??????

12 ఫిబ్ర, 2013

బ్రోచేవారెవరురా...

ఒకానొక ఆదివారం సాయంత్రం..
తెల్లారితే సోమవారం..ఆఫీసు..మేనేజరు..ఇష్యూషు..
గుర్తొచ్చి ఎంతసేపటికీ వదలని బెంగ.ఆ బెంగలో ఒక నిర్ణయం..పోనిలే రేపు త్వరగా వచ్చేద్దాం అనుకొని అలాగే దిగాలుగా పడుకొని
పొద్దున్న లేచి ఆఫీసుకి వెళ్ళీ,టీ బ్రేక్కి కూడా వెళ్ళకుండా పనంతా ముగుంచుకొని, అయిదున్నరకల్లా తట్ట బుట్ట సర్దేసి కేబ్ ఎక్కేసి ,ఆరు గంటలకల్లా
'ఎం ఎం టి యెస్'
స్టేషన్ కి వచ్చేసి..అక్కడ 'జే ఎన్ టి యు' వెళ్ళే  ఒక సర్వీసు ఆటో ఎక్కి కూర్చున్నాకా,
అప్పటిదాకా ఆఘమేఘాల మీద సాగిన మన ప్రయాణం కాస్త కుంటు పడుతుంది.

సర్వీసు ఆటో అంటే తెలియని వాళ్ళకి
(అసలు ఆటో అనగా అందులోను సర్వీసు ఆటో అనగా ఏమనగా
అనగనగా ఒక బుజ్జి ఆటో . ముచ్చటగా మూడే చక్రాలతో శోభిల్లే  త్రిచక్ర రధము . స్కూటర్కి ఎక్స్తెన్షన్ లాగాన్నమాట.రధసారధికి(డ్రైవర్) కాక వెనకాల ఇంకా ముగ్గురు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది.


ఇంకా ఈ ఆటోలలో సర్వీసు ఆటోలు కలవు.ఇవి కూడా పసుపు రంగులో మూడే చక్రాలతో మామూలు ఆటోలకన్నా కొంచెం చిన్నవిగా ఉండును.ఇక్కడ ఆటోలో ముగ్గిరికే చోటు ఉన్నా రధసారధి  గారి మనసు చాలా విశాలమవటంచేత  ఎనిమిది మందికి (వెనకాల నలుగురు ఆడవాళ్ళు..ముందు ముగ్గురు మగవాళ్ళు)తక్కువ కాకుండా ఆటో కదలలేదు.మీరు సర్వీసు ఆటో ఎక్కినచో ఒక్కొసారి మీకు మూడు చేతులున్నట్లు ఇంకోసారి మీకు అసలు చేతులే లేనట్లు అనిపించి ఒక వింత అనుభవానికి గురి అయ్యెదరు.ఇక కాళ్ళు, అక్కడే ఎక్కడో ఉండును..ఎవరో ఒకరు తొక్కగానే ఎక్కడ ఉన్నయో ఖచ్చితముగా తెలియును.అంతవరకూ నిర్భీతిగా కూర్చున్నామనిపించుకొని మనదగ్గర ఉన్న పర్సు వగైరాలు మాత్రం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండవలెను   )




