??????

14 జన, 2014

శ్రీశైలం...3

ముందు రోజు బాగా అలసిపోవడంచేత ఆదివారం ఆలస్యంగా ఏడుగంటలకు నిద్రలేచాము.రూం ఆన్లైన్లో బుక్ చేసుకోవడంవలన తొమ్మిది గంటలకల్లా ఖాళీ చేయాలి.హడావుడిగా స్నానం ,అల్పాహారం కానిచ్చుకొని రూం ఖాళీ చేసేసి సామాను క్లాక్రూంలో భద్రపరచి ,ఇష్టకామేశ్వరీ   గుడికి వెళ్ళడానికి కమాండర్ జీప్లు దొరికే స్టాండుకు వెళ్ళాము.
ఒక్కో జీప్లో పదిమంది ఎక్కితే కానీ జీపు కదలదట.పైగా ఒక్కొక్కరికీ ఐదువందలు ఛార్జ్ చేస్తున్నారు.అదేమిటని అడిగితే  "తిరిగొచ్చాక కూడా మిరిదే మాట అప్పుడు తగ్గిస్తానండీ " అన్నారు జీపు డ్రైవర్..
చాలా సేపు ఎదురుచుడాల్సి వచ్చింది పదిమంది జీపు ఎక్కడానికి.పదిమంది లేకపొతే తిరిగి వచ్చేయడమే తప్ప గుడికి వెళ్ళలేం.అదృష్టం బాగుండి ఒక గంట నిరీక్షణ తర్వాత పదిమంది పుర్తయ్యారు. ఒక పదికిలోమీటర్లు రోడ్డుమీద ప్రయాణించిన తర్వాత జీపు అడవిదారి పట్టింది.

ఇష్టకామేశ్వరీ దర్శనం:
అడవిలొపలికి వెళ్ళడం అదే మొదటిసారి .నాకు చిన్నప్పుడు చందమామ కధలలో వర్ణచిత్రాలు చాలా ఇష్టం .ముఖ్యంగా వాటిల్లో కనిపించే అడవులు.దానితో ఆ బొమ్మలన్నీ గుర్తు చేసుకుంటూ ,నిజమైన అడవి దారులతో వాటిని పొల్చుకుంటున్నాను.
పెద్ద పెద్ద రాళ్ళతో,గోతులతో దారి భయంగొలిపేలా ఉంది.ఒక్కోసారి జీపు పక్కకు ఒరిగిపోతుందేమోనని భయం వేసింది.కమాండర్ జీప్లు తప్ప మామూలు వాహనాలు వెళ్ళలేవు ఆ దారిలో.ఐదువందలు ఎందుకు తీసుకుంటున్నరో అప్పుడు అర్ధమయ్యింది మాకు.
దారి ఎంత భయపెడుతున్నా, చుట్టూ దట్టమైన అడవి ,పక్షుల కిలకిలారావాలు,చిన్న చిన్న వాగులు చూస్తుంటే..
అంతం సినిమాలోని "ఓ మైనా ..నీ గానం నే విన్నా" పాట గుర్తొచ్చింది. :)
ఇలా ఒక పదికిలోమీటర్లు ప్రయాణించిన తర్వత జీపులన్నీ ఒకచోట ఆగాయి.అక్కడినించి కొంచెం దూరం నడవాలి.ఒక చిన్నవాగు దాటి వెళ్ళినతర్వాత ఒక పెద్ద వాగు మధ్యలో వినాయకుడు దర్శనమిస్తాడు.రాతి వినాయకుని విగ్రహం ఎంతో సజీవంగా ఉంది.ఆయనకు అక్కడ చెంచులే పూజాదికాలు నిర్వహిస్తున్నరు.వాగు దాటి జారుడురాళ్ళ ద్వారా కొంచెం పైకి ఎక్కాలి. పాపం మాతో పాటూ వచ్చినవాళ్ళందరూ  పెద్దవాళ్ళు.వాళ్ళు ఆ వయసులో భారమంతా భగవంతునిమీద వేసి అంత కష్టపడుతూ ఎక్కుతుంటే ఎంతో సంతోషమనిపించింది.నమ్మకం మనిషిని ఎంతవరకైనా నడిపించగలదనిపించింది.
పైకి ఎక్కిన తర్వాత నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.
ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మామిడిచెట్లు,వాటికింద అమ్మవారి గుడి. కొంచెం దూరంగా గుడిమీద ఆధారపడిన చెంచుల పూరిళ్ళు.గుడిఎదురుగా లోయలో ప్రవహిస్తున్న కొండవాగు.ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం.ఎంతో మంది సాధకులు సాధన చేసిన పవిత్ర స్థలమట ఆ ప్రాంతం.అమ్మవారు ఇక్కడ ఒక గుహలో ఉంటారు.గుహలో దూరి మోకాళ్ళమీద నడిచి అమ్మవారి దర్శనం చేసుకోవాలి.
దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరిచేత అమ్మవారికి బొట్టు పెట్టిస్తారు .ఇలా పెట్టించడంలో ఒక విశేషం ఉంది.బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి విగ్రహం రాతిలా కాక మెత్తగా తగులుతుంది.ఇక్కడ అమ్మవారు నాలుగుచేతులతో ఒక చేతులో రుద్రాక్షమాల ,ఇంకో చేతిలో శివలింగం , మరో రెండు చేతిలలో కలువమొగ్గలతో,అర్ధనిమీలిత నేత్రాలతో ,ధ్యాన ముద్రలో ఎంతో విభిన్నంగా.కళాత్మకంగా ఉంటుంది.
జగద్గురు ఆదిశంకరాచార్యులు మొదట ఇక్కడ అమ్మవారిని దర్శించి కొంతకాలం ఇక్కడ సాధన చేశారంట.అమ్మవారి దర్శనం ఎంతో తృప్తినిచ్చింది.
తర్వాత అక్కడ ఉన్న పూరిళ్ళదగ్గరకు వెళ్ళాము.యాత్రికుల కోసం పత్యేకంగా ఒక ఇల్లు ఉంది.రాత్రుళ్ళు అక్కడ యాత్రికులు బస చేయడానికి వీలుందంట.అక్కడ విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి సోలర్ సిస్టమ్ని ఏర్పాటు చేశారంట ప్రభూత్వంవారు కానీ అవి సరిగా పనిచేయడంలేదంట. 
ఆలయంలో మా తెలుగు మాస్టారు మళ్ళీ అక్కడ కనిపించారు.అన్ని వివరాలు అడిగి ఎంతో ఆనందపడ్డారు.ఆయన భార్యకు మమ్మల్ని పరిచయం చేసారు.మాస్టార్ని సతీ సమేతంగా ఫోటో తీసుకోగలిగాను.
మా జీప్లో అందరూ అక్కడినించి బయల్దేరడంతో మేముకూడా బయల్దేరవలసివచ్చింది.
అమ్మవారి నిర్మల స్వరూపం ,ఆ పచ్చని ప్రకృతీ మనసునిండా నిండిపోయాయి.
శ్రీశైలం తిరిగి వచ్చేసరికి సమయం మధ్యాహ్నం రెండు అయ్యింది.భోజనం చేసేసరికి మూడు అయిపోయింది.
ఇంకో గంట మాత్రమే ఉంది సమయం.ఇంక దగ్గరిలోని చెంచులక్షి మ్యూజియం చూడదానికి వెళ్ళాము. 


