??????

6 జన, 2014

శ్రీశైలం...1

శ్రీశైలం...
అనగానే ఎప్పుడో చిన్నప్పుడు అమ్మానాన్నలతో వెళ్ళినప్పుడు చేతిలోని   కొబ్బరి చిప్పలను కోతులు ఎత్తుకుపోయిన జ్ఞాపకం,తెప్పలలో నదిపైన భయపెట్టిన షికారు తప్ప ఇంకేమీ గుర్తులేదు..
పెళ్ళైన తర్వాత క్రిందటి సంవత్సరం వెళ్దామనుకొని మళ్ళీ ఎందుకో ఆ విషయమే గుర్తులేకుండా అయిపోయింది.మళ్ళీ క్రిందటి సోమవారం ఎందుకో శ్రీశైలం వెళ్ళాలని బలంగా అనిపించింది.అనిపించినదే తడవుగా శ్రీవారితో అన్నాను.వెంటనే ఒప్పుకోవడమే కాకుండా  బస్ టిక్కెట్లు,బస టిక్కెట్లు ఆన్లైన్లో చకచకా బుక్ చెసేసారు.
నాలుగో తారీఖు శనివారం ఉదయం ఆరుగంటలకు ఎంజిబిఎస్ నించి బస్సు,శ్రీశైలం వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది.మళ్ళీ ఆదివారం సాయంత్రం శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణం ఇది మా ప్లాను.
ఎప్పుడెప్పుడా అని చూస్తుండగానే శనివారం వచ్చేసింది.
స్నానం పూజాదికాలు కానిచ్చుకొని ఐదు గంటలకల్లా ఇంట్లో బయల్దేరాము. సరిగా సమయానికి చేరుకొని ప్రశాంతంగా ఎక్కి కూర్చున్నాము. మనసెంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది.శివయ్య దర్శనం,అందులోనూ నాకేంతో ఇష్టమైన అడవుల్లో పయనం.
ఒక మూడు గంటలు ప్రయాణించిన తర్వాత బస్సు ఎదో ధాభా దగ్గర ఆగింది..అక్కడ ఆత్మారాముడుని శాంతింపజేయడానికి అల్పాహారం తీసుకొని బస్సు ఎక్కాము.అక్కడనించి అడవులలో పయనం.
ఎవేవో అడవి పువ్వులు,పెద్ద పెద్ద పుట్టలు,చెట్లు,మధ్య మధ్యలో కాలి బాటలు.చందమామ కధల్లో వర్ణచిత్రం కళ్ళ ముందు ప్రయత్క్షమైనట్లు అనిపించింది.
ఉదయపు మంచుతెరలలో,ఆ ప్రకృతి రమణీయత నన్ను అలౌఖిక ఆనంద తీరలకు తీసుకొనిపోతుంటే,
హింస,అశ్లీలత ఎక్కువగా ఉన్న కొత్త కొత్త సినీమాలు వేసి బస్సు డ్రైవరు నన్ను వెనక్కి తీసుకొచ్చి పడేస్తున్నాడు..
మెల్లగా కాసేపటికి నిద్రాదేవి ఆవహించింది..
కొంతసేపటికి శ్రీవారు తట్టిలేపితే ఎదురుగా దృశ్యాన్నిచూసి మనసు  ఆనందంతో ఉరకలు వేసింది.కొండలు,మధ్యలో పాతాళగంగ,శ్రీశైలం డాం అన్నీ అద్భుతంగా కళ్ళకు తోచాయి.
అవన్నీ చూస్తుండగానే బస్సు గంగా సదన్ ముందు వచ్చి ఆగింది. దిగి మేము బుక్ చెసుకున్న మల్లిఖార్జున సదన్ కి వెళ్లాము.మల్లిఖార్జున సదన్ కొత్తది కావటం వలన సౌకర్యంగా,శుబ్రంగా ఉన్నది.

