??????

23 జన, 2013

ప్రేమలో పడ్డాను



అవును నిజమండి.
అలాగిలా కాదు పీకల్లోతు ప్రేమలో

పెళ్ళైన భారతనారీపతివ్రతాసాధ్వీశిరోమణివనుకుంటుంటే  ఈ ప్రేమేమిటో?నువ్వేదో మంచి పిల్లవనుకున్నామని దండకము మొదలు పెట్టేముందు ఒక్కసారి టపా పూర్తిగా  చదవ మనవి.
నేను ప్రేమలో పడింది ఇదిగో దీనితో..




తెలుపు,గులాబీ,వంగపండు రంగులు రకరకాలుగా మేళవించి గుత్తు గుత్తులుగా పూసే ఈ పువ్వులు నా మనసు దోచేసుకున్నాయి.కాసియా జవానికా అంట ఈ మొక్క పేరు.ఈ మొక్క ఎలగయినా పట్టేయాలని గూగులమ్మను అడిగితే,అమేరికా వంటి దేశాలలో ఆన్లైన్లోనే   దొరికేస్తున్నాయి కానీ ఇక్కడ దొరకడం లేదు..వరసగా ఇక్కడ ఉన్న నర్సరీలన్నింటికీ ఫోను చేస్తుంటే ఎన్ని మొక్కలు కావలి అంటారు..ఒక్కటంటే ఒక్కటేనండి అన్నామనుకోండి.."కడియం నించి తెప్పించాలండి..ఒక్కటైతే తెప్పించలేము" అని చెప్పేస్తున్నారు..:(
నేను ఊరుకుంటానా??వారాంతంలో దీని వెతుకులాటే నా పని.ఇంకా మా సారుకి చెప్పలేదు.చెప్తే,
"దేవీ
నీకేల ఈ పనికిమాలిన తపన
దేనికోసం ఈ సోధన.
నాకు తీరని వేదన.??"
అని లబోదిబోమంటారు.:D
చూశారా నన్ను అనవసరంగా అపార్ధం చేసుకున్నారు.
ఈ పాపం ఊరికే పోదు..మొక్క దొరకాలని నన్ను (నాకు తెలిసేలా..;)) ఆశీర్వదించి పాపానికి పరిహారం చేసుకుంటేనే,ఒక పూట నూనె వేపుడు(నరకంలో) తగ్గుతుంది:)

16 జన, 2013

విశేషాలేంటంటే...!

పండక్కి ఊరెళ్లొచ్చేశానోచ్..
మరి విశేషాలన్నీ మీకు చెప్పాలి కదా..
లేదు లేదు చెప్పను..చూపిస్తాను..
మౌస్ చక్రంపైన వేలు పెట్టి నాతో పాటూ కిందకి జారిపోండి మరి..:)

ఇంటికి వెళ్ళే దారిలో:
ఊరిలోకి ప్రవేశించాక ఇంకొక అయిదు నిమిషాలలో ఇల్లు వచ్చేస్తుందనగా..
ఆత్మీయంగా పలకరించే గోదారి గాలి ఎంత హాయో..:))



ఊడుపులు తీస్తున్నారు కనిపిస్తుందా??



ఆ పడవ ఎప్పుడూ అక్కడ అలానే ఉంటుంది.ఈ చోటంటే నాకు భలే ఇష్టం

మంచు కురిసేవేళలో:
ఉదయాన్నే నేను,నాన్నగారు,చెల్లి,శ్రీవారు వాకింగ్కి వెళ్ళాం..ఆ ఉషోదయపు అందాలు





 కుప్పనూర్చిన వడ్లు తినవచ్చిన చిగురాకులలో చిలకమ్మ కనిపిస్తుందా??