అంచేత ఎనమండుగురూ ఆటో ఎక్కేవరకూ ఈగలు ..దోమలు బాగా  తోలుతూ మునిసిపాలిటీ వారికి సహకరించాలన్నమాట.
ఒక పది ఆటోలు వరసగా ఉంటాయి.ఒక ఆటో పూర్తి అయ్యిన తర్వాత ఇంకో ఆటో అన్నమాట.అన్ని ఆటోల్లోనూ అమ్మాయిలుంటారు వెనకాల సీట్లో కూర్చొని ముందు సీట్లొ వచ్చి కూర్చోని ఆటోని కదిల్చి జీవితానికి మోక్షాన్ని ప్రసాదించే "మగధీరుల " కోసం ఎదురు చూస్తూ ..
అలా వెనకనున్న అమ్మయిలలో నేనూ ఒకతెను .ముందు ఇంకా ముగ్గురు అబ్బయిలు రానిదే ఆటో కదలదు.ఒక లోకల్ ట్రైన్ వచ్చేసరికి బిల బిల మంటూ జనం బయటకు వస్తుంటే మమ్ము బ్రోచే నాధులెవరా అని ఎదురు చూడగా చూడగా ఒక ఇద్దరు వచ్చి ఆటో ఎక్కేయగానే హమ్మయ్య ఇంకా ఒక్కరే అని ఊపిరి తీసుకున్నానా?
ఆ ఒక్క మగాడు ఎంత సేపటికీ రాడే ..
దోమలు కూడా అయిపోయాయు ఆటోలో అందరూ కొట్టేసే సరికి.
ఆరున్నర ..ఆరునలభై ఊహూ .. ధీర ధురంధరుడు ఇంకా రాడే
నీరసం..కోపం...
ఇంతలో చీకటిలోనించి ఒక రూపం నేను కూర్చున్న ఆటో దిశగా వస్తుంది..
"అమ్మాయా?అబ్బయా?" నేను
ఆ రూపం దగ్గరవుతుంది..
"హమ్మయ్య అబ్బాయే..ఎక్కుతాడో లేడో..ఈ మగడు కూడా ఏ బైకో ఎక్కి వెళ్ళిపోతాడో? " నేను
వచ్చేస్తున్నాడు..ఇటువైపే ..


ఎక్కేస్తున్నాడు..ఎక్కేశాడు.
మగడు కాస్తా మగఢీరుడై ఆటొని కదిపాడు..
నాకు ఆనందంతో కల్లళ్ళో నీళ్ళు వచ్చాయి..


ఆ పురుషోత్తముని చూసి నా మది పరవశించి


"మగధీర నువ్వె ఆటో ఎక్కరా..
నువ్వు లేక ఆటో కదలలేదురా.."
(మగధీర నన్నే చేకొనరా పాట)

"పురుషోత్తమా ..
ఎదురుచూసితిమయ్యా మేము పురుషోత్తమా..
నువ్వు ఆటో ఎక్కవయ్యా కోనేటిరాయడా"

"ధీర ధీర
ఆటో కదలలేదురా
చేరరార శూర
సీటందుకో దొర
(సారీ అక్కడ సీటు ఉండదు పాపం) "


"కుంభి నికర కుంభస్థ గురు కుంభి వలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి  శమదృతి ఛత్రపతి
(అంటే ఏంటని అడక్కండి నాక్కూడా తెలీదు..)  "


అని
గతుకుల్లో ఎగిసిపడే ఆటో నా పాటలకు తాళం వేయగా, నాకు తోచిన పాటల పుష్పాలు..ఆటో దిగేవరకు మనసులోనే పాడేసుకుంటూ ఆ ధీరుని పదపద్మములకు అర్పించాను..




6 ఫిబ్ర, 2013

కలువలు పూయించండి


కలువ పూవులు,తామర పూవులు సాక్షాత్ లక్ష్మీ స్వరూపాలు,వీటిని దేవతా పుష్పాలు అంటారు కూడా.
వినయక చవితికి చిన్నప్పుడు మన ఊర్లో చెరువుల్లోంచి బోలెడన్ని పువ్వులు తీసుకొచ్చి పూజలు చేసేవారు కదా.
అలంటి కలువపూలు మన ఇంట్లో పూస్తే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదా..
దీనికి పెద్ద పెద్ద ఇళ్ళు,స్థలాలు అక్కర్లేదండోయ్.మనం ఉన్న చోటే ఒక పెద్ద ప్లాస్టిక్ తొట్టి పట్టే చోటు చాలు.కాకపోతే అక్కడ బాగా ఎండ మాత్రం పడేలా ఉండాలి.
ఒక పెద్ద ప్లాస్టిక్ తొట్టె తీసుకొండి.కింద చూపించిన పరిమాణంలో లేదా అంతకన్న పెద్దది మీ స్థలాన్ని బట్టి అన్నమాట.

