??????

21 మార్చి, 2013

అవును! అమ్మగా రాజీ పడలేను(కధ)


కారు ఆగింది.
"పదినిమిషాలలో వచ్చేయ్యాలి..అవతల చాలా పని ఉంది నాకు" అన్నరాయన .
"రాజీ రామ్మా ..శ్రావణి ఆంటీని ఎప్పుడూ అడుగుతావుగా.." అన్నాను ఆయన వళ్ళో ఉన్న నా కూతురిని అందుకుంటూ.
"పాప ఎక్కడికి ? ఆ అలగాజనం మధ్యలోకి నా కూతురు రాదు..నువ్వు కూడా త్వరగా వస్తే మంచిది" అన్నారు .
ఏంచేయలేక ఏడుస్తున్న పాపని కార్లోనే వదిలేసి కారుదిగి పందిట్లో అడుగు పెట్టాను.బొమ్మరిల్లులాంటి చక్కని పెంకుటిల్లు. చుట్టూ తోట ,మామిడిచెట్లు, బంధువుల హడావిడితో కళకళలాడిపోతుంది.ఆ ఇంటితో ఎన్నెన్నో జ్ఞాపకాలు తడుముతుండగా మెల్లగా లోపలికి వెళ్ళాను.
ఎదురుగా శ్రావణి వాళ్ళ అమ్మగారు ఒక పెద్ద బిందె పట్టుకొని ఎదురొస్తున్నారు.
"ఆంటీ బాగున్నారా? నేను గుర్తున్నానా? " అని పలుకరించాను ఆంటీని చేతిలో ఉన్న బిందెని అందుకుంటూ.
"ఎవరూ ??మల్లికేనా ??అమ్మా ఎన్నాళ్ళకి.? బాగున్నావురా తల్లీ? శ్రావణి మూడు రోజుల నించి కలువరిస్తుందమ్మా నువ్వు వస్తావో రావోనని..నీకు కూతురని విన్నాను ఎక్కడ??మీవారు ఎలా ఉన్నారమ్మ్మా?"
అని ప్రశ్నల వర్షం కురిపించారు ఆంటీ.ఆంటీ నన్ను గుర్తుపట్టినందుకు ఎంతో సంతోషమేసింది.ఎప్పుడో హైస్కూలు రోజుల్లో వస్తూ ఉండేదాన్ని శ్రావణి వాళ్ళింటికి .
"అంతా బాగున్నారాంటీ..పాపకి స్కూలు ఉంది.తీసుకురాలేదు.శ్రావణి పెళ్ళికి నేను రాకుండానా?ఇంతకీ ఎక్కడ పెళ్ళికూతురు?"
"మంగళ స్నానం చేయిస్తున్నారమ్మ.."అంటూ నా చెతిలో ఉన్న బిందెని అందుకొని లోపలికి వెళ్ళారు
"ఇంద ఈ టీ తాగుతూ ఉండు" అని చెప్పి,నన్ను ఒక రూంలోకి తీసుకెళ్ళి టీ గ్లాసు చేతిలో పెట్టారు.
వెంటనే అక్కడ ఉన్న టేబులు ఫేను నా వైపుకి తిప్పుతూ "ఏమనుకోకమ్మా..ఇల్లంతా ఇరుకు..నీకు కొంచెం ఇబ్బందే.అసలు నువ్వు మా ఇంటికి రావడమే ఆనందం "అన్నారు ఆంటి .
"అయ్యో అదేంటాంటీ అలా అంటారు.ఈ ఇల్లంటే నాకెంతిష్టమో మీకు తెలుసు కదా "అన్నాను
"బంగారుతల్లివి ఏమీ మారలేదు.ఇక్కడే కూర్చోమ్మా..పదినిమిషాలలో వచ్చేస్తుంది శ్రావణి". అంటూ ఆంటీ బయటకు వెళ్ళిపోయారు
"అమ్మో ఇంకా పదినిమిషాలా ?ఈయన ఎమంటారో "అనుకుంటూ అక్కడ ఉన్న ప్లాస్టిక్ కుర్చిలో కూర్చున్నాను.
