??????

12 ఫిబ్ర, 2013

బ్రోచేవారెవరురా...

ఒకానొక ఆదివారం సాయంత్రం..
తెల్లారితే సోమవారం..ఆఫీసు..మేనేజరు..ఇష్యూషు..
గుర్తొచ్చి ఎంతసేపటికీ వదలని బెంగ.ఆ బెంగలో ఒక నిర్ణయం..పోనిలే రేపు త్వరగా వచ్చేద్దాం అనుకొని అలాగే దిగాలుగా పడుకొని
పొద్దున్న లేచి ఆఫీసుకి వెళ్ళీ,టీ బ్రేక్కి కూడా వెళ్ళకుండా పనంతా ముగుంచుకొని, అయిదున్నరకల్లా తట్ట బుట్ట సర్దేసి కేబ్ ఎక్కేసి ,ఆరు గంటలకల్లా
'ఎం ఎం టి యెస్'
స్టేషన్ కి వచ్చేసి..అక్కడ 'జే ఎన్ టి యు' వెళ్ళే  ఒక సర్వీసు ఆటో ఎక్కి కూర్చున్నాకా,
అప్పటిదాకా ఆఘమేఘాల మీద సాగిన మన ప్రయాణం కాస్త కుంటు పడుతుంది.

సర్వీసు ఆటో అంటే తెలియని వాళ్ళకి
(అసలు ఆటో అనగా అందులోను సర్వీసు ఆటో అనగా ఏమనగా
అనగనగా ఒక బుజ్జి ఆటో . ముచ్చటగా మూడే చక్రాలతో శోభిల్లే  త్రిచక్ర రధము . స్కూటర్కి ఎక్స్తెన్షన్ లాగాన్నమాట.రధసారధికి(డ్రైవర్) కాక వెనకాల ఇంకా ముగ్గురు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుంది.


ఇంకా ఈ ఆటోలలో సర్వీసు ఆటోలు కలవు.ఇవి కూడా పసుపు రంగులో మూడే చక్రాలతో మామూలు ఆటోలకన్నా కొంచెం చిన్నవిగా ఉండును.ఇక్కడ ఆటోలో ముగ్గిరికే చోటు ఉన్నా రధసారధి  గారి మనసు చాలా విశాలమవటంచేత  ఎనిమిది మందికి (వెనకాల నలుగురు ఆడవాళ్ళు..ముందు ముగ్గురు మగవాళ్ళు)తక్కువ కాకుండా ఆటో కదలలేదు.మీరు సర్వీసు ఆటో ఎక్కినచో ఒక్కొసారి మీకు మూడు చేతులున్నట్లు ఇంకోసారి మీకు అసలు చేతులే లేనట్లు అనిపించి ఒక వింత అనుభవానికి గురి అయ్యెదరు.ఇక కాళ్ళు, అక్కడే ఎక్కడో ఉండును..ఎవరో ఒకరు తొక్కగానే ఎక్కడ ఉన్నయో ఖచ్చితముగా తెలియును.అంతవరకూ నిర్భీతిగా కూర్చున్నామనిపించుకొని మనదగ్గర ఉన్న పర్సు వగైరాలు మాత్రం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండవలెను   )




అంచేత ఎనమండుగురూ ఆటో ఎక్కేవరకూ ఈగలు ..దోమలు బాగా  తోలుతూ మునిసిపాలిటీ వారికి సహకరించాలన్నమాట.
ఒక పది ఆటోలు వరసగా ఉంటాయి.ఒక ఆటో పూర్తి అయ్యిన తర్వాత ఇంకో ఆటో అన్నమాట.అన్ని ఆటోల్లోనూ అమ్మాయిలుంటారు వెనకాల సీట్లో కూర్చొని ముందు సీట్లొ వచ్చి కూర్చోని ఆటోని కదిల్చి జీవితానికి మోక్షాన్ని ప్రసాదించే "మగధీరుల " కోసం ఎదురు చూస్తూ ..
అలా వెనకనున్న అమ్మయిలలో నేనూ ఒకతెను .ముందు ఇంకా ముగ్గురు అబ్బయిలు రానిదే ఆటో కదలదు.ఒక లోకల్ ట్రైన్ వచ్చేసరికి బిల బిల మంటూ జనం బయటకు వస్తుంటే మమ్ము బ్రోచే నాధులెవరా అని ఎదురు చూడగా చూడగా ఒక ఇద్దరు వచ్చి ఆటో ఎక్కేయగానే హమ్మయ్య ఇంకా ఒక్కరే అని ఊపిరి తీసుకున్నానా?
ఆ ఒక్క మగాడు ఎంత సేపటికీ రాడే ..
దోమలు కూడా అయిపోయాయు ఆటోలో అందరూ కొట్టేసే సరికి.
ఆరున్నర ..ఆరునలభై ఊహూ .. ధీర ధురంధరుడు ఇంకా రాడే
నీరసం..కోపం...
ఇంతలో చీకటిలోనించి ఒక రూపం నేను కూర్చున్న ఆటో దిశగా వస్తుంది..
"అమ్మాయా?అబ్బయా?" నేను
ఆ రూపం దగ్గరవుతుంది..
"హమ్మయ్య అబ్బాయే..ఎక్కుతాడో లేడో..ఈ మగడు కూడా ఏ బైకో ఎక్కి వెళ్ళిపోతాడో? " నేను
వచ్చేస్తున్నాడు..ఇటువైపే ..