ఇది నేను పెంచుతున్న కలువ పూల తొట్టి



ఇప్పుడు తొట్టిని సగం కంటే కొంచెం ఎక్కువ భాగన్ని నల్లమట్టితో నింపండి(ఎర్రమట్టి పనికి రాదు).తర్వత కలువ పూల మొక్కలను తొట్టి అంచుల దగ్గర పాతండి.అంటే మొక్క మొదలు తొట్టి అంచు దగ్గర ఉండాలి.ఆకులు లోపలికి తేలియాడేలా ఉండాలి.పైన చూపించిన తొట్టి పరిమాణానికి రెండు మొక్కలు పడతాయి.మొక్కలను పాతిన తర్వాత మట్టి పైన జాగ్రత్తగా గులకరాళ్ళను వెయ్యాలి.
ఇలా కలువ పూల తొట్టి సిద్ధమైపోయిందన్నమాట.
ఆహా అప్పుడే అయిపోలేదు.
ఇంటి  ముందు ఇలా నీరు నిలువ ఉంటే దోమల బెడద కదా..అందుకని ఇలా తొట్టి సిద్ధమైన ఒకటి రెండు రోజులకి నీళ్ళు బాగా తేరుకుంటాయి.అప్పుడు 'గప్పీస్'  అనే చిన్న చిన్న (అక్వేరియం షాపులలో దొరుకుతాయి) చేపలను తొట్టిలో వెయ్యండి.ఈ చేపలకు మేత ఎమీ అవసరం లేదు కానీ అప్పుడప్పుడు బిస్కట్ పొడిని వెయ్యండి. ఒక మూడు జతలు తెచ్చి వేస్తే చాలు బోలెడన్ని పిల్లల్ని పెట్టెస్తాయి.రంగుల రంగుల తోకలతో భలే ఉంటాయి.ఇవి ఒకటి నించి రెండు సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతాయి.కలువ పూల తొట్టెలోనికి ఇవే అనువైనవి.



జాగ్రత్తలు
1.తొట్టెకి నిరంతరం ఎండ బాగా తగిలేలా చూసుకోవాలి.కానీసం రోజులో ఆరు గంటలు ఎండ తగిలితే పూలు బాగా పూస్తాయి.
2.పాడైపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి.
3.నీటీలో పెరిగే నాచు వంటి మొక్కలను కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి.
4.చలికాలం వీటిని జాగ్రత్తగ్గా కాపాడుకోవాలి ఈ కాలంలో పువ్వులు పూయవు.ఆకులు కూడా చిన్నగా అయిపోతాయి






కలువ పువ్వుల మొక్కలు ఇప్పుడు రకరకాల రంగుల్లో నర్సరీలలో దొరుకుతున్నాయి.ఇప్పుడు చలికాలం వెల్ళిపోతుంది కదా..
ఇంకెందుకాలశ్యం? కలువ పూల తొట్టిని పెట్టేసి ..లోగిలిలో పూచిన కలువలను చూస్తూ పుస్తకాలే చదువుకుంటారో.."కెరటాల వెలుగు చెంగలువా" అని పాడుకుంటూ...కాఫిలే తాగుతారో..కెమేరా పట్టుకొని వాటి చుట్టూ తిరుగుతారో..వాటి అందానికి వాటినే చుస్తూ ఇవన్నీ మర్చిపోతారో మీ ఇష్టం ..:))

4 ఫిబ్ర, 2013

నా గృహ హరిత సీమ


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన హార్టి ఎక్స్పో అయిపోయిది.
ఎప్పుడో అయిపోయింది ఈ పిల్ల ఇప్పుడే నిద్రలెచినట్టుంది అని తిట్టుకోకండి మరీ
బుసీ అన్ననుగా..;)
ఎమిటో ఎక్స్పో ఎప్పుడు జరుగుంతుందా అని అంతర్జాలంలో ఎంత వెదికినా సమాచారం దొరకలేదు.ఇక ఈ ప్రదర్శన ఫోటోలు ప్రతి ఏడూ పెట్టి ఆనందింపజేసే తృష్ణ గారి ద్వారా ఆ వివరాలు కనుక్కున్నాను.
జనవరి 26 నించి మొదలయ్యింది.మేము 27 న వెళ్ళాము. ఆదివారం కావడంతో బాగా రద్దిగా ఉంది.అయినా అన్ని మొక్కలు చూశాను కానీ ఊహించినంత ఆకట్టుకోలేదు నన్ను.మాములుగా నర్సరీలలో దొరికే మొక్కలే కానీ ధరలు మాత్రం చుక్కలనంటుతున్నాయి.ప్రత్యేకమైన మొక్కలు అంటే బొన్సాయ్  మొక్కలు,ఆర్కిడ్లు చెప్పుకోవచ్చు.
అందుకే ఈ ప్రదర్శనలలో తప్ప మమూలుగా నర్సరీలలో దొరకని ,నాకెంతో ఇష్టమైన ఆర్కిడ్ మొక్క తీసుకున్నాను.
వంగపండు తెలుపు రంగుల మేళవింపులో భలే ఉంది కదా.దీనిని పెంచడం కూడా చాలా సులభం.ముఖ్యంగా ఇది ఇండోర్ మొక్క కాస్తంత నీరెండ ఒక అరగంట అయినా చాలు హాయిగా బ్రతికేస్తూ పువ్వులు పూస్తుంది.



