??????

21 జన, 2019

స్వరరాగ గంగా ప్రవాహమే ...

ఆ ప్రవాహం యొక్క అమృత ధారలు చెవులలోనించి గుండెని తాకి..
నా హృదయాన్ని కరిగించి..కన్నీటి ధారలై ఉబికి వస్తే..
ఆ కన్నీటితో ఆ మహా మనీషి పాదాభిషేకం చేయాలని ఎంతగా తపించానో..
అలా చేసే అవకాశం ..అదృష్టం ఉండొద్దూ ..
అందుకే మీతో పంచుకొని కొంచెమైన సంతృప్తి చెందుదామని  ఇలా వచ్చానన్నమాట .
ఈ టపా శీర్షిక బట్టీ..మీరు కూడా నాలాగే సంగీత ప్రియులు అయితే ఈ పాటికే తెలిసిపోయుండాలి కదా మీకు.



అవును ఆ గాన గంధర్వుడు జేసుదాసు గారి గురించే నేను చెప్పేది.
చిన్నప్పుడు..నాన్నగారు ప్రతి శనివారం నర్సాపురం వెళ్ళి..కొత్తగా విడుదలైన సినిమా పాటల క్యాసెట్టులు..కొన్ని ఆయనకి ఇష్టమైన పాత పాటల క్యాసెట్టులు తీసుకొచ్చేవారు.నేను చెల్లి ఇక వారమంతా అవి వింటూ ,పాడుతూ..పాడుతూ.,వింటూ ..మా ప్రతిభతో అందర్నీ హింసించేవాళ్ళమనుకోండి(ఈ కబుర్లు వేరె టపాలో చెబుతానేం) .
అంత చిన్న వయసులో ఒక గొంతు మాత్రం నన్ను విపరీతంగా ఆకట్టుకొనేది .. నేను అప్పుడు విన్న పాటలు
"దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.."
"ఆకాశ దేశాన ..ఆషాడ మాసానా.."
"ముసి ముసి నవ్వులోనా.."
ఇవి వింటున్నప్పుడు ఆ గొంతులోని ఆద్రత నా చిన్ని మనసుని ఎంతగానో కదిలించేది.ఎదిగే కొద్దీ..కేబుల్ టీవీ సదుపాయం వచ్చాక అర్ఢమయ్యింది ఆయన జేసుదాసుగారని..
అలాంటి జేసుదాసుగారి గానకచ్చేరి హైదరబాదులో డిశంబరులో జరుగుతున్నదనగానే ఎంతగా ఉవ్విళ్ళూరానో వేరే చెప్పాలా..
కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడి ..నిన్న శిల్పకళా వేదికలో జరిగింది ఈ గాన కచ్చేరి.
పాపతో అన్నిగంటలు ఉండగలుగుతామో లేదో అని ఒక పక్క అనుమానంగా ఉన్నా.."నీకెందుకు ..నేను చూసుకుంటాను కదా..సదా మీ సేవలో.." అంటూ శ్రీవారు అభయహస్తం ఇవ్వటంచేత చక్కగా తయ్యారు అయిపోయి ఆరుగంటల కల్లా శిల్పకళా వేదిక చేరుకున్నాం..
కారు పార్కింగ్ చేసి లోపలికి వచ్చేసరికి మరో అరగంట.మొత్తం హాలు నిండా జనం.మా సీట్లు వెతుక్కొని కూర్చొనేసరికి హమ్మయ్య అనిపించింది.ఒక పదినిమిషాలు ప్రకటనలు.తర్వాత వ్యాఖ్యాత గాయత్రి భార్గవి కార్యక్రమాన్ని ప్రారంభించి ,జేసుదాసుగారిని వేదిక మీదికి ఆహ్వనించారు. 
తెల్లటి లాల్చీ పైజమాతో,తెల్లటి పొడవాటి గడ్డం జుట్టుతో వేదిక మీద ప్రత్యక్షమైన  జేసుదాసుగారు
చుట్టూ ఒక అద్వితీయమైన తేజోవలయంతో ఒక దేవ ధూత లాగ,ఒక సంగీత మాహా ఋషి లాగ కనిపించారానడం ఏమాత్రం  అతిశయోక్తి  కాదండి.
అందరికీ సవినయంగా నమస్కరించి
"మహాగణపతిం.." తో కచ్చేరి ప్రారంభించారు.. ఒక ఇరవై సెకన్లకు మైకు పనిచేయలేదు.కానీ ఆయన పాడుతూనే ఉన్నారు.ఎంత స్పష్టంగా వినిపించిందో ఆయన గొంతు.
"ఈ టెక్నాలజి  లేకుండానే మా సాధన జరిగింది.అందుకే మేము దీనిని నమ్ముతాము కానీ దీని మీద ఆధార పడము. " అనగానే హాలులో చప్పట్లు .తర్వాత ,వరసగా
"ఆకశ దేశానా.."
"గాలివానలో ..."
"దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.."
ఇలా పాడుతూ ఉంటే కాసేపు సర్వం మరిచి గంధర్వ ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి..
సంగీతంతో తల పండిపొయిన ఒక ఎనభై ఏళ్ళ ఆ మహా మనిషి గొంతు మాత్రం నిత్య యవ్వనాన్ని సొంతం చేసుకున్నదేమో.?ఆయన అంతసేపు నిలబడి ఎలా పాడతారు ..ఒక కుర్చీ ఉన్నా బాగుండేది అని అనుకోకుండా ఉండలేకపోయాను.ఆ వయసులో అలా నిలబడి పాడటం సామన్యమైన విషయం కాదు కదా మరి.ఇంతలోపు ఆయన తనయుడు విజయ్ జేసుదాసుగారు ప్రేమం  సినిమాలోని 'ఎవరే .." పాటతో ,తర్వాత కల్పన రాఘవేంద్ర గారితో ఒక డ్యుయెట్టు పాట,మళ్ళీ కల్పనా గారు "ఆకశం ఏనాటిదో.."పాటతో అలరించారు.
ఇంతలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి వేదికనలంకరించబోతున్నారంటూ విజయ్ జేసుదాసుగారు ప్రకటించారు.
ఎవారా అని చుస్తూ ఉండగానే ఇంకెవరు మన బాలు గారు.