శ్రావణి ,నా ప్రాణ స్నేహితురాలు.ఇద్దరం చిన్నప్పటినించి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నాం.మా ఊరిలో ఒక్కటే స్కూలు అప్పట్లో.ఎన్ని కబుర్లో.కలిసి స్కూల్లో భోజనాలు,దాచుకున్న నెమలీకలు ,రాస్కున్న పాటలు, నా చిన్నతనంలో ఆనందం అంటే దానితో ఉన్నప్పుడే.మా ఇంటికి దాన్ని ఒకసారి తీసుకెళ్తే, అలగాజనాన్నంతా ఇంటికి తీసుకొస్తున్నానని దాని ముందె అమ్మ అరిచింది. పాపం అప్పటినించి మళ్ళీ రాలేదు ఇంటికి.పెళ్ళికి మాత్రం వచ్చింది.అప్పుడు దానికి ఎన్ని అవమానాలు జరిగుంటాయో  అది నోరు విప్పి చెప్పకపోయినా నేను ఊహించగలను. నన్ను కూడా స్కూలుకి ఒంటరిగా పంపేవాళ్ళు కాదు.స్కూలు అయిపోగానే డ్రైవెర్ వచ్చేవాడు.డ్రైవర్ వచ్చేవరకూ శ్రావణి వాళ్ళ ఇల్లు స్కూలు పక్కనే అవడంతో అక్కడే ఎదురుచూసేదాన్ని కారు కోసం.అప్పుడే ఆంటీ స్కూలునించి వచ్చిన నాకు ,శ్రావణికి,శ్రావణి తమ్ముడికీ కలిపి చిరు తిళ్ళు పెట్టేవాళ్ళు.వాళ్ళ నాన్నగారు మాతో ఆడుకొనేవారు.ఆ ఇద్దరి పిల్లల్తో నన్ను ఒక బిడ్డగానే చూసుకొనేవారు.ఎందుకో ఆ పసివయసులో శ్రావణి వాళ్ళింట్లోనే  ఉండాలనిపించేది.ఇల్లు అంటే ఎదో బెంగ.ఇంటికి వెళ్ళగానే అమ్మ కనిపించేది కాదు.ఆయా స్నానం చేయించేది.తర్వాత అన్నం పెట్టేది.ఆ తర్వాత అమ్మకి చూపించేది.అమ్మ ఒక ముద్దు పెట్టి,పంపించేది.ఆయా ఇంకో రూంలో నిద్రపుచ్చేది.ఇక నాన్నగారైతే ఎప్పుడో కాని కనిపించేవారు కాదు.ఎప్పుడూ జనంతో ఉండేవారు.తాతయ్య కూడా ఎప్పుడూ మంచంలోనే ఉండేవారు.
అలా,ఒంటరి బాల్యంలో మగ్గిపోతున్న నాకు ,శ్రావణి వాళ్ళింట్లో ఎంతో ఆప్యాయత దొరికేది.
హైస్కూలు అయిపోయిన తర్వాత ఎంత గోల చేసినా కాలేజీలో నన్ను చేర్పించలేదు.తర్వాత రెండు సంవత్సరాలకి పక్కఊరిలోనే  ఒక సంబంధం తీసుకొచ్చి అంగరంగవైభవంగా పెళ్ళి చేసారు.నా అత్తిల్లు కూడా పుట్టింటిలాంటిదె.మగాళ్ళకి వ్యాపారమే ప్రపంచం.భార్య అంటే పిల్లలు కనే యంత్రం.ఆడాళ్ళకి నగలు,చీరలు దిగేసుకొని పనాళ్ళతో ప్రతీపనీ  నిలబెట్టి చేయిస్తూ ,అధికార దర్పాన్ని ప్రదర్శించడమే పరమావధి.పెళ్ళైన సంవత్సరానికి రాజీ పుట్టింది.  నాకిష్టమైన పేరు కూడ పాపకు పెట్టుకోలేకపోయాను.వారెన్నడూ నా మన్సుని అర్ధం చేసుకొనే ప్రయత్నం కూడా చెయ్యలేదు.ఎప్పుడు ఒక మాట మాత్రం చెప్తారు."మనం ఊరి జమిందారులం.జమిందారి స్త్రీ ఎలా ఉండాలో తెలుసుకో.పరువు కాపాడూ" అని.పనివాళ్ళను నవ్వుతూ పలకరించినా పరువుపోతుందంటారు మా అత్తగారు.శ్రావణి పెళ్ళికి ఈమాత్రం రావడానికి..సవాలక్ష పిటీషనులు,పర్మిషన్లు..