ముందు మేము చుడాలనుకున్న ప్రదేశాలన్ని ఒక కాగితంపైన రాసాము..
ఇదిగో ఆ లిస్ట్
1.సాక్షి గణపతి
2.శిఖరం
3.ఫాలధార పంచధార
4.పాతాళగంగ
5.చెంచు లక్ష్మి మ్యూజియం
6.శివాజీమ్యూజియం
7.ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం
8.అక్క మహాదేవి గుహలు..
ఇదీ నేను రాసినది .శ్రీవారు వెంటనే " అమ్మో ఇన్ని చుడాల్సినవి ఉన్నాయా ఇక్కడ నీకెలా తెలుసు" అన్నారు..
అందుకే మా బ్లాగులను తక్కువ అంచనా వెయ్యకూడదని చెప్పాను.. :)
సరే ఇవన్నీ ఎలా వెళ్ళాలో ఎప్పుడెప్పుడు వెళ్ళాలో ఎలా తెలుస్తుంది..మనిద్దరమే వచ్చాం అదీ బస్సులో వచ్చాం.ఇవన్నీ తిరగాలంటే ప్రత్యేకంగా కారులో రావల్సింది ఇలా పరిపరి విధాల ఇద్దరం ఆలోచిస్తుంటే.."అబ్బ ఎవరైనా ఉండి దర్శనం చేయించి ,ఈ స్థలాల గురించి చెప్తే ఎంత బాగుండును" అనిపించింది.
సరే ముందు అయితే బయటకు వెళ్దాం ఎలగో భోజనం చెయ్యాలి కదా అప్పుడు ఎవరినైనా అడిగి వివరాలు కనుక్కొని అప్పుడు బయల్దేరుదాం అని శ్రీవారి సలహా..
బయటకు వెళ్ళీ పక్కనే ఉన్న 'త్రిశూల్ ' లో భోజనం చేసి వివరాలు కనుక్కున్నాము..అందరూ చెప్తున్నారు కానీ ఏమీ అర్దం కావడం లేదు..ఒక్కటి తప్ప అన్నీ చూపించడానికి ఆటోలు ,జీప్లు దొరుతాయని..
గదికి వెళ్ళి స్నానాలు చెసి బయటపడ్డాం..అప్పటికి సమయం మధ్యాహ్నం  రెండు కావొస్తుంది..ముందుగా చూడాల్సినవి చూసి ఆదివారం ఉదయమే ప్రాతః కాల దర్శనం చేసుకుందామని అనుకున్నాము..
ఒక ఆటో అతను మనిషికియభై రూపాయిలు తీసుకొని
సాక్షి గణపతి,హటకేశ్వరం,శిఖరం,పాలధార పంచధార,పాతాళగంగ చూపిస్తానన్నడు కానీ అందరితో వెళ్తే కొంచెం ఎక్కువ సేపు ఎక్కడా గడపడానికి వీలవదు అనిపించింది అందుకే అందరి డబ్బులూ మేమే ఇచ్చి ఒక ఆటో ఎక్కాము.

సాక్షి గణపతి:
ముందుగా సాక్షి గణపతి ఆలయనికి వెళ్ళాము..
సాక్షి గణపతి అంతే జీవుడు బ్రతికి ఉండగా శ్రీశైలం దర్శించాడో లేదో సాక్షం చెపుతాడట..
అందుకే అక్కడ మన నామగోత్రాలు స్వామికి చెప్పుకోవాలట..
గుడి శిధిమైపోతున్న స్థితిలో ఉండడం వలన అక్కడ ఏవో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ..లోపలికి అనుమతించడంలేదు బయటనించే దర్శనం చేసుకొని వచ్చాము..    