ఇవి గ్రామఫోన్ పువ్వులు.తూటు పువ్వులు అని కూడా అంటారు

పెరటి అందాలు:
పెరట్లో అమ్మ నాన్నా పెంచుకొనే మొక్కలు..ఎన్నెన్ని మొక్కలో..ఎన్నెన్ని పువ్వులో..వాటిలో కొన్ని

తులసీ వనం










ఈ మామిడి చెట్టు పళ్ళు ఎంత బాగుంటాయో

సంక్రాంతి ముగ్గులు:

చెల్లి చేసిన గొబ్బెమ్మలు..సున్నుండల్లాగా ఉన్నాయని తెగ ఆట పట్టించాం:)

గొబ్బెమ్మలు పెడుతున్న నేను చెల్లి.

ఇది సంక్రాంతి గొబ్బెమ్మ

నేను వేసిన సంక్రాంతి రంగవల్లి
ఇవండీ సంక్రాంతి కబుర్లు..హమ్మయ్య మీతో పంచేసుకున్నాను.ఇప్పుడు మనసుకు హాయిగా ఉందనుకోండి..:))


7 జన, 2013

సంకురాత్రి పండగొచ్చె గొబ్బియళ్ళొ ....


హేమంత ఉదయం..
తెలతెలవారుతుంది..
దూరంగా గుడిలోనించి లీలగా వినిపిస్తున్న తిరుప్పావై..
గిన్నెలోకి పడుతున్న పాలధార శబ్ధం.
అమ్మ గాజుల చప్పుడు..
పట్టీల సవ్వడి..
గిన్నెల మోత..
"లేవండే..బారెడు పొద్దెక్కింది" అయిదో సారి అమ్మ పిలుపు.
యబ్బే అప్పుడే నిద్రలేవకూడదు.
"అమ్మా కాసేపమ్మ ప్లీజమా" అని చెప్పేసి,ఇటునించి అటు తిరిగి దుప్పటి ముసుగెట్టాలి.
"ముగ్గు వెసేస్తున్నాను..ఆనక గొబ్బెమ్మలు కూడా నేనే పెట్టేస్తాను.నీ ఇష్టం.." అని అమ్మ అంటుందా?
" అమ్మో గొబ్బెమ్మలా..వచ్చేస్తున్నా.." అనేసి చక చకా మంచం దిగిపోవాలి.
కింద కాలు మోపగానే అరికళ్ళలో చలివాత పడుతుంది అందుకని ఒక్కసారే కాలు కింద పెట్టకూడదు..మెల్లగా ఒక పద్దతి ప్రకారం పెట్టాలన్నమాట.అంత చలి మరి.అందుకని ఆ దుప్పటితోనే ఆవులించుకుంటూ బయటకు వచ్చేయాలి...వాకిట్లోకి వెళ్ళగానే కొబ్బరాకులను ముద్దాడిన మంచు కరిగి మన నెత్తి మీద పడకుండా దుప్పటి ముసుగేసుకోవాలి..దుప్పటి కింద పడకూడదు అమ్మ తంతుంది.
అలా జాగ్రత్తగా దుప్పటి పట్టుకొని వాకిటి ముందు గొంతుక్కూర్చొని మెల్లమెల్లగా కళ్ళు తెరవాలి.
అప్పుడెమో..ఎదురుగా   పచ్చని పేడ కళ్ళాపీ చీర కట్టుకొని నవ్వుతున్న వాకిలమ్మ మనల్ని పలకరిస్తుంది.
వాకిలమ్మను ముగ్గు పిండితో సింగారిస్తున్న అమ్మ నిండు గాజుల చేతులు భలే టింగ్ టింగ్మంటాయి.మనకు కూడా పెద్దయిపోయి ఎప్పుడెప్పుడు ఆ గాజులు వేసేసుకుందామా అనిపించేస్తుంది అది వేరేవిషయంలెండి.


