??????

8 జన, 2014

శ్రీశైలం...2

 
తర్వాత నేరుగా ఫాలధార పంచధార కు వెళ్ళాము.

ఫాలధార పంచధార:
ఇది  జగద్గురువులు ఆదిశంకరాచార్యులు తపమాచారించిన ప్రదేశం.ఇక్కడే 'సౌందర్యలహరి', 'శివానందలహరి' రచించారు.
కిందకి దిగడానికి వీలుగా రాతి మెట్లు ఉన్నాయి.పచ్చగా ఉన్న కొండకిందకి ,ఆ రాతి మెట్లమీదనించి దిగుతుంటే ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో పాతకాలంలోలాగ అనిపించింది నాకు..:)
కిందకి దిగగానే కనిపించిన మనోహర చిత్రాన్ని వర్ణించడానికి నాకొచ్చిన పదాలు ఎంత మాత్రమూ సరిపోవు.మనసు,శరీరం ఆ పృకృతిమాత పచ్చని ఒడిలో పులకించుపోయాయి.అక్కడ ప్రవహిస్తున్న ఐదు ధారలలో నీరు ఐదు రుచులలో ఉండి ఆశ్చర్యపరిచింది.

మెట్లదారిలోనున్న ఈ చెట్టు భలేబాగుంది కదా




పాతాళగంగ:
కృష్ణా నదినే ఇక్కడ పాతాళగంగ అంటారు.పాతాళగంగలో స్నానమాచరించి దర్శనం చేసుకోవాలని చెప్తారు.
కిందకి దిగడానికి చాలా మెట్లు ఉన్నాయి.రోప్ వే ద్వారా కూడా కిందకి వెళ్ళొచ్చు.క్రింద బోటింగ్ కూడా ఉంది.మేము రోప్ వే ,బోటింగ్ కి కలిపి కాంబో టిక్కెట్ తీసుకున్నాము.రోప్ వే నాకు మొదటిసారి కావడంవలన చాలా ఉత్సాహంగా ఎక్కాము.
రోప్ వే భయపెడుతుందేమోననుకున్నాను.మాతో పాటు ఒక దంపతులు వారి నాలుగేళ్ళ పాపతో ఎక్కారు.
రోప్ వే రెండు నిమిషాలలో అయిపోయింది..భయం కాదు కదా అసలు అటు ఇటు ఒకసారి చూసేలోపే కిందకి దిగిపోయాం.
కిందకి వెళ్ళాక అక్కడ ఒక స్టీమరుబోటు ఉంది.వెంటనే నాకు చిన్నప్పుడు తెప్పలపై నదిమధ్యలోకి వెళ్ళిన సంగతి గుర్తొచింది.అక్కడ తెప్పలు దొరుకుతాయేమోనని ప్రయత్నించాము కానీ దొరకలేదు.వాటిని ఇప్పుడు అనుమతించడంలేదని తెలిసి నిరాశ పడ్డాము. ఇక చేసేదిలేక ఆ స్టీమరుబోటే ఎక్కాము.
సాయంసంధ్య వేళ నీరెండ అందాలలన్నీ తనలోనే దాచుకున్నట్లు ఉంది కృష్ణమ్మ.ఎటుచూసినా అందమైన కొండలు,ఎదురుగా డాం ,నల్లగా స్వచ్చంగా ఉన్న కృష్ణమ్మ.ఇంత అందమైన అనుభూతికి మనసు కూడా కృష్ణమ్మ పరవళ్ళకు పోటిగా ఉరకలు వేస్తుంది.
పదిహేను నిమిషాల బోటింగ్ తర్వాత పాతళగంగలో స్నానం చెయ్యలేకపోయామని కాళ్ళు కడుక్కొని,గంగా నీళ్ళు తలపై చల్లుకున్నాము.

కృష్ణమ్మకోసం పువ్వులుపసుపుకుంకుమలు..:)


కృష్ణమ్మ పరవళ్ళు

డాం

సూర్యాస్తమయం

తిరిగి పైకి వెళ్ళడానికి రోప్ వే ఎక్కాము.పైకి వెళ్ళేటప్పుడు కూడా పాపతో ఉన్న ఆ దంపతులే మాతో పాటు ఎక్కారు.
ఆయన బాగా చనువు గలవారిలా కనిపించారు.మా వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనుకోకుండా ఆయన గోదవరి వాసులే .అంతే కాకుండా శ్రీవారి పనిచేసే కంపెనీలోనె ఆయన ఉద్యోగం కూడా.
"మీరు ఇప్పుడు మాతో వస్తే దర్శనం చేయిస్తాను" అన్నరాయన.
"రేపు పంచమి కదండీ,అందులోను ఉదయాన్నే దర్శనం బాగుంటుందని రేపు పెట్టుకున్నమండీ దర్శనం" అన్నాను నేను.
"మీ ఇష్టం .కానీ శివాలయ  దర్శనం ఉదయం కంటే సాయంత్రం మంచిది.అందులోను సమస్త దేవతలూ సాయంత్ర వేళలో శ్రీశైలంలోనే ఉంటారు " అని చెప్పారు ఆయన.