శ్రావణి బాగా చదువుకుంది.మంచి ఉద్యోగం సంపాదించింది.అందరినీ ఒప్పించి ఇష్టపడిన వాడిని పెళ్ళి చేసుకుంటుంది.అది ఈ విషయం చెప్పినప్పటినించీ ఎంత ఆనందంగా ఉందో..నా జీవితానికి సంబంధించి అంతే ఆలోచన మొదలయ్యింది.ఇష్టపడి ఒక్క చీరన్న్నా కొనుక్కోలేని నేను,మనసు పడిన వాడిని మనువాడే స్వేచ్చ ఉన్న శ్రావణి.
ఇంత వ్యత్యాసానికి ఒక్కటే కారణం. అదే అవసారానికి మించి,పేరుకుపోయి,అహంకారాలను పెంచుతున్న అధికధనం.
చివరికి,నా పెళ్ళి కూడా,మామగారు ,నాన్నగారు కలిసి చేసుకున్న  వ్యాపార ఒప్పందం  అని తెలిసి కుమిలిపోతున్నాను.
అందుకే డబ్బు సరిపడా ఉంటే లక్ష్మి ..ఆధికధనం నా దృష్టిలోధనపిశాచి.
"ఏంటే కళ్ళళ్ళో నీళ్ళు" ఎదురుగా శ్రావణి.
ఆకుపచ్చ రంగు చీరలో సస్యలక్ష్మిలా మెరిపోతుంది.
దాని మొహంలో ఆనందం తెచ్చిన మెరుపు ముందు అది వేసుకున్న వంటిపేట చంద్రహారం వెల వెలబోతుంది
"ఏమీ లేదే.ఎంత అందంగా ఉన్నావో తెలుసా?"
"కళ్లళ్ళో నీళ్ళు ఎందుకో నాకు తెలుసు.కారులో పాప ఉందని తెలుసు.ఇక్కడ ఇంక ఉండే టైం నీకు లేదని నాకు తెలుసు."
ఫ్రాణ స్నేహితురాలు నా మనసు అలా చదివేస్తుంటే ఏమీ చెప్పలేక మౌనాన్ని ఆశ్రయించాను.
"నువ్వింక మారవా..?ఎన్నాళ్ళు ఇలా?..నీ సంగతి.సరే పాప సంగతి.తను కూడా నీలాగే ఏ ఆనందాలు లేక కుమిలిపోవాలా? ? కూతురిగా,భార్యగా,కోడలిగా నువ్వు రాజీ పడుతున్నావు. పడొచ్చ్చు..కానీ,తల్లిగా రాజీ పడకూడదే.ఒక్కటి మాత్రం గుర్తుంచుకో మనకున్నది ఒక్కటే జీవితం..సర్లే నువ్వు మాట్లడవులే కానీ ..కానీ ..ఇదిగో మా ఇద్దరి ఫోటో నీకోసమే తెచ్చాను.ఇంక బయల్దేరు.."అంది.
దానిని గట్టిగా కౌగలించుకొని బయటకు వచ్చేసాను.
అది అన్న మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి..
"మనకి ఉన్నది ఒక్కటే జీవితం.అవును అమ్మగా నేను రాజీ పడలేను"  వెంటనే పాప విషయంలో నేనేం చేయగలనో భోధ పడింది
కారు దగ్గరికి నడిచాను.