 బొటన వేలు చూపుడు వేలు మధ్యనించీ ఎంతో వడుపుగా ఒక్కో చుక్క సమానమైన దూరంలో పెడుతున్న అమ్మని చుస్తుంటే,
"దేవుడు ఆకాశం లో అన్ని చుక్కలు ..అంతందంగా ఎలా పెట్టుంటాడో ?"అని ఇదే కొబ్బరిచెట్టు కింద వేసంకాలం రాత్రుళ్ళు  కరెంట్ పోయినప్పుడు మడతమంచమ్మీద పడుకొని ఆకశంలోకి చుస్తుంటే వచ్చిన సందేహానికి సమాధానం లభిస్తుంది.
బహుశా ,ఒకానొక యుగపు ఉదయాన మనుషులెవరూ ఇంక నిద్ర లేవకముందే  మొహినీ రూపం దాల్చినట్టు అమ్మ రూపంలో ఇలాగే ఆకాశ వాకిలిలో పెట్టేసుంటాడు కదా.
చుక్కలు పెడుతూ,వాటిని కలుపుతూ ,ఆగి,వంగీ,కూర్చొనీ,నిల్చొనీ ఎంతో దీక్షతో అమ్మ ముగ్గు పెడుతుంది కదా..
బహుశా రోజంతా హడావుడిగా,ఒక్క క్షణం కూర్చొని కాఫీ తాగడానికి కూడా సమయం లేని అమ్మకు
ఎవరినీ ఎమీ అడగకుండా..సర్వస్వతంత్రతతో..తన అభిరుచికి తగ్గట్టు చెసే పని ముగ్గేనేమో అని అనిపించక మానదు.
అందుకే దానిలోనే లీనమైపోయి,మధ్య మధ్య మురిసిపోతూ ముగ్గు పెడుతున్న అమ్మను అలానే చూస్తూ ఉంటే భలే ఉంటుంది.


"ముగ్గు చాలా బాగుందొదినా." అని పక్కింటావిడో..వెనకింటావిడో అందనుకోండి  ఏనుగెక్కినంత సంబరపడిపోతున్న అమ్మను  మనం దొంగచాటుగా చూసేయ్యాలన్నమాట.
అలా ముగ్గు వేయడం అయిపోయాకా,ముందుగా సిద్ధం చేసిన గొబ్బెమ్మలు తీసుకొస్తుంది అమ్మ.
అప్పటికి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది కదా మనకి.దుప్పటి పక్కన పడేసి రంగంలోకి దిగాలి.

ముగ్గు పెట్టడం కన్నా గొబ్బెమ్మలు పెట్టడం ఎంత సరదాగా ఉంటుందో కదా
అన్నింటికన్నా పెద్ద గొబ్బెమ్మను ముగ్గు మధ్యలో పెట్టాలి.దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మల్లను పెట్టాలి..తల్లి చుట్టూ పిల్లలు చేరినట్లన్నమాట..ఆ తర్వాత అక్కడక్కడా ముగ్గుకు తగ్గట్టు పెట్టాలి...చివరిగా
రాత్రంతా అలిగి ఆకాశం ఎక్కి కుర్చున్న నెలవంకను..అమ్మ బుజ్జగించి ముగ్గుపిండి వేసి ..చిట్టి చామంతి రేకులు నింపి నేలమ్మ ఒళ్ళో బజ్జోబెడుతుందా.ఆ అలక తీరిన చందమామపైన కూడా ఒక చిట్టి గొబ్బెమ్మ పెట్టాలన్నమాట. లేకపోతే మళ్లీ ఆకాశంలోకి పారిపోతాడు మరి.పెట్టడం అయిపోయిందా..
ఇపుడేమో చక్కగా అన్ని గొబ్బెమ్మలమేద పసుపుకుంకుమలు జల్లి,గుమ్మడి పూలూ బంతి పూలు వాటి తలల మీద గుచ్చాలి.
గొబ్బెమ్మలు పెట్టడం అయిపోయిందన్నమాట..ఆగండాగండి అప్పుడే వెళ్ళిపోకూడదు.
నేలమ్మ పచ్చగా మెరిసిపోతుంటే..వెన్నెల పొడి జల్లినట్టుండే ముగ్గుమీద పచ్చని గొబ్బెమ్మలు. ..అసలు గొబ్బెమ్మలంటే గోపికలంట..అందుకే కృష్ణయ్య కోసం అలంకరించుకున్న గోపెమ్మల్లా ఎంత బాగుంటాయో ..
పసుపురంగు బంతిపూలు..గుమ్మడి పూలు తో కళకళలాడిపోతూ మనల్ని చూసి నవ్వుతాయేమో