హటకేశ్వరం,లలితాపీఠం:
తర్వాత పచ్చని చెట్ల మధ్య కొలువుదీరిన హటకేశ్వర లింగాన్ని దర్శించాము..
దారిలో ఎంతో మంది కాషాయ వస్త్రధారులు కనిపించారు కానీ వారు ఎవరినీ ఇబ్బంది పెట్టడంలేదు..ఎవరేమిచ్చినా తీసుకుంటున్నారు..వారిలో   నిజమైన యోగులు సిద్దులు ఎంతమందో..జనాల్ని ఆకర్షించడానికి ఆ రూపం ధరించేవారెంతమందో అనిపించింది.
హటకేశ్వరలింగావిర్భావానికి ఒక కధ ఉంది..
పూర్వం ఒక కుమ్మరి కుండలు చేసుకుంటూ జీవనం సాగించేవాడంట.
శ్రీశైలం వచ్చే యాత్రికులకు తన శక్తికొలదీ భోజనాలు పెట్టేవాడంట..
ఆయన త్వరలోనే యాత్రికులలో మంచి పేరు సంపాదించుకున్నాడంట..అది సహించలేని రాజుగారు ఆ కుమ్మరిని తన ఖడ్గముతో హతమార్చాడంట..
ఆ కుమ్మరి రక్తధారలతో లింగావిర్భావం జరిగిందని చెప్తారు..
దిగువ భాగంలో ఈ ఆలయం ఉంటే కొన్ని మెట్లు ఎక్కగానే లలితాపీఠం.
అమ్మవారు ఎంతో కళగా ఉన్నారు.:)
అమ్మ దర్శనం చేసుకొని అక్కడ కూర్చోబోతుంటే మా చిన్నప్పటి తెలుగు మాస్టారు కనిపించారు..నన్ను గుర్తు పట్టి కులాశాప్రశ్నలడిగెలోపే ఎవరో వచ్చి అయనను హడవుడిగా తీసుకెళ్ళిపోయారు..
కాని ఆయన అక్కడ కనిపించడం చాల ఆనందమయ్యింది.కొన్ని విషయాలలో ఇప్పటికీ ఉన్న క్రమశిక్షణకు ..దేవుడి పట్ల ,జీవితం పట్ల నాలో ఏర్పడిన భావాలకి చిన్నప్పుడు ఆయన చెప్పిన పాఠాలు నాపై ఎంతో ప్రభావం  చూపించాయి.:)

శిఖరం:
"శ్రీశైలే శిఖరం దృష్ట్వా | పునర్జన్మ నవిద్యతే"
శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని,ఈ జీవచక్రం నించి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని అంటారు.
బియ్యం ,నువ్వులు నంది పైన వేసి శిఖరాన్ని దర్శించుకోవాలని చెప్తారు.
బియ్యం నువ్వులు చిన్న చిన్న ప్లాస్టిక్ సంచులలో శిఖరం దిగువున అమ్ముతున్నారు..వాటిని లోపల దాచిపెట్టమని అమ్ముతున్న ఆవిడ అంటుంటే ఎందుకో అనుకున్నాను. శిఖరం మెట్లు ఎక్కుతుంటే బియ్యం నువ్వులు చేతులలో పెట్టుకున్నవారిపై కోతులు దాడి చేసి మరీ లాగేసుకుంటున్నాయి.  :)
ఆ బియ్యం నువ్వులు నంది పైన వేసి శిఖర దర్శనానికి ప్రయత్నించాము..కానీ మంచు తెరల వలన ఏమీ కనబడలేదు.. :(
శ్రీశైల శిఖరం.
కుమారస్వామి
ఎవరి చేతిలో ఉన్నాయో బియ్యం




ఇలా రాస్తూ పోతే టపా పెరిగిపోతుందండోయ్.
మరిన్ని విశేషాలు ఇంకోటపాలో .. :)



8 కామెంట్‌లు:

  1. పుణ్యక్షేత్రాన్ని కళ్ళకి కట్టినట్లు రాసారు.

    రిప్లయితొలగించండి
  2. Sikharam paina nandi bhale mudduga untundi...mottaniki tapa baagu baagu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి మీరన్నది నిజమే..ధన్యవాదాలు వ్యాఖ్యకు..:)

      తొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))