ఒక చోట మాత్రం మరువం మొక్కలు చాలా ఎక్కువగా ,ఆరోగ్యంగా ఉన్నాయి.ఇక కొనకుండా ఉండగలమా??

అలా రెండు మొక్కలు మాత్రమే కొని వచ్చేసాం.కానీ మొక్కలు కొంటూ ఆనందపడుతున్న అంతమందిని చూస్తే మాత్రం భలే అనిపించింది.
నాకైతే ఇంకా చాలా మొక్కలు కొనలనే కానీ "అమ్మా మీ హరితవిప్లవాన్ని వనసీమలకు పోయి కొనసాగించండి.. అర్భక జీవిని నేనెంతా?నా ఇల్లెంతా? మీ మొక్కలకు నీళ్ళు నేను ఇచ్చుకోలేను తల్లీ "
అని ఇప్పటికే వగచి విలపించే  మా ఇంటి ఓనరుగారుగారి దీన వదనం ఒకసారి గుర్తొచ్చేసరికి ఆగిపోయాను.:P
అయినా ఎదో నా పరిధిలో విప్లవానీ కొనసాగిస్తున్నానే  అనుకోండి.;)
ఎలగో ఇంత దూరం వచ్చారు కదా .మా ఇంటి మొక్కలను పలరించేసి వెల్లండి మరీ







పైన్నించి అల్లిబిల్లిగా అల్లుకుపోతున్న ఈ లతను చూశారా?ఇది చిలకడ దుంప మొక్క తెలుసా? ఎంతో అందంగా ఉండే ఈ ఇండోర్ మొక్కను మీరు పెంచాలనుకుంటున్నారా అయితే తృష్ణ గారి బ్లాగుకి  వెళ్ళాల్సిందే ..:)




కిందనించి పైకి అల్లుకొస్తున్న ఈ మనీ ప్లాంట్ చూసారా?? దీనికి చాలా అంటే చాలా పెద్ద కధ ఉందన్నమాట.అది ఇంకో టపాలో చెప్తానేం 


ఫెంగ్షుయ్ మీద నమ్మకంతో కాదు కానీ ఈ మొక్క అంటే నాకు భలే ఇష్టం.రెండు రోజులకొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే చాలు హాయిగా పెరిగేస్తుంది ..ఏ మంచం పక్కనో పెట్టుకుంటే నిద్రలేవగానే పచ్చగా కళకళలాడుతూ మిమ్మల్ని పలుకరిస్తుంది.ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా భలేగా ఉంటుంది.


ఇవి బాల్కనీలోని మొక్కలు..మందారం,బ్రహ్మ కమలం(ఇంకా పువ్వులు పూయలేదు),నందివర్ధనం వగైరాలు.
ఆ చిన్న చిన్న మొక్కల్లేని కుండీలున్నయే వాటిల్లో మొన్న ప్రదర్శనలో రజనీగంధ మొక్క దుంపలు అమ్ముతుంటే తెచ్చి వేశాను మరి ఎప్పుడు మొలకలు వస్తాయో చూడాలి.