" అన్నగారి కచ్చేరి జరుగుతుంటే రాకుండా ఎలా ఉండగలుగుతాను..ఆయన నాకు అన్నగారు..గురువు..కొన్ని సార్లు నా తండ్రి కూడా.." అని బాలు చెమర్చిన కళ్ళతో ఆయనకి వేదిక మీద సాష్టాంగ నమస్కారం చేస్తే ..మన కళ్ళు చెమర్చకుండా ఎలా ఉంటాయి..
బాలు గారు వచ్చి అప్పటి దాక నా మనసులో ఉన్న రెండు కోర్కెలు ఆయన ద్వారా  ఫలింపజేసారు
ఒకటి  జేసుదాసుగారికి పాధాభివందనం చేయటం..రెండు ఆయనని సంగీత ఋషి అని కొనియాడటం. .
ఇక ఇద్దరూ కలిసి దళపతి సినిమాలోని "సింగారాల పైరుల్లోనా బంగారాలే పండేనట" పాట తమిళంలో  పాడుటుంతే..సభికుల హర్షద్వానాలు మిన్నంటాయి..
"బాలూ గారి రాక ..ఆయనతో ఈ పాట పాడటం..ఇవన్నీ భగవంతుడి కృప..మనం అనుకోనివి..దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు.." అని జేసుదాసుగారు సంతోషాన్ని వ్యక్తం చేసారు..
తర్వత బాలు గారు సెలవు తీసుకున్నారు. 
ఇంక వరసగా హింది,తెలుగు,తమిళం,మలయాళం ,కన్నడ పాటలతో తండ్రీ తనయులు,కల్పనా గారు సభికులను ఉర్రూతలూగించారు..
అన్నీ వేటికవే సాటి,ఒక్కక్క పాట గురించి ఒక్కొక్క టపా రాయొచ్చు.
విజయ్ జేసుదాసుగారు అచ్చంగా తన తండ్రి గొంతుని పుణికి పుచ్చుకొని పాడుతుంటే ,మనిషి కనపడకుండా పాడితే ఎవరిది ఎవరి గొంతో గుర్తు పట్టడం అంత సులభమైన విషయం కాదండోయ్.కల్పనా గారి ప్రతిభ కూడా ఈ కచ్చేరికి ఎంతగానో వన్నె తెచ్చింది..
నాలుగున్నర గంటల పదర్శన ..
మధ్య మధ్యలో
పాపాను  పాపం శ్రీవారు బయటకు  లోపలికీ తిప్పుతున్నారు. అన్యమన్స్కాగానైనా పోనీ వెళ్ళిపోదాం అని అడుగుతుంటే,నాకేమీ ఇబ్బంది లేదు.మొత్తం అయ్యకనే వెళ్దాం.మళ్ళీ ఈ అవకాశం రమ్మన్నా రాదు కాదా.." అన్నారు.
నిజమే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో..మళ్ళీ ఆయనను నా కళ్ళ ముందు పాడటం చూస్తానో లేదో,అని పంచేంద్రియాలని ఏకం చేసి లీనమైపోయాను.