"ఇంకా ఎంత సేపే??" అని అమ్మ అరిచేదాకా
ఆ నవ్వులు చూస్తూ చుట్టూ ఉన్నవాళ్ళు మనకి పిచ్చనుకున్నా సరే ,మనలో మనం ముసిముసిగా నవ్వేసుకొని,మనల్ని మనం తెగ మెచ్చేసుకొని..
 లోపలికి రావాలి.
కానీ గొబ్బెమ్మలు పెట్టాలంటే పెద్ద పెద్ద వాకిళ్ళు కాకపోయిన అసలు వాకిలైనా ఉండాలి కదా..అసలైనది పేడ దొరకాలి.(ఎమో అవి కూడా మైనం పళ్ళలాగా కొంతకాలానికి మైనం గొబ్బెమ్మలు వస్తాయేమొ. కదా?)  హ్మ్మ్ ఇవన్నీ ఒకప్పటి పల్లెటూరి బాల్యపు  ముచ్చట్లు ఇప్పుడెక్కడా ఈ అపార్ట్మెంట్ల పక్షులకి ముగ్గులు గొబ్బెమ్మలు ఎక్కడివని దిగులుపడిపోయి కుర్చోకూడదు..చక్కగా నాలాగే ఆఫీసులో శెలవు పెట్టేసి పండక్కి నాలుగురోజుల ముందే ఇంట్లో వాలిపోవాలి..

అప్పుడెంచక్కా,
గొబ్బిళ్ళేం భాగ్యం?
గొబ్బి పాటలు,
హరిదాసు పాటలు వినొచ్చు.

అందరు పంచుకొనే రకరకాల పిండి వంటలు తినొచ్చు.



భోగి పిడకలెయ్యొచ్చు..
ఆ పిడకలు మంటలో వెయ్యొచ్చు..


ఆఖరి రోజున రధం ముగ్గేసి మన రధం తాడుని తూరుపు దిక్కు రోడ్డు మీదకు తీసుకెళ్ళి పక్కింటి ఆంటీ రధంతో కలిపెయ్యొచ్చు

అబ్బో బోలెడన్ని చెయ్యొచ్చు.
వీలుపడనివారు 
"నాలుగు రోజులే?" అని ఉడుక్కోకూడదు మరి.
అసలే మా శ్రీవారు కొత్తల్లుడు ఈ పండక్కి..;).
వీలైనవారు
ఇలా అనగానే అల్లా ఎగిరిపోవడం కాదు.
 మీది కూడా మా ఊరిలాగానే అంతర్జాలంలో ఇంకా చిక్కని ఊరైతే
బ్లాగ్మిత్రులందరికీ పండగ శుభాకాంక్షలు కూడా చెప్పేసి మరీ వెళ్ళాలి ...
వచ్చేటప్పుడు బోలెడన్ని విశేషాలు మోసుకొస్తానని కూడా చెప్పాలి.

అన్నట్టు చెప్పడం మరిచాను..నాలుగు రోజులకి కదా వెళ్లేది..
ఎంచక్కా మీకు నచ్చిన పుస్తక్కలు ఒకటో రెండో పెట్టుకోండి. ఎక్కువొద్దు బరువు..
ఏ మధ్యాహ్నమో అమ్మ చేతి కమ్మని వంట తిన్నాక, మామిడి చెట్టుకిందో  ,కొబ్బరి చెట్టుకిందో పుస్తకం చదవాలనిపిస్తే ఎలా మరి??

అంచేతా..
ప్రియమైన బ్లాగ్మిత్రులారా ..!
మీ అందరికీ ముందస్తు
సంక్రాంతి శుభాకాంక్షలు..


"పాడి పంటలు పొంగే వేళ ,
సిరులు కురిసే వేళ,
మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆశిస్తూ  ..

ధాత్రి "