ఈ కలువపూల తొట్టి ఉందే దీనికోసం మా ఆయన ప్రాణాలు తొడేసాను..:)
చలికాలం కదా ఇప్పుడు పువ్వులు రావట్లేదు.ఇదిగో మొన్న నవంబరులో పూచిన పువ్వు


ఇవండీ నా హరిత నేస్తాలు.మీరు గమనించారో లేదో ఎక్కువగా ఇండోర్ మొక్కలు ఉన్నాయి.అవును మరీ అవి అయితే మా ఓనరుగారికి కనిపించవు కదా.:) 
ఇంతకీ నేను వెతుకుతున్న కాసియా జవానికా మొక్క దొరకలేదు ప్రదర్శనలో ..:((
ఇంక ప్రదర్శన కి సంభందించిన ఫోటోలు తృష్ణ గారి బ్లాగులో  చూసేసీ ఆనందించేయండి .





23 జన, 2013

ప్రేమలో పడ్డాను



అవును నిజమండి.
అలాగిలా కాదు పీకల్లోతు ప్రేమలో

పెళ్ళైన భారతనారీపతివ్రతాసాధ్వీశిరోమణివనుకుంటుంటే  ఈ ప్రేమేమిటో?నువ్వేదో మంచి పిల్లవనుకున్నామని దండకము మొదలు పెట్టేముందు ఒక్కసారి టపా పూర్తిగా  చదవ మనవి.
నేను ప్రేమలో పడింది ఇదిగో దీనితో..




తెలుపు,గులాబీ,వంగపండు రంగులు రకరకాలుగా మేళవించి గుత్తు గుత్తులుగా పూసే ఈ పువ్వులు నా మనసు దోచేసుకున్నాయి.కాసియా జవానికా అంట ఈ మొక్క పేరు.ఈ మొక్క ఎలగయినా పట్టేయాలని గూగులమ్మను అడిగితే,అమేరికా వంటి దేశాలలో ఆన్లైన్లోనే   దొరికేస్తున్నాయి కానీ ఇక్కడ దొరకడం లేదు..వరసగా ఇక్కడ ఉన్న నర్సరీలన్నింటికీ ఫోను చేస్తుంటే ఎన్ని మొక్కలు కావలి అంటారు..ఒక్కటంటే ఒక్కటేనండి అన్నామనుకోండి.."కడియం నించి తెప్పించాలండి..ఒక్కటైతే తెప్పించలేము" అని చెప్పేస్తున్నారు..:(
నేను ఊరుకుంటానా??వారాంతంలో దీని వెతుకులాటే నా పని.ఇంకా మా సారుకి చెప్పలేదు.చెప్తే,
"దేవీ
నీకేల ఈ పనికిమాలిన తపన
దేనికోసం ఈ సోధన.
నాకు తీరని వేదన.??"
అని లబోదిబోమంటారు.:D
చూశారా నన్ను అనవసరంగా అపార్ధం చేసుకున్నారు.
ఈ పాపం ఊరికే పోదు..మొక్క దొరకాలని నన్ను (నాకు తెలిసేలా..;)) ఆశీర్వదించి పాపానికి పరిహారం చేసుకుంటేనే,ఒక పూట నూనె వేపుడు(నరకంలో) తగ్గుతుంది:)

16 జన, 2013

విశేషాలేంటంటే...!

పండక్కి ఊరెళ్లొచ్చేశానోచ్..
మరి విశేషాలన్నీ మీకు చెప్పాలి కదా..
లేదు లేదు చెప్పను..చూపిస్తాను..
మౌస్ చక్రంపైన వేలు పెట్టి నాతో పాటూ కిందకి జారిపోండి మరి..:)

ఇంటికి వెళ్ళే దారిలో:
ఊరిలోకి ప్రవేశించాక ఇంకొక అయిదు నిమిషాలలో ఇల్లు వచ్చేస్తుందనగా..
ఆత్మీయంగా పలకరించే గోదారి గాలి ఎంత హాయో..:))



ఊడుపులు తీస్తున్నారు కనిపిస్తుందా??



ఆ పడవ ఎప్పుడూ అక్కడ అలానే ఉంటుంది.ఈ చోటంటే నాకు భలే ఇష్టం

మంచు కురిసేవేళలో:
ఉదయాన్నే నేను,నాన్నగారు,చెల్లి,శ్రీవారు వాకింగ్కి వెళ్ళాం..ఆ ఉషోదయపు అందాలు





 కుప్పనూర్చిన వడ్లు తినవచ్చిన చిగురాకులలో చిలకమ్మ కనిపిస్తుందా??