ఎక్కేస్తున్నాడు..ఎక్కేశాడు.
మగడు కాస్తా మగఢీరుడై ఆటొని కదిపాడు..
నాకు ఆనందంతో కల్లళ్ళో నీళ్ళు వచ్చాయి..


ఆ పురుషోత్తముని చూసి నా మది పరవశించి


"మగధీర నువ్వె ఆటో ఎక్కరా..
నువ్వు లేక ఆటో కదలలేదురా.."
(మగధీర నన్నే చేకొనరా పాట)

"పురుషోత్తమా ..
ఎదురుచూసితిమయ్యా మేము పురుషోత్తమా..
నువ్వు ఆటో ఎక్కవయ్యా కోనేటిరాయడా"

"ధీర ధీర
ఆటో కదలలేదురా
చేరరార శూర
సీటందుకో దొర
(సారీ అక్కడ సీటు ఉండదు పాపం) "


"కుంభి నికర కుంభస్థ గురు కుంభి వలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి  శమదృతి ఛత్రపతి
(అంటే ఏంటని అడక్కండి నాక్కూడా తెలీదు..)  "


అని
గతుకుల్లో ఎగిసిపడే ఆటో నా పాటలకు తాళం వేయగా, నాకు తోచిన పాటల పుష్పాలు..ఆటో దిగేవరకు మనసులోనే పాడేసుకుంటూ ఆ ధీరుని పదపద్మములకు అర్పించాను..




14 కామెంట్‌లు:

  1. మా అడవి వైపుకి వచ్చే షేరాటోలదీ ఇదే పరిస్థితి !! ఆరుగురో ఏడుగురో ఎక్కితే కానీ కదలదు ! ఆ ఒక్క ".." కోసం అక్షరాలా అరగంట కూచున్న రోజులున్నాయ్! మరో దారి లేదు.. అరగంట పట్టినా ఎలాగోలా నడిచివెళ్దామన్నా చెట్లు తుప్పలు తప్ప పిట్టైనా ఉండని దారి భయపెడుతుంది :(
    ఇక అందుకేనేమో ముందర కూడా ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారిక్కడ.. (నే చచ్చినా అలా కూచోలేను..:))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పగా వినడమేనండీ..ముందు ఆడవాళ్ళు ఎక్కేస్తారా??
      వ్యాఖ్యకు ధన్యవాదాలు తృష్ణ గారు..:)

      తొలగించండి
  2. బాగుందండీ మీ టపా.. బాగా నవ్వించారు..
    పొనీ బండి కొనుక్కోపోయారా ;-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బండికో పెద్ద కధ ఉందండీ..:)
      చెట్లో పుట్లో తప్ప దారి సరిగ్గా చూసి నడపనని శ్రీవారికి నా మీద బోలెడంత నమ్మకం..పల్లెటూరి డ్రైవింగుతో పట్నంలో నడపలేనని కామెంటూనూ..:)

      తొలగించండి
  3. అంత ఓపికగ కూర్చున్న ధీర వనిత, మగధీరునికోసం ఎదురుచూపులేల,మీరు ఒక రెండు చక్రాల రధమును తీసుకున్న ఈ తిప్పలు తప్పును కధ బాల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును కదా.. :) :)
      బాగుందండీ మీ టపా..

      తొలగించండి
    2. ప్రియా గారు,పార్వతి గారు..నా బండి కధను పైన శిరీషా గారికి చెప్పాను చూడండి..:(
      వ్యాఖ్యలకు ధన్యవాదాలు..:)

      తొలగించండి
  4. ee post ni printout theesukoni...meeru ekkina auto driver ki isthe..ee problem ki solution vuntundemo ;-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎదురుగా చూస్తున్నా చలనం లేని వాళ్ళకి..ఇవన్నీ ఒక లెక్కా చెప్పండి.ధన్యవాదాలు వ్యాఖ్యకు..:)

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. నా బ్లాగుకి స్వాగతం డేవిడ్ గారు..టపా నచ్చినందుకు ఆనందం..:)

      తొలగించండి
  6. అమ్మతల్లో! మీకు ఆటో ఏడుగురువస్తేనయినా కదులుతుంది, మాకో అది పది పన్నెండు మంది ఉడాలి :) ఆటో ఎక్కితే ప్రాణాయామం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మాకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాబోయ్ తాతగారు..అటువంటి ఆటోలవలన ప్రమాదం కదండీ??
      ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు..:)

      తొలగించండి
  7. :) అయితే ఆటో ఎక్కడం వలన బహుళ ప్రయోజనములు (వింత అనుభవాలు, ఈగల/దోమల నివారణ, మున్సిపాలిటీ వారికి సహకరణ, కవిత్వం, పేరడీలు, ప్రక్క వాయిద్యం, వగైరా) కలవనమాట ;)

    రిప్లయితొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))