జీప్ల దగ్గర అమ్ముతున్న పుస్తకాలు





అడవి పువ్వు




ముచ్చటైన మిధునం..:)

చెంచుల పిల్లలు



ఏకలవ్యుడు..:)

చెంచులక్ష్మీ మ్యూజియం:
గిరిజనుల్లో వివిధ తెగల గురించీ,వారు వాడే వివిధ రాకాల వస్తువుల గురించీ,వివిధ సంప్రదాయాల గురించి అక్కడ ఉండే మల్లన్న అనే గిరిజన యువకుడు వివరంగా చెప్తున్నాడు.
చెంచుల సంప్రదాయాల్లో ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది.పెళ్ళికాని ఆడపిల్ల ఇంట్లో ఉంటే మగ నెమలి ఈకలు ఇంట్లో ఉంచుతారు.అవిచూసి ఎవరైనా పెళ్ళిసంబందానికి వస్తారన్నమాట.పెళ్ళిసంభందం కుదిరితే ఒక ఆడనెమలి ఈకని ఆడపిల్లవారి గుడిసెమీద ఉంచుతారు.దానితో ఆ ఇంట్లో పిల్లకు పెళ్ళి కుదిరిందని ఊర్లో అందరికీ తెలుస్తుందన్నమాట.పెళ్ళైన తర్వాత ఆ ఆడనెమలి ఈకను అమ్మాయి తలలో అలంకరిస్తారు.అమ్మయి ఐదోతనానికి అది గుర్తన్నమాట.పెళ్ళై అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న మగనెమలి ఈకలను గుడిసెపైన ఉంచుతారు.అంటే ఆ ఇంట్లో అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోయిందనడానికి గుర్తన్నమాట. 
ఇలాంటి సంప్రదాయాలెన్నో మల్లన్న వివరించి చెప్తున్నారు కానీ సమయాభావంవలన మేము త్వరగా బయటకు వచ్చేసాము.

మల్లన్న


తర్వాత సామను క్లాక్రూమ్నించి తీసుకొని హడావుడిగా బస్సు ఎక్కాము.బస్సు సరిగ్గా సమయానికి బయల్దేరింది.
మళ్ళీ కొండల మధ్య ఘాట్ రోడ్ మీదుగా మలుపులు తిరుగుగుతూ ,అడవి దారులను దాటుకుంటూ ,హైవే మీదుగా సరిగ్గా రాత్రి పదిగంటలకల్లా ఈ గజిబిజి పట్టణంలో పడేసింది.  
కానీ,మనసు మాత్రం అక్కడే ఆ కొండల మధ్యనే ఉండిపోయింది.




  

6 కామెంట్‌లు:

  1. Good tour, well narrated. Good experience, best wishes.and happy ponagal.

    రిప్లయితొలగించండి
  2. చక్కగా వ్రాసారు. శ్రీశైలం వెళ్ళే వారికి మంచి సమాచారాన్ని అందించార. మీ కన్నయ్య తో కలసి పండగ బాగా జరుపుకోండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగరాణి గారు వ్యాఖ్యకు,మరియు కన్నయ్యను గుర్తుంచుకున్ననదుకు సంతోషమండి..:)

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. హరేఫల గారు నా బ్లాగుకు స్వాగతమండి.వ్యాఖ్యకు ధన్యవాదాలు..:)

      తొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))