ఇవి గ్రామఫోన్ పువ్వులు.తూటు పువ్వులు అని కూడా అంటారు

పెరటి అందాలు:
పెరట్లో అమ్మ నాన్నా పెంచుకొనే మొక్కలు..ఎన్నెన్ని మొక్కలో..ఎన్నెన్ని పువ్వులో..వాటిలో కొన్ని

తులసీ వనం










ఈ మామిడి చెట్టు పళ్ళు ఎంత బాగుంటాయో

సంక్రాంతి ముగ్గులు:

చెల్లి చేసిన గొబ్బెమ్మలు..సున్నుండల్లాగా ఉన్నాయని తెగ ఆట పట్టించాం:)

గొబ్బెమ్మలు పెడుతున్న నేను చెల్లి.

ఇది సంక్రాంతి గొబ్బెమ్మ

నేను వేసిన సంక్రాంతి రంగవల్లి
ఇవండీ సంక్రాంతి కబుర్లు..హమ్మయ్య మీతో పంచేసుకున్నాను.ఇప్పుడు మనసుకు హాయిగా ఉందనుకోండి..:))


7 జన, 2013

సంకురాత్రి పండగొచ్చె గొబ్బియళ్ళొ ....


హేమంత ఉదయం..
తెలతెలవారుతుంది..
దూరంగా గుడిలోనించి లీలగా వినిపిస్తున్న తిరుప్పావై..
గిన్నెలోకి పడుతున్న పాలధార శబ్ధం.
అమ్మ గాజుల చప్పుడు..
పట్టీల సవ్వడి..
గిన్నెల మోత..
"లేవండే..బారెడు పొద్దెక్కింది" అయిదో సారి అమ్మ పిలుపు.
యబ్బే అప్పుడే నిద్రలేవకూడదు.
"అమ్మా కాసేపమ్మ ప్లీజమా" అని చెప్పేసి,ఇటునించి అటు తిరిగి దుప్పటి ముసుగెట్టాలి.
"ముగ్గు వెసేస్తున్నాను..ఆనక గొబ్బెమ్మలు కూడా నేనే పెట్టేస్తాను.నీ ఇష్టం.." అని అమ్మ అంటుందా?
" అమ్మో గొబ్బెమ్మలా..వచ్చేస్తున్నా.." అనేసి చక చకా మంచం దిగిపోవాలి.
కింద కాలు మోపగానే అరికళ్ళలో చలివాత పడుతుంది అందుకని ఒక్కసారే కాలు కింద పెట్టకూడదు..మెల్లగా ఒక పద్దతి ప్రకారం పెట్టాలన్నమాట.అంత చలి మరి.అందుకని ఆ దుప్పటితోనే ఆవులించుకుంటూ బయటకు వచ్చేయాలి...వాకిట్లోకి వెళ్ళగానే కొబ్బరాకులను ముద్దాడిన మంచు కరిగి మన నెత్తి మీద పడకుండా దుప్పటి ముసుగేసుకోవాలి..దుప్పటి కింద పడకూడదు అమ్మ తంతుంది.
అలా జాగ్రత్తగా దుప్పటి పట్టుకొని వాకిటి ముందు గొంతుక్కూర్చొని మెల్లమెల్లగా కళ్ళు తెరవాలి.
అప్పుడెమో..ఎదురుగా   పచ్చని పేడ కళ్ళాపీ చీర కట్టుకొని నవ్వుతున్న వాకిలమ్మ మనల్ని పలకరిస్తుంది.
వాకిలమ్మను ముగ్గు పిండితో సింగారిస్తున్న అమ్మ నిండు గాజుల చేతులు భలే టింగ్ టింగ్మంటాయి.మనకు కూడా పెద్దయిపోయి ఎప్పుడెప్పుడు ఆ గాజులు వేసేసుకుందామా అనిపించేస్తుంది అది వేరేవిషయంలెండి.


