదువుతుండగా వేసుకున్న చిత్రం.
అప్పుడప్పుడే వాటర్ పెయింట్స్ దాటి ఫాబ్రిక్ పెయింట్స్ మొదలు పెట్టాను..
ఎందుకో చిత్రకళంటే ప్రత్యేకమైన అభిమానం.
ఎక్కడా నేర్చుకొనే అవకాశం రాలేదు..ఇప్పుడు నేర్చుకుందామంటే సమయం చిక్కట్లేదు.
పెద్దగా పరిపక్వత లేకపోయినా ఇలా మీతో పంచుకోవాలని ఇక్కడ పెడుతున్నాను..

8 డిసెం, 2012

మా గొప్ప మారాజులు




సూరి :
"ఒరేయ్ సుబ్బిగా... ఆ పుగ అలా గుప్పుగుప్పుమని సేగోడీలు..జంతికల్లెక్కన గాల్లోకి  ఒదిలితే నీగ్గాదు నీపక్కనున్న నాకోత్తాది కేన్సరు "
సుబ్బు :
"ఓసోస్..మాకు తెల్దులే కేన్సరొత్తే ఏటంటా? కలిసే సద్దారి "
సూరి :
"గొప్పొడివిలే.. నీతో నేను సావలేనుగాని ..ఏటి రా ఆకాశంలోకి సూత్తా తెగ ఆలోసిత్తున్నావ్ "
సుబ్బు :
"అడికాదుగానోరేయ్ !కేన్సరంటే గేపకమోచ్చింది మన జానకమ్మ పోయింది కేన్సరుతోనే గాందా"
సూరి:
"అవునురా .ఆయెమ్మ ఇంక లేదంటే గుండెసెరువైపోతుంది..మా గొప్ప మనసు ఆయెమ్మది .."
సుబ్బు : 
"జానకమ్మ పోయాక  జమిందారీగోరు   ఎటేల్లిపోనాడో ?"
సూరి :
"నిజమేరా సుబ్బిగా ఎటేల్లినాడో ??ఎప్పుడైతే ఆ మాతల్లి ని ఇడిసిపెట్టేసినాడో  ఆనాడే ఆయన వైబోగామంతా పోయిందిరా..మడిసి బొత్తిగా కళతెప్పేసిన్నడు "
సుబ్బు :
"అందుకేరా సూరిగా  సెప్పుడు మాటలనికూడదనేది ఆ బంగారు తల్లి నిజంగా లచ్చిమేరా ."
సూరి :
"అవునురా .లేకపోతే పెద్ద జమిన్దారిగారి రెండో భార్య ఆస్తి మీద కన్నేసి కట్టుబట్టలతో ఎల్లగోట్టినా ..మాతల్లి ఒక్క మాట కూడా అడక్కుండా జమిన్దారిగారి ఏనాకాలే ఎల్లిపోనాది "
సుబ్బు :
"ఆ తల్లి ఎమన్నా తక్కువింటి నుంచి ఒచ్చిందేంట్ర్రా  .ఆల్లది ఇంతకంటే పెద్ద జమీను .."
సూరి :
"ఎంత సంపదలోంచోచ్చినా ఆ గర్వమే ఉండేదికాదు .అడిగినోల్లకి లేదనకుండా ఇచ్చేది .మాతల్లికి సేతికెముక ఉండేది కాదు "
సుబ్బు :
"కోటలోంచి ఎల్లిపోనాక గోదారొడ్డున సిన్న పూరిగుడిసెలో సర్డుకుపోనాది "
సూరి :
" మంచితనానికి ఇంకా రోజులేల్లిపోలేదురా.మన అంజయ్యగారుకూడా జమిందారిగోరినంటిపెట్టుకొనే  ఉండేటోడు .. ఆరి ఆస్తులు పోయినా ..ఆరు జీతమియ్యకపోయినా ఆరికోసం కోర్టుల సుట్టూ  తెగ తిరిగినారులే. "
సుబ్బు :
"ఒసోస్ ..ఆమాటకొత్తె బుల్లి జమిన్దారుగారు ఏటి ??..ఆరు కూడా ఎంత గ్రేటో.ఆస్తి మీద కన్నేసి జమిన్దారిగారి రెండో భార్య ఈల్లని ఎల్లగోట్టినా ..కోర్టుల సుట్టూ  తిప్పినా ..పెద్దోల్లందరూ కాలం సేసినాక జమీనంతా  అన్నగారికి ఒప్పజేప్పేసినారు."
సూరి :
"అప్పుడినించే కదరా ఊరికి మంచి రోజులోచ్చినియ్యి .ఆయన జమిందారి పద్దతి గురిన్సి..ఆ ఏటి?? సుట్టుపక్కల పదూల్లకే కాదు ముఖ్యమంత్రి దాకా ఎల్లింది కదరా .ఎంత బాగుసేసాడు రా ఊరుని..ఊరు తీరె మార్సేసాడు..ఇయ్యాల ఊర్లో అందరూ కలో గంజో తగుతున్నారంటే..ఆయన సలవ కాదేటి రా     "
సుబ్బు :
"అంతే కదరా మరీ..
ఏంలాభం  మారాజులకి కట్టాలు తప్పాయేంట్రా..
సామెత సెప్పినట్టు ...అనుమానం మా సెడ్డదిరా ..
గోదారొడ్డున ఆడెవడో అమ్మగోరిని రోజు సుడ్డమేంటి ?
అమ్మగారు ఇలా ఉంటారు అలా ఉంటారని.. నాకనుభవమయ్యిందని ..
ఆడు ఈరిగాడిదగ్గర  వాగాడమేంటి ??
ఊరంతా అది పోక్కడమేంటి ??
అదొచ్చి ఎవడో   జమిన్దారిగారికి సెప్పడమేంటి ??
ఏ కళనున్నడో జమిందారిగోరు.ఆడి మాటలిని జమిందారి పరువు పోతుందని ఇద్దరు పసిబిడ్డ్లలతో  సహా జానకమ్మని  పుట్టింట్లో వుదిలేయడమేంటి ..
సిత్రం కాకపొతేను. "
సూరి :
"సిత్రం కాదురా.. పెద్దోల్లందరూ అంటరే ఇది అని..అదే మరి "
సుబ్బు :
"ఏ  మాట కామాటేరా పరువుకోసం అమ్మగోరిని ఇడిసిపెట్టారు కాని.పేమ లేక కాదురా ..ఆ తర్వాత మడిసి మడిసిలో లేడు .అసలు తర్వాత ఊరు ముకమే సుల్లేదు మారాజు "
సూరి :
"తర్వాత ఎంత ఇదైపొతే ఏంట్రా??తప్పు తెలుసుకొని ఎల్లేసరికి మాయదారి కాన్సరు  ఆయెమ్మ పేనం తీసేసింది "
సుబ్బు  :
"పాపం ఇంకేటి సెత్తారు  .నిండా పదెనేల్లు లేని ఆ పిల్లలకి ఊరునప్పజెప్పేసినాడు.పోని జమీను బుల్లిజమిందారుగోరికి ఒప్పజేప్పుదామంటే ఆయనేమో అన్నగారి ఆస్తి ముట్టుకోనని కూసున్నాడు ."
సూరి :
"అవునులే ఇంకేటి సెత్తారు ..ఆ పసిబిడ్డలకే  అన్ని ఒప్పజేప్పేసి ఎటెల్లిపోనాడో.."
సుబ్బు  :
"ఆ పిల్లలే ఊరునిక సూసుకోవాలి .ఆయన ఉన్నంతకాలం ఊరు ఎలిగిపోయింది .. మా గొప్ప మారాజులు   "