"వచ్చావా? ఎంతసేపు..రా త్వరగా" విసుక్కున్నరాయన..
పాప ఇంకా ఏడుపు ఆపలేదు.
"పాపను ఇలా ఇవ్వండి..మేము ఇక్కడే ఉంటాము.మీరు పని చూసుకొని వచ్చేటప్పుడు రండి." అన్నాను కొంచెం బెరకుగా.
"అదేం కుదరదు..రా ముందు.."
"రాను..నా స్నేహితురాలి పెళ్ళి .నేను ,పాప ఉండీ తీరలి."అని ఖచ్చితంగా  చెప్పి పాపను తీసుకున్నాను.
డ్రైవర్ ముందు ఏమీ అనలేక కోపంగా చూసి ,ఆయన వెళ్ళిపోయారు.

ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో అని ఒక పక్క భయంగా ఉన్నా..సంతోషంతో కేరింతలు కొడుతున్న పాప ఆనందం దేన్నైనా ఎదుర్కోగలననే ధైర్యాన్నిచ్చింది.
అధికారం,డబ్బు,పరువు అనే కబంధహస్తాలలో నా చిట్టితల్లి నలిగిపోకూడదు.
అమ్మ నా విషయంలో చేసిన పొరపాటు పాపవిషయంలో జరగకూడదనే దృఢనిశ్చయం ఇంకా బలపడింది.






ధాత్రి....

1 మార్చి, 2013

నా కళ్యాణహేల..

కాలం నిజంగా మాయాజాలమే సుమా!
అప్పుడే,అప్పుడేనా..
ఆరు ఋతువులూ నవ్వేసాయా?? 
పన్నెండు మాసాలు దొర్లిపోయాయా?
మూడువందల అరవైయయుదురోజులూ అక్షరాలా అయిపోయాయా ?
అవ్వేళ,
అయిదు వసంతాల మన కల నిజమైన వేళ
పెళ్ళిపందిరిలో నాకు నువ్వు,నీకు నేను
కళ్యాణ తిలకాలతో ఒకరికొకరు కొత్తే కదా? 
మన మధ్య తెరచల్లా తొలగగానే... 
బిడియపు బరువున సోలిన మన కళ్ళు,
కనురెప్పల్ని పైకెత్తే మన ఆతురతలు,
నును సిగ్గుల మొగ్గలైన మన బుగ్గలు,
సొట్టల్లో దాక్కున్న్న బుగ్గన చుక్కలు, 
నీది నాకు నాది నీకు మత్రమే వినబడే మన గుండె సవ్వళ్ళు  
నిజమో కలగంటున్నమో అర్ధం కాకుండానే జరిపోతున్న తంతులు 
అంతా అయిపోయాక  అప్పగింతల వేళ 
పుట్టింటి కన్నీళ్ళకు కలగలిపిన నీ కల్లళ్ళో కన్నీటి చారిక మెరుపు,
అవును అది నాకు మెరుపే పుట్టింటి ఆప్యాయతకు తీసిపోనని కదూ అర్ధం. 
ఎవరూ చుడకుండా నువ్వు తుడిచెసుకున్నా,నన్ను తప్పించుకోగలవా??
అప్పుడు ధైర్యం చెప్పిన నీ చేతి ఆత్మీయ స్పర్శ 
ఇవన్నీ కళ్ళముందు ఇంకా మెరుస్తుండగానే..
మన కళ్యాణ రాగాలు చెవుల్లో మారుమ్రోగుతుండగానే ..
'గురువారం మార్చి ఒకటి కాస్త శుక్రవారం మార్చి ఒకటి అయిపోయిందా?
                              'వలపు గెలుపు ' కడు చిత్రంగా కాలాన్ని కరిగించేసింది కదూ !

ఈ సంధర్భంగా కల్యాణఘడియలు మీతో పంచుకోవాలనిపించిందిలా..:)