ప్రదర్శనలో విజయ్ జేసుదాసుగారి ఛతురోత్కులు ,కల్పన గారి కబుర్లు..ఇంక జేసుదాసుగారి మాటలన్నీ ఆణీముత్యాలే..వాటిలోకొన్ని

 "దయచేసి వీడియోలు తీయకండి..మీరు ఆనందించండి.. మీ మెదడులో ..ఆత్మలో..నిక్షిప్తం చెసుకోండీ.. "

"ఒక వయసులో పాడటం ఆపేద్దమనుకున్నాను..నా గొంతు సహకరించడం లేదని..ఎప్పుడైతే నా బ్లడ్ గ్రుపునకు తగ్గట్ట్లు నా ఆహరపలవాట్లు మార్చుకున్నానో మళ్ళీ ఇలా పాడగలుగుతున్నాను..కాబట్టి మీ శరిరానికి తగ్గట్ట్లు తినండి.."

"సెల్ఫీ ఈజ్ సెల్ఫిష్నెస్ ..ఫోనులు అతిగా వాడకండి..జీవించండి."

"నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను..కర్ణాటక సంగీతం నేర్చుకొనే క్రమంలో ఎన్నో హిందూ కీర్తనలు పాడాను.ఈ సప్త స్వరాలు సప్త ఋషులు .సంగీతానికి భాషలేదు..మతం లేదు..అది ఒక్కటే..అలాగే అనేకమైన రూపాలలో ఉన్నా దేవుడు ఒక్కడే..అనవసరమైన మత విద్వేషాలను వీడనాడండి..శాంతంగా ..ఆనందంగా జీవించండి.."

అన్న సందేసాన్నిస్తూ
"హరివరాసరం..."పాటతో కచ్చేరిని ముగించారు..
ఆ పాటకు పాపకూడా ఆదమరచి నిద్రపోయింది..




మేమేమో..ఇంటికి వచ్చాక కూడా ..అదే పాట వింటూ ..
ఈ మహానుభావుడికి భగవంతుడు సంపుర్ణ ఆరోగ్యాన్నీ,ఆయుష్షుని ప్రసాదించాలని..అందర్నీ తన గానామృతంతో అలరిస్తూ ఉండాలని ప్రార్దిస్తూ..
నిదురమ్మ ఒడిలోనికి జారిపోయాం.

నన్ను ఈ అనిర్వచనీయమైన అనుభుతిని సొంతం చేసుకొనేందుకు .. 
శతధా..సహస్రదా..సర్వదా.."(ఎదో ఎమోషన్లో వాడాను.అర్దం అడగకండి నాక్కూడా తెలీదు..అసలు పదాలు కరెక్టేనా😜..)సహకరించిన శ్రీవారికీ  జై ..అదే ధన్యవాదములు తెలుపుతున్నాను  .అలాగే టిక్కెట్లు ఇప్పించిన స్నేహితురాలు సింధూగారికి కూడా ధన్యవాదములు టపా ముఖంగా ..😊😊

6 కామెంట్‌లు:

  1. శర్వదా కాదండీ సర్వదా ...
    ఫోటోస్ ఇష్టమే కానీ సెల్ఫీలంటే నాక్కూడా చిరాకే !
    క్రైస్తవులలో ఆణిముత్యం జేసుదాసు గారు.

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి పోస్ట్ రాశారు. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి' అనేది నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి.

    రిప్లయితొలగించండి
  3. Good you enjoyed the concert.last year i attended his concert in San jose and surprised by his voice quality at that age.His classical concert also takem me to different world.He is my alltime fav singer.

    రిప్లయితొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))