 బొటన వేలు చూపుడు వేలు మధ్యనించీ ఎంతో వడుపుగా ఒక్కో చుక్క సమానమైన దూరంలో పెడుతున్న అమ్మని చుస్తుంటే,
"దేవుడు ఆకాశం లో అన్ని చుక్కలు ..అంతందంగా ఎలా పెట్టుంటాడో ?"అని ఇదే కొబ్బరిచెట్టు కింద వేసంకాలం రాత్రుళ్ళు  కరెంట్ పోయినప్పుడు మడతమంచమ్మీద పడుకొని ఆకశంలోకి చుస్తుంటే వచ్చిన సందేహానికి సమాధానం లభిస్తుంది.
బహుశా ,ఒకానొక యుగపు ఉదయాన మనుషులెవరూ ఇంక నిద్ర లేవకముందే  మొహినీ రూపం దాల్చినట్టు అమ్మ రూపంలో ఇలాగే ఆకాశ వాకిలిలో పెట్టేసుంటాడు కదా.
చుక్కలు పెడుతూ,వాటిని కలుపుతూ ,ఆగి,వంగీ,కూర్చొనీ,నిల్చొనీ ఎంతో దీక్షతో అమ్మ ముగ్గు పెడుతుంది కదా..
బహుశా రోజంతా హడావుడిగా,ఒక్క క్షణం కూర్చొని కాఫీ తాగడానికి కూడా సమయం లేని అమ్మకు
ఎవరినీ ఎమీ అడగకుండా..సర్వస్వతంత్రతతో..తన అభిరుచికి తగ్గట్టు చెసే పని ముగ్గేనేమో అని అనిపించక మానదు.
అందుకే దానిలోనే లీనమైపోయి,మధ్య మధ్య మురిసిపోతూ ముగ్గు పెడుతున్న అమ్మను అలానే చూస్తూ ఉంటే భలే ఉంటుంది.


"ముగ్గు చాలా బాగుందొదినా." అని పక్కింటావిడో..వెనకింటావిడో అందనుకోండి  ఏనుగెక్కినంత సంబరపడిపోతున్న అమ్మను  మనం దొంగచాటుగా చూసేయ్యాలన్నమాట.
అలా ముగ్గు వేయడం అయిపోయాకా,ముందుగా సిద్ధం చేసిన గొబ్బెమ్మలు తీసుకొస్తుంది అమ్మ.
అప్పటికి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది కదా మనకి.దుప్పటి పక్కన పడేసి రంగంలోకి దిగాలి.

ముగ్గు పెట్టడం కన్నా గొబ్బెమ్మలు పెట్టడం ఎంత సరదాగా ఉంటుందో కదా
అన్నింటికన్నా పెద్ద గొబ్బెమ్మను ముగ్గు మధ్యలో పెట్టాలి.దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మల్లను పెట్టాలి..తల్లి చుట్టూ పిల్లలు చేరినట్లన్నమాట..ఆ తర్వాత అక్కడక్కడా ముగ్గుకు తగ్గట్టు పెట్టాలి...చివరిగా
రాత్రంతా అలిగి ఆకాశం ఎక్కి కుర్చున్న నెలవంకను..అమ్మ బుజ్జగించి ముగ్గుపిండి వేసి ..చిట్టి చామంతి రేకులు నింపి నేలమ్మ ఒళ్ళో బజ్జోబెడుతుందా.ఆ అలక తీరిన చందమామపైన కూడా ఒక చిట్టి గొబ్బెమ్మ పెట్టాలన్నమాట. లేకపోతే మళ్లీ ఆకాశంలోకి పారిపోతాడు మరి.పెట్టడం అయిపోయిందా..
ఇపుడేమో చక్కగా అన్ని గొబ్బెమ్మలమేద పసుపుకుంకుమలు జల్లి,గుమ్మడి పూలూ బంతి పూలు వాటి తలల మీద గుచ్చాలి.
గొబ్బెమ్మలు పెట్టడం అయిపోయిందన్నమాట..ఆగండాగండి అప్పుడే వెళ్ళిపోకూడదు.
నేలమ్మ పచ్చగా మెరిసిపోతుంటే..వెన్నెల పొడి జల్లినట్టుండే ముగ్గుమీద పచ్చని గొబ్బెమ్మలు. ..అసలు గొబ్బెమ్మలంటే గోపికలంట..అందుకే కృష్ణయ్య కోసం అలంకరించుకున్న గోపెమ్మల్లా ఎంత బాగుంటాయో ..
పసుపురంగు బంతిపూలు..గుమ్మడి పూలు తో కళకళలాడిపోతూ మనల్ని చూసి నవ్వుతాయేమో