5 డిసెం, 2012

గుద్దులాట నవ్వులాటై..


నిన్నేమైయ్యిందంటే మా ఆయనకి నాకు డిష్యుం డిష్యుం అయ్పోయిందన్నమాట.
డిష్యుం డిష్యుం ఎందుకైయ్యింది అని పక్కన పెట్టేస్తే..

బేసిగ్గా మనం క్లాసులు పీకెవాళ్ళంటే ఆమడ దూరం పారిపోతాం..
మరి మన దేవుడు గారికి జోకులు వెయ్యడం బాగ ఇష్టం కదా..
అలా పారిపోయే నన్ను జీవితాన్ని కాచి కాదు కాదు మరగబెట్టేసి మరీ వడపోసేసి తన అనుభవ సారంతో  తెగ క్లాసులు పీకేసే మా ఆయనకి ముడి పెట్టెసాడు..

నాకేమో ఎదుటివాళ్ళు ఇలా అనుకుంటారు అలా అనుకుంటారు అలంటివేమీ తెలీదు అన్నమాట..
సో అలా తింగరి మంగళం పనులు చేసేసి పాపం మా ఆయనని బాగా విసిగించేస్తా..
అలాంటి తింగరి పని ఒకటి చేసి మా ఆయనకి దొరికిపోయా

మా ఆయన క్లాస్ పీకడం మొదలెట్టేసారు..
సరే మనం ఊరుకుంటామా సగటు మొండి పెళ్ళాం లాగ వాదిస్తాం..
వాదన పెరిగి
ధూం ధాం..
డిష్యుం డిష్యుం..
దిత్తై తకతై
ఎడమొహం పెడమొహం..