స్వామీ,అమ్మ దర్శనం:
ఇలాచెప్పటంతో  దర్శనం అప్పుడే చేసుకుందామనుకున్నాం.
కానీ ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక "ఫర్వాలేదండీ మేమువెళ్ళి చేసుకుంటాం .మీకెందుకు శ్రమ " అని చెప్పాము.
ఆయన దానికెంతమాత్రము ఒప్పుకోకుండా భార్య,పాపతో సహా మాతో పాటూ గుడికివచ్చారు .
అక్కడ ఆయన అత్తమామలు ఆరునెలల బుజ్జి పాపతో ఎదురుచూస్తున్నారు.ఆ పాప ఆయన చిన్న కూతురంట.
నాతో రండి అని చెప్పి ఆయన నేరుగా మమ్మల్ని గర్భగుడిలోనికి తీసుకెళ్ళిపోయారు.అక్కడ శివలింగం తాకించి దర్శనం చేయించారు.అక్కడ ఆలయంలో ఆయనకు అందరూ తెలిసిన వాళ్ళులా  కనిపించారు..ఆయన శ్రీశైలం తరచుగా వచ్చివెళ్తుంటారని  మాకు చెప్పారు.
బయటకు తీసుకొచ్చి, శనివారం త్రిఫల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చెస్తే మంచిదనీ.తొమ్మిది ప్రదక్షిణలు చేయమని చెప్పి చేయించారు.తర్వాత స్వామి వారి శయన మందిరానికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారిని మనసారా ప్రార్ధించి మనసులో ఉన్న కోరిక తెలుపమన్నారు.తర్వాత 'సరస్వతీ అంతర్వాహిని' గుండంలో శిఖర ప్రతిబింబం చూపించారు.పంచ పాండవ ప్రతిష్ఠిత లింగాలను,సీతా ప్రతిష్టిత సహస్ర లింగాన్ని చూపించారు.
అక్కడే ఉన్న వేద పాఠశాలను చూపించి వివరంగా చెప్పారు.
తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న మద్దిచెట్టు కింద మమ్మల్ని కూర్చోమని చెప్పి
"ఇక్కడ భగవంతుని  ప్రార్ధించండి..కొంత సమయం ఈ చెట్టుకింద గడపండి ఎంతో మంచిది" అని చెప్పి అక్కడే మెట్లపైన కూర్చున్నఆయన కుటుంబం దగ్గరకు వెళ్ళారు.
మేము కాసేపు కూర్చున్నతర్వత తీసుకెళ్ళి అమ్మ దర్శనం చేయించారు..
బయటకు తీసుకెళ్ళి ప్రసాదం కౌంటర్ చూపించారు..
మీము ఎంత చెప్పినా వినకుండా మాతో పాటూగా వచ్చి క్లాక్  రూం చూపించారు.
తర్వత ఆయన బసదగ్గర భోజనం చాలా బాగుంటుందని భోజనానికి రమ్మని చెప్పారు.
వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము వెళ్ళలేదు.
ఆయన వీలైతె రేపు కలవమని చెప్పి ,మేము వెళ్ళాలనుకుంటున్న ఇష్ట కామేశ్వరి గుడికి ఎలా వెళ్ళాలో చెప్పారు.
తర్వాత ఎంతో సంతృప్తిగా మానించి వీడుకోలు తీసుకున్నారు.

నా అనుభూతి:
తర్వాత రూం కి వచ్చి స్నానాలు చేసి భోజనం చేసాము.శరీరం  బాగా అలసిపోవడంచేత నిద్ర ముంచుకొస్తుంది.కళ్ళు మూయగానే
శివలింగ స్పర్శాదర్శనం గుర్తొచ్చి మనసు ఆనందానుభూతికి లోనయ్యింది. మేము మద్దిచెట్టు కింద కూర్చున్నాప్పుడు ఆలయ ప్రాంగణంలోనున్న క్యూ  గుర్చొచ్చింది..అంత పెద్ద క్యూలో ఉంటే స్వామివారి స్పర్శాదర్శనం  ఎంతమాత్రమూ వీలుపడేది కాదు.అక్కడ దర్శనం చేస్సుకోవడం తప్ప ఇంకేమీ చూసెవాళ్ళంకాదేమో తెలియపోవటంచేత. అసలు ఆయన ఎవరో మనమెవెరమో మా చేత ఎందుకలా అద్భుతమైన దర్శనం చేయించారో అని చాలా ఆశ్చర్యం ,ఆనందం కలిగాయి.
అప్పుడు నేను శ్రీశైలం వచ్చినవెంటనే "అబ్బ ఎవరైనా ఉండి దర్శనం చేయించి ,ఈ స్థలాల గురించి చెప్తే ఎంత బాగుండును" అని అనుకున్న సంగతి గుర్తొచ్చింది.నా విన్నపాన్ని మన్నించి ఆ పరమేశ్వరుడే ఆయనను పంపించాడేమోనని అనిపించింది.
పరమేశ్వరానుగ్రహానికి ఆ ఆనందం వర్ణనాతీతం.భగవంతుని  ప్రేమకు ఏమిచ్చుకోగలము కళ్ళ వెంట వస్తున్న ఆనందాశృవులు తప్ప. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత ప్రశాంతత ,ఆనందం మనకెంతో హాయినిచ్చింది.ఎప్పుడు నిదురపోయానో కూడా తెలియలేదు.

మరిన్ని విశేషాలు ఇంకో టపాలో..:)

2 కామెంట్‌లు:

  1. నిజంగా మీకు కలిగిన దర్శనభాగ్యం ఒక అద్భుతం . మీ అనుభూతిని మీరు చక్కగా వివరిస్తూ మమ్మల్ని కూడా శ్రీశైలం తీసికెళ్ళిపోయారండీ! చాలా బాగుంది .

    రిప్లయితొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))