"ఇంకా ఎంత సేపే??" అని అమ్మ అరిచేదాకా
ఆ నవ్వులు చూస్తూ చుట్టూ ఉన్నవాళ్ళు మనకి పిచ్చనుకున్నా సరే ,మనలో మనం ముసిముసిగా నవ్వేసుకొని,మనల్ని మనం తెగ మెచ్చేసుకొని..
 లోపలికి రావాలి.
కానీ గొబ్బెమ్మలు పెట్టాలంటే పెద్ద పెద్ద వాకిళ్ళు కాకపోయిన అసలు వాకిలైనా ఉండాలి కదా..అసలైనది పేడ దొరకాలి.(ఎమో అవి కూడా మైనం పళ్ళలాగా కొంతకాలానికి మైనం గొబ్బెమ్మలు వస్తాయేమొ. కదా?)  హ్మ్మ్ ఇవన్నీ ఒకప్పటి పల్లెటూరి బాల్యపు  ముచ్చట్లు ఇప్పుడెక్కడా ఈ అపార్ట్మెంట్ల పక్షులకి ముగ్గులు గొబ్బెమ్మలు ఎక్కడివని దిగులుపడిపోయి కుర్చోకూడదు..చక్కగా నాలాగే ఆఫీసులో శెలవు పెట్టేసి పండక్కి నాలుగురోజుల ముందే ఇంట్లో వాలిపోవాలి..

అప్పుడెంచక్కా,
గొబ్బిళ్ళేం భాగ్యం?
గొబ్బి పాటలు,
హరిదాసు పాటలు వినొచ్చు.

అందరు పంచుకొనే రకరకాల పిండి వంటలు తినొచ్చు.



భోగి పిడకలెయ్యొచ్చు..
ఆ పిడకలు మంటలో వెయ్యొచ్చు..


ఆఖరి రోజున రధం ముగ్గేసి మన రధం తాడుని తూరుపు దిక్కు రోడ్డు మీదకు తీసుకెళ్ళి పక్కింటి ఆంటీ రధంతో కలిపెయ్యొచ్చు

అబ్బో బోలెడన్ని చెయ్యొచ్చు.
వీలుపడనివారు 
"నాలుగు రోజులే?" అని ఉడుక్కోకూడదు మరి.
అసలే మా శ్రీవారు కొత్తల్లుడు ఈ పండక్కి..;).
వీలైనవారు
ఇలా అనగానే అల్లా ఎగిరిపోవడం కాదు.
 మీది కూడా మా ఊరిలాగానే అంతర్జాలంలో ఇంకా చిక్కని ఊరైతే
బ్లాగ్మిత్రులందరికీ పండగ శుభాకాంక్షలు కూడా చెప్పేసి మరీ వెళ్ళాలి ...
వచ్చేటప్పుడు బోలెడన్ని విశేషాలు మోసుకొస్తానని కూడా చెప్పాలి.

అన్నట్టు చెప్పడం మరిచాను..నాలుగు రోజులకి కదా వెళ్లేది..
ఎంచక్కా మీకు నచ్చిన పుస్తక్కలు ఒకటో రెండో పెట్టుకోండి. ఎక్కువొద్దు బరువు..
ఏ మధ్యాహ్నమో అమ్మ చేతి కమ్మని వంట తిన్నాక, మామిడి చెట్టుకిందో  ,కొబ్బరి చెట్టుకిందో పుస్తకం చదవాలనిపిస్తే ఎలా మరి??

అంచేతా..
ప్రియమైన బ్లాగ్మిత్రులారా ..!
మీ అందరికీ ముందస్తు
సంక్రాంతి శుభాకాంక్షలు..


"పాడి పంటలు పొంగే వేళ ,
సిరులు కురిసే వేళ,
మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆశిస్తూ  ..

ధాత్రి "