అంతా అయిపోయాక..
"ఇదంతా కాదురా నేను చెప్పేది నువ్వు కరెక్ట్ గా   రిసీవ్ చేసుకోవట్లేదు ..నీ ఆలోచనా  విధానం మారాలి.."
అన్నారు మా శ్రీవారు కూల్ గా.
" ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు..నువ్వే నా బాధ అర్దం చేసుకోవట్లేదు.."
అని చెప్పి అటు తిరిగి కిటికి వైపు చూస్తున్నా..
"అదిగో మళ్ళీ..ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు..నేను చెప్పేది లోచిస్తున్నావా లేదా."
"హ్మ్మ్ " నేను
"చెప్పు..ఈ క్షణం ఎగ్జాక్ట్ గా  నువ్వేం ఆలోచిస్తున్నవో చెప్పు..ఈ క్షణం ఇప్పుడు చెప్పు..  "
"నిజం చెప్పనా..?"
"చెప్పు  ప్లీజ్..ఈ క్షణం..దాన్నిబట్టి నీ అలోచనలను నేను అర్ధం చేసుకుంటాను.."
అప్పటిదాకా దీక్షగా కిటికీ కర్టెన్ వైపు చూస్తున్న నేను ఇటు తిరిగాను..
"మరీ..మరీ"
"చెప్పు "
............................
............................
............................

"మరీ..వాషింగ్ మెషీన్ లో వేస్తే కర్టెన్లు ముడతలు పడిపోతాయి కదా" అన్నాను

అంతే 
మా ఆయన రియాక్షన్ చూడాలి ..
ఒక్క క్షణం షాక్ గురి అయ్యి అలా ఉండిపోయారు..

"నిజంగా అదే అలోచిస్తున్నా" అన్నా అమాయకంగా మొహం పెట్టి.
వెంటనే ఇల్లు ఎగిరిపోయేలా గాఠ్ఠిగా నవ్వేసారు..
హమ్మయ్యా సారు నవ్వేసారు..:)
నేనూ అప్పటిదాకా ఆపుకుంటున్న నవ్వుని ఆ ఆయన నవ్వుతో జత కలిపా..
ఇంకేమిటి చూస్తున్నారు ??

గొడవ గోదాట్లోకి..
మేము ఆఫీసులకి..:)


క్లాసులు  తప్పితే మిగిలిన విషయాలలో మా ఆయన ప్లాటినమేనండోయ్..:))

ఈ సందర్భంగా ఈ ఫాట వినేయండి మరీ..







4 డిసెం, 2012

మనమోహనా..

ఇది నాకెంతో ఇష్టమైన కృష్ణగీతం..
జోధా అక్బర్ సినిమాలోనిది.
సాధారణంగా డబ్బింగ్ పాటల సాహిత్యానికి స్వేచ్ఛ ఉండకపోవడంవలన చాలా పాటలు అర్ధంలేని పదాల కూర్పులాగానే మిగిలిపోతాయి..
కానీ ఈ గీతంలో భక్తి..ఆరాధన..ప్రేమ..ఎంతో బాగా వ్యక్తపరిచారు.
రెహమానుని సంగీతానికి తోడైన సాధనా సర్గం మధురమైన ఖంఠం పాటకి పరిపూర్ణతను చేకూర్చింది.
ఈ పాట ఇక్కడ వినండి.


పల్లవి:
మనమోహనా..
మనమోహనా..
కృష్ణా మొర వినవా..
కుదురే లేదు నువులేక..
యద కోరెనే నీరాక..
వీడి రావయ్య కాశీమథురా..
నా దరి చేరగ రా కుదురే లేదు నువు లేక..

చరణం:
నవనీతాచోర బృందావనిలో విహరించేవాడా..   
రాధామనోహరా ..
కనిపించవేమయ్యా..
గారాల నందుని తనయ గోపీకృష్ణ వనమాలీ ..
నీ పదముల చేరాలీ..
నీకై తపియించానే..

చరణం:
నేనూ నీదాననులే నా జీవితమే నిదేనయ్య..
నాకంటిపాపవులే ..
నాలోని జ్యోతివిలే..
మురళిని నేనవుతాను నీ పెదవులనంటి వుంటాను..
వీడనులే ఎన్నటికీ...
నువ్వేలే నా ప్రాణం.. 

జోధా పూజించే కృష్ణుడి ప్రతిమ కూడా ఎంత బాగుంటుందో..

ఈ పాటను ఇక్కడ డవున్లోడ్ చేసుకోవచ్చు